Begin typing your search above and press return to search.

చిన్న శ్రీను...వైసీపీకి పెద్ద కష్టం !

రాజకీయాల్లో పడికట్టు పదాలు ఉంటాయి. అవి మీడియా ముందు స్టేట్మెంట్లుగా నాయకుల నోట్ల నుంచి వస్తూంటాయి.

By:  Satya P   |   9 Oct 2026 9:14 AM IST
చిన్న శ్రీను...వైసీపీకి పెద్ద కష్టం !
X

రాజకీయాల్లో పడికట్టు పదాలు ఉంటాయి. అవి మీడియా ముందు స్టేట్మెంట్లుగా నాయకుల నోట్ల నుంచి వస్తూంటాయి. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు నష్టం లేదు. ఈ మాట ప్రతీ పార్టీ అంటూ ఉన్నదే. జనాలు వింటున్నదే. నిజానికి నష్టం ఎందుకు ఉండదు అన్నదే కీలక ప్రశ్న. ఒకటి ఒకటి కలిస్తే రెండు. అలాంటిది. రెండు మైనస్ ఒకటి అంటే నష్టమే కదా అన్నది లాజిక్ పాయింట్. అయినా సరే నేతలు నిబ్బరం ప్రదర్శిస్తారు. ఒకరు పోతే పది మంది వస్తారు అని కూడా ధీమాగా చెబుతారు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే అవన్నీ జరగవచ్చు కాకపోవచ్చు. కానీ తక్షణ నష్టం కష్టం మాత్రం పార్టీ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం విజయనగరం వైసీపీలో ఇదే సమస్య ఉంది అని అంటున్నారు.

అంతర్మధనంలోనే :

బయటకు చెప్పకపోయినా చిన్న శ్రీను వెళ్ళిపోయారు అంటే వైసీపీకి నష్టమే అని వైసీపీ నేతలు అంతర్మధనంలో అంటున్న మాటలుగా ఉన్నాయని చెబుతున్నారు. చిన్న శ్రీను పార్టీని ఒంటి చేత్తో నడిపారు. ఏనాడూ ఖర్చుకు వెనకాడలేదని నేతలు చెబుతున్నారు. అంగ బలం అర్ధ బలం అన్న మాటలకు ఆయన ఉదాహరణగా నిలిచి వైసీపీకి గట్టిపరచారు అని అంటున్నారు. ఇపుడు చిన్న శ్రీను లేని లోటు తెలిసి వస్తోందని కూడా అంటున్నారు. పార్టీకి ఆర్ధికంగా ఎవరు అండగా నిలబడతారు అన్నదే పెద్ద చర్చగా ఉంది. ఏ పార్టీకి అయినా అర్ధ బలం ముఖ్యం. అందునా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ లాంటి పార్టీలకు ఇంకా అవసరంగా ఉంటుంది. దాంతో కీలక సమయంలో చిన్న శ్రీను పార్టీకి గుడ్ బై కొట్టడం షాకింగ్ పరిణామంగానే చూస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తామని అనేక మంది నాయకులు చెబుతున్నా ఆర్ధికంగా గట్టిగా నిలబడేవారు ఎంత మంది అన్నదే ఇపుడు అధినాయకత్వం కూడా తరచి చూస్తున్న విషయంగా ఉందని అంటున్నారు.

నిన్నటిదాకా వేరు :

ఇక చిన్న శ్రీను వైసీపీని వీడడం వల్ల నష్టం లేదంటున్నారు కానీ నిన్నటిదాకా ఏపీలో అన్ని జిల్లాలలో బలంగా వైసీపీ విజయనగరంలో ఉందని చెప్పుకునేవారు. ఇపుడు ఆ పరిస్థితి అయితే లేనే లేదని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ తాజా పరిణామాలతో వెరీ స్ట్రాంగ్ అయింది అని రాజకీయ సమీకరణలు చెబుతున్నాయి. మరో వైపు చూస్తే వైసీపీలో దూకుడుగా ఉండే నేతలు వ్యూహాలతో దూసుకుని పోయే వారి కొరత కూడా ఉందని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ గన్ షాట్ గా గెలుస్తామని నిన్నటిదాకా చెప్పిన మాటలు ఇపుడు కొంత ఆలోచించేలా ఉన్నాయని అంటున్నారు.

పుంజుకుంటామంటూ :

అయితే వైసీపీకి విజయనగరం జిల్లాలో సాలిడ్ గా బలం ఉందని క్యాడర్ అంతా జగన్ కోసమే పనిచేస్తున్నారు అని ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు అంటున్నారు. ఆయన మాజీ మంత్రి రాజకీయ దిగ్గజం దివంగత సాంబశివరాజు కుమారుడు, రాజకీయ వారసుడు. పార్టీకి ఇలాంటివి అన్నీ మామూలే అన్నారు, వ్యక్తుల కంటే పార్టీయే ఎపుడు స్ట్రాంగ్ అని కూడా చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేత తమకు అండగా ఉంటారని సురేష్ బాబు చెప్పారు. జిల్లాలో అన్ని చోట్లా వైసీపీ అభ్యర్ధులను దించుతుందని ఆయన చెప్పారు. గతంలో చిన్న శ్రీను ఉన్నారు కాబట్టి మిగిలిన వారు సమర్ధులు ఉన్నా జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, ఇపుడు అంతా కలసి పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వస్తామని సురేష్ బాబు నమ్మకంగా చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.