Begin typing your search above and press return to search.

వైసీపీ ఉక్కు పోరాటానికి అదే సమస్యట !

వైసీపీ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకూడదని పోరాటం చేస్తామని అంటోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తోంది.

By:  Satya P   |   5 Sept 2025 9:20 AM IST
వైసీపీ ఉక్కు పోరాటానికి అదే సమస్యట !
X

వైసీపీ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకూడదని పోరాటం చేస్తామని అంటోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తోంది. విశాఖ ఉక్కుని ప్రైవేటు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తోంది. తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకూ విశాఖ ఉక్కు పోరాటాన్ని తీసుకుని వెళ్తామని ఉధృతంగా ఈసారి పోరాటం ఉంటుందని చెప్పారు.

ఐక్య పోరాటంగానే :

ఇక రౌండ్ టేబిల్ సమావేశాలను నిర్వహిస్తామని కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతామని కూడా వైసీపీ చెబుతోంది. అయితే వైసీపీతో కలసి వచ్చే పార్టీలు ఏవి అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. ఎందుకు అంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేనలతో ఎట్టి పరిస్థితులలోనూ వైసీపీ కలవదు, వారు కూడా కలిసేది ఉండదు, పైగా వారికి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఇది కాబట్టి రానే రారు. మరో వైపు చూస్తే కనుక వామపక్షాలు కాంగ్రెస్ విపక్షంలో ఉన్నాయి. ఇందులో వీరు ఎంతవరకూ కలసి వస్తాయో తెలియదు అంటున్నారు. ఉక్కు విషయంలో చాలా కాలంగా వామపక్షాలు లీడ్ చేస్తూ పోరాటం చేస్తున్నాయి.కాంగ్రెస్ కూడా తన పోరాటం చేస్తోంది. ప్రజా సంఘాలు మేధావులు అందరికీ వామపక్షాలు కలుపుకుని పోతున్నాయి.

వైసీపీకి మీద కూడా :

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసిందే వైసీపీ అధికారంలో ఉన్నపుడు అని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. 2021 జనవరి 27న ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకున్నపుడు వైసీపీ ఏపీలో పవర్ లో ఉంది. మరో మూడున్నరేళ్ళ పాటు ఆ పార్టీయే అధికారంలో కొనసాగింది. కానీ వైసీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోయింది అన్నది ప్రజా పక్షాల భావన, కీలక ఆరోపణ. అందుకే కూటమి పార్టీలను కానీ వైసీపీని కానీ ప్రజా సంఘాలు ఉక్కు ఐక్య ఉద్యమ నాయకులు సంఘాలు నమ్మకుండా తమ దారిలో తామే పోరాటం చేస్తున్నారు.

రాజకీయంగానే :

ఇక వైసీపీ తీరు చూస్తే రాజకీయంగానే ఈ పోరాటాన్ని భుజానికి ఎత్తుకుందని అంటున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి సిద్ధంగా ఉన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. కానీ బీజేపీని విమర్శించకుండా ఆ పార్టీ నిలబెట్టిన ఎన్ డీయే అభ్యర్ధికి మద్దతు ఇస్తూ పోరాటం అంటే ఎలా అని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. విశాఖ ఉక్కు మీద వైసీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే బీజేపీని నేరుగా విమర్శించాలని అంతే కాదు గల్లీలో కంటే ఢిల్లీలో అంతా కలసి చేసే పోరాటాలకు రావాలని కోరుతున్నారు. కేవలం టీడీపీని జనసేనను విమర్శిస్తూ చేసే ఉక్కు పోరాటలకు విలువ ఎక్కువగా ఉండదని అంటున్నారు.

అందరూ చేతులు కలపాలి :

మరో వైపు చూస్తే కేవలం వైసీపీ మాత్రమే కాకుండా ఏపీకి చెందిన అన్ని పార్టీలు చేతులు కలపాలని అంతా కలసి అఖిల పక్షంగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కలిస్తేనే తప్ప విశాఖ ఉక్కు ప్రైవేట్ బలి పీఠం నుంచి బయటపడేది ఉండదని అంటున్నారు. అయితే ఏపీలో ఉప్పూ నిప్పులా ఉంటూ ఢిల్లీలో అందరూ కలసి బీజేపీకి మద్దతు ఇస్తూ చేస్తున్న రాజకీయాలకు ఉక్కు పోరాటాలకు అసలు లింక్ కుదరదు అని అంటున్నారు. మరి వైసీపీ అందరినీ కలుపుకుని ఏ విధంగా తమ ఉక్కు పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందో చూడాల్సి ఉంది.