కూటమిలో అంతర్మధనం -ఐక్యంగా లౌక్యంగా !
ఈ నేపథ్యంలో కూటమి పెద్దలుగా ప్రభుత్వంలో పెద్దలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలసి కూర్చుని అనేక అంశాలు చర్చించారు.
By: Satya P | 5 Feb 2026 9:38 AM ISTఏపీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల మీద టీడీపీ నాయకత్వంలోని కూటమి పెద్దలు పూర్తి స్థాయిలో మధింపు చేస్తున్నారు. ఒక విధంగా జరిగిన వాటి మీద సమీక్ష చేస్తున్నారు. వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఆ ట్రాప్ లోకి కూటమి నేతలు వెళ్తున్నారన్నది పెద్దల అభిప్రాయంగా ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇష్యూలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసుపాలు అయ్యారని అదే సమయంలో ఆయన ఇంటి మీద దాడులు కానీ వరసబెట్టి జోగి రమేష్ ఇంటి మీద దాడులు కానీ చేయడం ద్వారా కొందరు అతి ఉత్సాహ పరులు చేసిన పనుల ద్వారా కూటమికి ఇబ్బంది కలుగుతోందని అంటున్నారు.
ఆచీ తూచీ :
ఈ నేపథ్యంలో కూటమి పెద్దలుగా ప్రభుత్వంలో పెద్దలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలసి కూర్చుని అనేక అంశాలు చర్చించారు. ప్రధానంగా ఏపీలో సాగుతున్న రాజకీయ ఘర్షణలు మాటల తూటాలు లా అండ్ ఆర్డర్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని భావిస్తున్నారు. కూటమి పార్టీల నేతలు అప్రమత్తంగా ఉండాలని ఆచీ తూచీ స్పందించాలని కూడా ఈ సమావేశంలో నాయకులు ఇద్దరూ చర్చించుకున్నారు అని అంటున్నారు.
అధికార పక్షంగా :
ఏపీలో ఏమి జరిగినా అధికార పక్షం వైపే వేలెత్తి చూపే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ దెబ్బ తింటే గత ఇరవై నెలలుగా చేసిన అభివృద్ధి పక్కకు పోతుందని కూడా కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు. వైసీపీ అయితే రెచ్చగొట్టే వైఖరిని తీసుకుంటోందని కొంత మంది కూటమిలోని నేతలు కూడా అనవసరంగా ట్రాప్ లో చిక్కుకుంటున్నారు అన్న భావన కూడా పెద్దలలో వ్యక్తం అవుతోంది. ఇక మీదట ఎవరూ అతిగా స్పందించకుండా అలెర్ట్ గా ఉండాలని కూడా పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
అంతా కలసిమెలసి :
కూటమిలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం మీద వైసీపీ చేసే ఏ విమర్శను అయినా అంతా కలసి కట్టుగానే ఎదుర్కోవాలని ధీటుగా బదులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వైసీపీకి ఏ విధమైన చాన్స్ కూడా అసలు ఇవ్వరాదని భావిస్తున్నారు. కూటమి పాలన పట్ల పాజిటివిటీ ఉందని దానిని పాడు చేసుకునే విధంగా కూటమి పార్టీలో క్యాడర్ సహా ఎవరూ వ్యవహరించరాదన్నది పెద్దల మాటగా ఉంది.
మరోసారి మీట్ :
ఇదిలా ఉంటే గురువారం మరోసారి చంద్రబాబు నివాసమైన ఉండవల్లిలో ముఖ్యమంత్రి బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలసి కూర్చుని అన్ని విషయాలు చర్చిస్తారు అని అంటున్నారు. అదే విధంగా శ్రీవారి లడ్డూ విషయంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏమి చేయాలి అన్న దాని మీద కూడా చర్చిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కూటమి పార్టీలు అన్నీ అలెర్ట్ అయ్యాయని అంటున్నారు. గత కొద్ది రోజుల పరిణామాలు చూస్తే రాజకీయాలలో పై చేయి ఎవరిది అన్నది పక్కన పెడితే కూటమి ప్రభుత్వానికి ఏ విధంగానూ చెడ్డ పేరు కానీ ఇబ్బంది కానీ కలుగరాదు అన్నదే పెద్దల ఆలోచనగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
