వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బొత్స ?
వైసీపీలో సర్వ సత్తాక నాయకుడు ఎవరు అంటే వైఎస్ జగన్ అని వేరేగేఅ చెప్పాల్సిన పని లేదు. జగన్ చరిష్మాతోనే పార్టీ నడుస్తోంది.
By: Satya P | 27 Jan 2026 1:00 AM ISTవైసీపీలో సర్వ సత్తాక నాయకుడు ఎవరు అంటే వైఎస్ జగన్ అని వేరేగేఅ చెప్పాల్సిన పని లేదు. జగన్ చరిష్మాతోనే పార్టీ నడుస్తోంది. జగనే చాలా సార్లు చెప్పినట్లుగా వైసీపీ ఆయనతోనే మొదలైంది. తొలిసారిగా వైసీపీ గుర్తు మీద గెలిచింది జగన్ ఆయన తల్లి విజయమ్మ. ఇక వైసీపీ 2011లో పుడితే నాటి నుంచి నేటి దాకా ఎందరో చేరారు, ఎందరో బయటకు వెళ్ళిపోయారు. అలాంటి పార్టీలో గ్లామర్ అయినా గ్రామర్ అయినా జగన్ మాత్రమే. ఆయనను చూస్తే జనాలు ఓట్లు వేస్తారు, ఆయన వల్లనే పార్టీ బలపడుతుంది. ఇదే నిజం.
కొత్తగా సృష్టి :
సో వైసీపీలో ఇపుడు కొత్త చర్చ అయితే సాగుతోంది. అదేంటి అంటే ఈ పార్టీ పదిహేనేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. దీని వల్ల పార్టీ దైనందిన వ్యవహారాలు అన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ చూసుకుంటారు అని అంటున్నారు. కీలక సమయాలలో అధినేత జగన్ ముందుకు వస్తారు అని చెబుతున్నారు. నియామకాలు పార్టీలో నిర్ణయాలు అన్నీ కూడా అధినాయకత్వమే చేపడుతుంది. కానీ పార్టీ రెగ్యులర్ గా నడిచేందుకే ఈ కొత్త కూర్పు అని అంటున్నారు.
ఉత్తరాంధ్ర వారికే చాన్స్ :
అయితే ఈ కీలక పదవిని ఎవరికి ఇస్తారు అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఈ పదవిని ఉత్తరాంధ్ర వారికే ఇవ్వాలని కూడా పార్టీలో ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్ర అంటేనే బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. దాంతో అక్కడ నుంచే వర్కింగ్ ప్రెసిడెంట్ ని సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ గా ఉత్తరాంధ్రాకు చెందిన వారే ఉన్నారు. అలాగే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ కూడా అక్కడి వారే ఉన్నారు. దాంతో వైసీపీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఉత్తరాంధ్రకే ఇవ్వాలని చూస్తోంది అని అంటున్నారు.
అతి ముఖ్యమైన రీజియన్ :
ఇక ఏపీలో ఉన్న కీలక రీజియన్లలో ఉత్తరాంద్ర ఒకటి, వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా రాయలసీమ ఉంది. అలాగే మిగిలిన చోట్ల కూడా బలం పెంచుకోవాలని చూస్తోంది. ఇక ఉత్తరాంధ్రా కనుక అండగా నిలిస్తే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆలోచన ఉంది అని అంటున్నారు. దాంతో ఉత్తరాంధ్ర కు చెందిన వారికి నాయకత్వం బాధ్యతలు ఇస్తే పార్టీ మరింతగా పుంజుకుంటుంది అంటున్నారు. తద్వారా ఆ ప్రాంతాన్ని వైసీపీ కూడా సామాజికపరంగా రాజకీయంగా గుర్తించినట్లు అవుతుందని బీసీ ముద్ర కూడా పార్టీ మీద ఉంటుందని చర్చ అయితే సాగుతోంది.
ఆ ఇద్దరిలో ఎవరు :
అయితే వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చూస్తే ఇద్దరు సీనియర్ బీసీ నేతలు మాజీ మంత్రుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయని అంటున్నారు. అందులో మొదటి పేరు అయితే విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణది ఉందని తెలుస్తోంది. రెండవ వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు ఉంది అంటున్నారు. ఈ ఇద్దరూ పార్టీ పరంగా గట్టిగా మాట్లాడుతారు అని పేరు. అంతే కాదు ఏ విధంగా విమర్శలకు తావు లేకుండా చెప్పాల్సింది సూటిగా చెబుతారని అంటున్నారు. దాంతో ఈ ఇద్దరిలో ఒకరికి ఈ పదవిని ఇస్తారు అని అంటున్నారు.
ఆయన వైపే మొగ్గు :
తాజాగా చూస్తే తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకలలో బొత్సకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చేతనే పతాకావిష్కరణ జరిపించారు. దీంతో బొత్స వైపే అధినాయకత్వం మొగ్గు చూపుతోంది అని అంటున్నారు. ఆయన శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కీలక స్థానంలో ఉన్నారు దాంతో పార్టీలో మరింత కీలకం చేస్తే వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందని పార్టీని కో ఆర్డినేట్ చేసుకోవడంతో పాటు దైనందిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.
