మూసేసిన గేట్లు అవంతి కోసం తెరుస్తున్నారా ?
వైసీపీలో ఒక విధానం ఉంది. ఎవరైనా పార్టీ గోడ దాటితే తిరిగి వారిని తీసుకోరు. ఎంతటి పెద్ద వారు అయినా ఇదే విధానం అమలు చేసుకుంటూ వస్తున్నారు.
By: Satya P | 18 Sept 2026 9:26 AM ISTవైసీపీలో ఒక విధానం ఉంది. ఎవరైనా పార్టీ గోడ దాటితే తిరిగి వారిని తీసుకోరు. ఎంతటి పెద్ద వారు అయినా ఇదే విధానం అమలు చేసుకుంటూ వస్తున్నారు. అందుకే వైసీపీలో మొదటి నుంచి ఉన్న వారు ఇపుడు ఎక్కడా కనిపించడం లేదని గుర్తు చేస్తున్నారు. అయితే ఇంత కఠినమైన రాజకీయ విధానం వైసీపీ అమలు చేస్తున్న క్రమంలో మొదటి సారి ఒకరి కోసం దానిని బ్రేక్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.
స్వాగతం అంటూ :
ఆయన వైసీపీ నుంచి రెండేళ్ల క్రితం వెళ్ళిపోయారు. అంతే కాదు కూటమి ప్రభుత్వం బాగుంది అని ప్రశంసించారు. అక్కడితో ఆగలేదు, విశాఖలో వైసీపీ మేయర్ ని దించేయడంతో కూటమికి సహకరించారు. కార్పోరేటర్ అయిన తన కుమార్తెతో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయించారు. మరి ఇంత చేసిన వ్యక్తిని అయితే వైసీపీ రూల్స్ ప్రకారం అసలు తీసుకోరు. కానీ వైసీపీలో మాత్రం ఇపుడు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఇదే ఇపుడు వింతా విడ్డూరంగా ఉంది అంటున్నారు.
తీసుకుని రావాలని :
అవంతి శ్రీనివాసరావుకు అయితే ఇప్పటికిపుడు రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన హ్యాపీగా తన విద్యా సంస్థల వ్యవహారాలను చూసుకుంటున్నారు. 2028 మొదట్లో ఏ నిర్ణయం అయినా అంటున్నారు. కానీ ఇపుడు అవసరం వైసీపీది అవుతోంది. అర్జంటుగా భీమిలీకి వైసీపీ ఇంచార్జి కావాలి. స్థానిక ఎన్నికలు ముంగిట ఉన్నాయి. దాంతో అవంతి లాంటి బిగ్ షాట్ ఉంటేనే ఒడ్డుకు చేరగలమని భావిస్తోంది. అందుకే ఆయనను పార్టీలో చేర్పించాలని ఉత్తరాంధ్రా నాయకులకు వైసీపీ అధినాయకత్వం సూచించింది అని అంటున్నారు.
డిమాండ్లు ఉంటాయా :
రాజకీయాల్లో ఎపుడూ పరిస్థితులే కీలకం అవుతాయి. అవంతి తానుగా చేరితే ఓకే. కానీ ఆయన కావాలని వైసీపీ కోరుకుంటోంది. కాబట్టి ఈ మాజీ మంత్రి నుంచి డిమాండ్లు కొన్ని పెట్టడం జరుగుతుందని అంటున్నారు. గతంలో అవంతి మంత్రిగా ఉన్నా విజయసాయిరెడ్డి మొత్తం పెత్తనం చేశారు అన్న అసంతృప్తి ఆయనకు ఉంది. అలాగే జిల్లా ప్రెసిడెంట్ గా చేసినా పార్టీకి చెందిన ఇతర నాయకుల జోక్యం ఉండేది. ఇలా సొంతంగా మాత్రం ఏ పనీ చేయనీయలేదని ఆయన అనుచరులు అంటారు.
వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ :
ఇపుడు కనుక ఆయన తిరిగి వైసీపీలో చేరితే కచ్చితంగా తన మాట నెగ్గించుకుంటారు అని అంటున్నారు. దాంతో ఆయన ఏ రకమైన డిమాండ్లు పెడతారు అన్నది కూడా వైసీపీ ఆలోచిస్తోంది. ఇక వైసీపీ ఇప్పటికిపుడు కొత్త ముఖాలను తెచ్చి వారితో ప్రయోగాలు చేసే స్థితిలో లేదు కాబట్టి అవంతి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ డోర్స్ ని ఓపెన్ చేసి రూల్స్ ని బ్రేక్ చేసి అవంతికి ఘన స్వాగతం పలుకుతోంది అంటే అవంతి రాజకీయ దశ మారినట్లే అని అంటున్నారు. ఇంతకీ అవంతి వైసీపీలో చేరుతారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది మరి.
