Begin typing your search above and press return to search.

వైసీపీ మేయర్....ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ?

ఇక వైసీపీ విషయానికి వస్తే 2021లో మేయర్ పదవిని ఆ పార్టీ గెలుచుకుంది. పరోక్ష ఎన్నికల్లో వైసీపీకి 98 వార్డులకు గానూ 58 వార్డులు దక్కాయి. ఇండిపెండెంట్ల మద్దతు తో 64కి బలం చేరింది.

By:  Satya P   |   30 Sept 2026 9:21 AM IST
వైసీపీ  మేయర్....ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ?
X

మేయర్ పదవి గొప్పదే. అయితే ఎమ్మెల్యేలుగా గెలిచి రాష్ట్ర అసెంబ్లీలో కీలక పాత్ర పోషించిన వారు మేయర్ గా పోటీకి దిగుతారా అన్నదే చర్చ. అయితే విశాఖ వంటి మేయర్ పదవికి పోటీ పడినా తప్పు లేదని అంటున్నారు. ఎందుకంటే విశాఖ మేయర్ అంటీ కేబినెట్ మంత్రి పదవితో సమానంగా చెబుతారు. ఏపీలో మెగా సిటీగా ఉన్న విశాఖకు మేయర్ గా ఉండడం ఏటా అయిదు వేల కోట్ల బడ్జెట్ తో పాలన చేసే చాన్స్ రావడం అంటే గ్రేట్ అనే అంటున్నారు. పైగా ప్రత్యక్ష ఎన్నికలు, ఒక్కసారి మేయర్ గా నెగ్గితే ఎవరి ప్రాపకం అవసరం లేదు, అవిశ్వాసం బెడద అంతకంటే లేదు అని గుర్తు చేస్తున్నారు. దాంతోనే విశాఖ మేయర్ పదవికి పెద్ద ఎత్తున పోటీ పెరుగుతోంది.

గట్టి పోటీ కోసం :

ఇక వైసీపీ విషయానికి వస్తే 2021లో మేయర్ పదవిని ఆ పార్టీ గెలుచుకుంది. పరోక్ష ఎన్నికల్లో వైసీపీకి 98 వార్డులకు గానూ 58 వార్డులు దక్కాయి. ఇండిపెండెంట్ల మద్దతు తో 64కి బలం చేరింది. వీరు కాకుండా ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా వైసీపీకి ఉన్నారు. అలా 70 దాకా పెరిగిన బలంతో నాలుగేళ్ల పాటు విశాఖలో పాలన చేసింది. చివరి ఏడాది టీడీపీ కూటమి అవిశ్వాసం పెట్టి వైసీపీ మేయర్ ని దించేసింది. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో వైసీపీ గట్టిగానే పోటీ పడాలని నిర్ణయించుకుంది. పరోక్ష ఎన్నికలు అయితే ఏమో కానీ ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో వైసీపీ కూడా ఆచీ తూచీ అడుగులు వేస్తోంది. దాంతో అంగబలం అర్ధ బలం ఉన్న వారిని ఎంపిక చేయాలని నిర్ణయించింది.

ముగ్గురు పేర్లతో :

ఇక వైసీపీ నుంచి చాలా మంది పోటీకి సిద్ధపడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మేయర్ అంటే అందరికీ ఎంతో కొంత పరిచయం ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు నగర రాజకీయాల్లో కీలకంగా ఉన్న వారినే బరిలోకి దించాలని చూస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు అయితేనే బాగుంటుంది అని వైసీపీ భావిస్తోంది. ఇలా షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసింది. అందులో మూడు సామాజిక వర్గాలు మూడు నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల పేర్లను విశాఖ వైసీపీ ఎంపిక చేసింది అని అంటున్నారు. విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి పేర్లను సీరియస్ గా పరిశీలిస్తోంది అని అంటున్నారు.

బీసీ కార్డుతోనే :

ఈ ముగ్గురూ బీసీ సామాజిక వర్గానికే చెందిన వారు అని అంటున్నారు. ఇందులో వాసుపల్లి మత్య్సకార వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే వెలమ సామాజిక వర్గం నుంచి తైనాల ఉన్నారు. అలాగే బీసీ నేతగా తిప్పల ఉన్నారు. వీరు ముగ్గురిలో వైసీపీ ఎవరికి మేయర్ గా పోటీ చేసే చాన్స్ ఇస్తుందో చూడాలి. అవతల కూటమి మేయర్ అభ్యర్ధిని చూసుకున్న తరువాతనే వైసీపీ మేయర్ అభ్యర్ధి ఎవరో ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎక్కువ అవకాశాలు అయితే వాసుపల్లి గణేష్ కుమార్ కే ఉన్నాయని అంటున్నారు. ఆయన దూకుడుతో కూడిన రాజకీయం చేస్తారు అన్న పేరు ఉంది. మొత్తానికి వైసీపీ గట్టి వారినే పోటీకి పెడుతోంది. దాంతో మేయర్ ఎన్నికల రసకందాయంలో పడేలా కనిపిస్తోంది.