Begin typing your search above and press return to search.

అక్కడ వైసీపీ ఖాళీ...చోద్యం చూస్తున్నారా ?

ఇక పాతపట్నంలో వర్గ పోరు ఉంది. అది వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఉంది. నాడు ఎమ్మెల్యేగా వ్యవహరించిన రెడ్డి శాంతి వైఖరి పట్ల అసంతృప్తి చెందిన నాయకులు అంతా వర్గాలుగా విడిపోయారు.

By:  Satya P   |   8 Jun 2026 9:50 AM IST
అక్కడ వైసీపీ ఖాళీ...చోద్యం చూస్తున్నారా ?
X

ఉత్తరాంధ్రా అంటేనే టీడీపీకి కంచుకోట అని చెబుతారు. అందులోనూ శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే పెట్టని కోటగా కూడా పేర్కొంటారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో తప్ప ఎపుడూ టీడీపీ ఓడినదీ వాడినదీ అసలు లేనే లేదు. 2019 ఎన్నికల్లో ఓటమికి బదులు అన్నట్లుగా 2024లో మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లను గెలిచి తన సత్తా చాటిన టీడీపీ మిత్రపక్షాలు జనసేన బీజేపీలతో కలసి పటిష్టంగా ఉంది. ఇక ఎక్కడికక్కడ అన్నీ సరిచూసుకుంటూ మంచి దూకుడు మీద సైకిల్ సవారీ సాగుతోంది. ఉద్ధండులైన నేతలు ఎందరో శ్రీకాకుళం జిల్లా టీడీపీకి ఉన్నారు. దాంతో పార్టీ బలంగా ఉంది. అదే సమయంలో ఓడిన తరువాత పెద్దగా సౌండ్ చేయని పరిస్థితులలో వైసీపీ ఉందని అంటున్నారు.

ఇంకా వీక్ గానే :

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే మెజారిటీలో వైసీపీ వీక్ గానే ఉంది అని అంటున్నారు. ఆముదాలవలస, శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురంలలో టీడీపీ జోరు సాగుతూంటే పలాస, నరసన్నపేట, ఎచ్చెర్లలో పార్టీ కొంత గట్టిగా కనిపిస్తోంది. ఇక పాలకొండ ఎస్టీలో నాయకత్వం నైరాశ్యంలో ఉంటే రాజాంలో వైసీపీ బలంగా ఉన్నా వర్గ పోరు పీడిస్తోంది అని అంటున్నారు. వీటి అన్నింటి కంటే ఎక్కువ డేంజర్ పాతపట్నంలోనే వైసీపీకి ఉందని అంటున్నారు. అక్కడ వైసీపీ నానాటికీ వెరీ వీక్ అయిపోతోంది అని చెబుతున్నారు.

ఒకనాడు జెండా పాతినా :

వైసీపీ ఆవిర్భవించాక 2014, అలాగే 2019లలో వరసగా రెండు సార్లు గెలిచి బలంగా జెండా పాతిన పాతపట్నంలో 2024 ఎన్నికల తరువాత మాత్రం వేగన్గా పరిణామాలు మారిపోతున్నాయి. ఇక్కడ కూటమి వైసీపీని బలంగా గురి పెట్టింది. టీడీపీ జనసేన అయితే ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశాయి. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ ని లీడర్స్ ని తమ వైపునకు తిప్పుకుంటున్నాయి. దాంతో ఫ్యాన్ నీడని వీడి సైకిలెక్కుతున్న వారు గాజు గ్లాస్ పట్టుకుంటున్న వారూ ఎక్కువైపోతున్నారు. లేటెస్ట్ గా చూస్తే టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో భారీ ఎత్తున వైసీపీ నాయకులు క్యాడర్ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీని కంటే ముందు జనసేనలోకి కీలక నేతలు వెళ్ళిపోయారు. ఇలా చూస్తూంటే వైసీపీ కూశాలు కదిలిపోతున్న పరిస్థితి ఉందని అంటున్నారు.

ఆమెను మార్చరా :

ఇక పాతపట్నంలో వర్గ పోరు ఉంది. అది వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఉంది. నాడు ఎమ్మెల్యేగా వ్యవహరించిన రెడ్డి శాంతి వైఖరి పట్ల అసంతృప్తి చెందిన నాయకులు అంతా వర్గాలుగా విడిపోయారు. 2021లో జిల్లాలో మొత్తం అన్ని జెడ్పీటీసీలను గెలిచిన వైసీపీ పాతపట్నం నియోజకవర్గం హీరమండలం జెడ్పీటీసీని కోల్పోయింది. జిల్లాలో కోల్పోయిన ఏకైక జెడ్పీటీసీ సీటు ఇదే. పైగా ఈ సీటు నుంచి పోటీ చేసింది ఎవరో కాదు ఎమ్మెల్యే కుమారుడు. మరి వైసీపీలో పోరే ఆయన్ని ఓడించింది అని చెప్పుకున్నారు. 2024లో ఎమ్మెల్యేని మార్చాలని కోరినా ఫలితం లేదని అంటున్నారు దాంతో ఆమె ఓటమి పాలు అయ్యారు.

కొత్త రూపు రావాలంటే :

ఇక ఇంచార్జిగా ఆమెనే కొనసాగించడంతో పార్టీని వీడిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆమెకే పార్టీ పదవులు కూడా ఇస్తోంది. రాష్ట్ర వైసీపీ క్రమశిక్షణా సంఘం బాధ్యతలు అప్పగించింది. అయితే సొంత నియోజకవర్గంలో కట్టు తప్పిన క్రమశిక్షణను ఆమె సరిచేస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంతే కాదు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్న వారికి సర్దిచెప్పి వైసీపీలో కొనసాగేలా చూస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తూంటే వైసీపీ నానాటికీ తగ్గిపోతోంది అన్న భయాలు క్యాడర్ లో కలుగుతున్నాయి. పాతపట్నంలో వైసీపీకి కొత్త రూపు రావాలంటే ఏమి చేయాలో అధినాయకత్వమే చూసుకోవాలని క్యాడర్ అయితే అంటోంది మరి.