జగన్ కమ్మని ప్రేమ...తట్టుకోగలరా ?
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి చెప్పాలంటే విభిన్నమైన రాజకీయ నేతగానే చూడాలి.
By: Satya P | 26 March 2026 1:00 PM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి చెప్పాలంటే విభిన్నమైన రాజకీయ నేతగానే చూడాలి. ఆయన వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించినా తనదైన పోకడలతోనే ముందుకు సాగారు. 2019లో వైసేపీకి 151 సీట్లతో అధికారం దక్కింది. దానికి కారణం అన్ని సామాజిక వర్గాలు గుత్త మొత్తంగా ఓట్లేసి గెలిపించడమే. చిత్రమేంటి అంటే టీడీపీని ఎక్కువగా అభిమానించే కమ్మ సామాజిక వర్గంలోని వారు కూడా గుర్తించతగిన సంఖ్యలో మద్దతుగా నిలిచారు. అందువల్లనే కృష్ణా గుంటూరు వంటి టీడీపీ హార్డ్ కోర్ జిల్లాలలో వైసీపీ సునాయాస విజయం సాధ్యమైంది అని విశ్లేషణలు ఉన్నాయి.
ఆ విమర్శ బలంగా :
అయితే వైసీపీ పవర్ లోకి వచ్చాక అమరావతి రాజధాని విషయంలో ఉదాశీనత చూపించడంతో మొదలైంది. ఆ తరువాత కమ్మల పట్ల కూడా కొంత దూరం పెట్టే రాజకీయం చేశారు అన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. మంత్రి వర్గంలో ఎపుడూ కమ్మలకు స్థానం ఉంటుంది. అలాంటిది మొదటి విడతలో కొడాలి నానికి చాన్స్ ఇచ్చినా విస్తరణలో ఆ సామాజిక వర్గమే లేకుండా చేయడంతో వారిలో అది భారీ అసంతృప్తికి వైసీపీ మీద ఆగ్రహానికి కారణం అయింది. అంతే కాదు కమ్మల రాజకీయ ప్రాబల్యం ఉన్న చోట సామాజిక ప్రయోగాలు చేయడం కూడా మంటగా మారింది. ఇలా వారి విషయంలో ఎందుకో అప్పట్లో ఒక రకమైన గ్యాప్ పెంచేశారు అని చెప్పుకున్నారు.
తలా చేయి వేసి :
ఈ క్రమంలో కమ్మలు కాపులు బీసీలు ఇలా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు అంతా తలా ఒక చేయి వేసి మరీ వైసీపీ భారీ ఓటమికి కారణం అయ్యారు. ఇక వైసీపీ ఓటమి తరువాత మెల్లగా అసలు విషయాలు ఆ పార్టీ పెద్దలకు అర్ధం అవడం మొదలయ్యాయని అంటున్నారు. కాపులను దగ్గర చేసుకుంటూ వస్తున్న వైసీపీ ఇపుడు కమ్మల మీద కూడా అవ్యాజమైన ప్రేమను చూపిస్తోంది అని అంటున్నారు. వారికి గుర్తించి గౌరవించడం మీద చర్చ అయితే సాగుతోంది.
భారీ హామీలతో :
రానున్న ఎన్నికల్లో కమ్మలకు సముచితమైన ప్రాధాన్యత ఇవ్వడానికి వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయింది అని అంటున్నారు. తాజాగా ఒంగోలులో వైసీపీ ఒక ప్రయోగం చేసింది. ఆ సీటుని ఎపుడూ బాలినేని శ్రీనివాసరెడ్డికే ఇస్తూ వచ్చింది. ఆయన చూస్తే జనసేనలోకి వెళ్ళారు దాంతో మరో రెడ్డికే అక్కడ సీటు ఇస్తారని అంతా అనుకుంటున్న వేళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన చుండూరు రవికి పగ్గాలు ఇవ్వడంతో సర్వత్రా చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన దామచర్ల జనార్ధన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ కూడా అదే సామాజిక వర్గాన్ని దగ్గరకు తీయడాన్ని కొత్త వ్యూహంగా చూస్తున్నారు.
వీరందరికీ పెద్ద పీట :
ఇక దేవినేని అవినాష్ ని ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ గా నియమించిన వైసీపీ రానున్న కాలంలో ఆయనకు కోరుకున్న చోట ఎమ్మెల్యే సీటు ఇస్తామని అంటోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి ప్రయారిటీ ఇస్తూనే మరింతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. గన్నవరం టికెట్ ని వంశీకి మరోసారి ఇచ్చేందుకు రెడీగా వైసీపీ ఉంది. అలాగే గుంటూరు జిల్లాలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బోళ్ళ బ్రహ్మనాయుడుని సైతం ప్రోత్సహిస్తోంది. ఇంకా అనేక మందికి ఈసారి పార్టీ పరంగా ప్రోత్సహించి పెద్ద పీట వేయాలని వైసీపీ వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు. కమ్మలకు బలమైన కోటలుగా ఉన్న నియోజకవర్గాలలో వారికే టికెట్లు ఈసారి ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ ఉంటుంది అని అంటున్నారు. దాంతో పాటుగా కొత్తగా సీట్లు పెరుగుతాయి కాబట్టి మరిన్ని అవకాశాలు అంటున్నారు. మరి వైసీపీ చేస్తున్న ఈ సామాజిక ప్రయోగం కానీ కమ్మనైన ప్రేమలు కానీ ఏ విధంగా వర్కౌట్ అవుతాయి ఏ రకమైన ఫలితాలు వస్తాయన్నది చూడాల్సిందే అంటున్నారు.
