గుడివాడ విశాఖ గడబిడ
వైసీపీకి చెందిన మాజీ మంత్రి కీలక నేత గుడివాడ అమర్నాధ్ విశాఖ బంధాన్ని చాలా గట్టిగానే పెనవేసుకున్నారు.
By: Satya P | 19 Aug 2025 9:16 AM ISTవైసీపీకి చెందిన మాజీ మంత్రి కీలక నేత గుడివాడ అమర్నాధ్ విశాఖ బంధాన్ని చాలా గట్టిగానే పెనవేసుకున్నారు. ఆయనకి అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా విశాఖ రాజకీయాల్లోనే కనిపిస్తున్నారు. దాంతో గుడివాడ రాజకీయం పట్ల వైసీపీలోనే పెద్ద చర్చ సాగుతోంది. ఆయనకు వేరే జిల్లాని చూడమని బాధ్యతలు ఇస్తే ఆయన ఎంతసేపూ విశాఖ జిల్లానే పట్టుకుని ఉండడం పట్ల చర్చ అయితే పార్టీ లోపల సాగుతోంది.
రాజు గారి రాజ్యంలో :
ఇక కేకే రాజు అని ఉత్తర నియోజకవర్గం వైసీపీ నేత ఉన్నారు. ఆయన 2019, 2024 ఎన్నికల్లో ఉత్తరం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అయినా నిబద్ధత కలిగిన నేతగా జగన్ వద్ద పేరు తెచ్చుకున్నారు అంగబలం అర్ధబలం ఉన్న వారు క్యాడర్ కి ఎక్కువ సమయం ఇస్తారు పార్టీని పట్టించుకుంటారు అన్న పేరు ఉంది దాంతో ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు జగన్ అప్పగించారు. అలా విశాఖ జిల్లా రాజు గారి రాజ్యంలోకి వెళ్ళిపోయింది.
బోణీ కొట్టి మరీ :
కేకే రాజు విశాఖ వైసీపీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన విశాఖ స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీ ఒక సీటుని అనూహ్యంగా గెలుచుకుంది. దాంతో కొడిగట్టి పోతున్న పార్టీకి ఇది ప్రాణ వాయువుని అందించింది అని అంటున్నారు. పట్టుదలగా కేకే రాజు చేసిన పోరాటాలు వ్యూహాలు ఫలితంగానే ఇలా జరిగింది అని అంటున్నారు. దాంతో వైసీపీ హై కమాండ్ సైతం రాజు పనితీరు పట్ల ఖుషీగా ఉంది అని అంటున్నారు.
మీడియాతోనే అంతా :
ఇక గుడివాడ అమర్నాధ్ కి అనకాపల్లి వంటి జిల్లా బాధ్యతలు ఇచ్చినా ఆయన విశాఖ ఫోకస్ అయితే తగ్గలేదు అని అంటున్నారు. ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు భారీ స్థాయిలో ఇస్తారని ఆచరణలో మాత్రం ఆ దూకుడు పెద్దగా కనిపించదని విమర్శలు ఉన్నాయి. ఆయన విశాఖ వైసీపీకి పలు మార్లు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చూసినా పార్టీ పెద్దగ ఎత్తిగిల్లలేదని కూడా అంటున్న వారూ ఉన్నారు ఇక ఆయనకు ఇచ్చిన జిల్లాలో వైసీపీ ఇబ్బందులు పడుతోందని అక్కడకు వెళ్ళి పోరాటం చేయాల్సి ఉందని అంటున్నారు.
ఆ సీటు మీద కన్ను :
అయితే జగన్ వద్ద తమ నేతకు సాన్నిహిత్యం ఉందని గుడివాడ అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆయన చూపు విశాఖలోని భీమిలీ సీటు మీద ఉందని అంటున్నారు. లేకపోతే విశాఖ ఉత్తరం నుంచి అయినా పోటీ చేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఆయన విశాఖ వదలడం లేదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఒక జిల్లా ఇద్దరు అధ్యక్షులు అన్నట్లుగా వైసీపీ రాజకీయం అయితే సాగుతోందిట. చూడాలి మరి హైకమాండ్ ఏమి చేస్తుందో.
