Begin typing your search above and press return to search.

గోదావ‌రి వైసీపీలో వీళ్ల వికెట్లు రాలిపోతాయా...?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైసీపీలో ఎప్పుడు ఏ వికెట్ రాలుతుందో ఆ పార్టీ నాయ‌కుల‌కే అర్థం కాని ప‌రిస్థితి.

By:  Garuda Media   |   2 Feb 2026 11:00 PM IST
గోదావ‌రి వైసీపీలో వీళ్ల వికెట్లు రాలిపోతాయా...?
X

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైసీపీలో ఎప్పుడు ఏ వికెట్ రాలుతుందో ఆ పార్టీ నాయ‌కుల‌కే అర్థం కాని ప‌రిస్థితి. తాజాగా మాజీ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి ఆ ప్లేసులో వ‌డ్డీ రఘురామ్‌ను నియ‌మించారు. కొట్టు గ‌త ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. అలాంటి నేత ప‌నితీరుపై అసంతృప్తితో జ‌గ‌న్ పెద్ద షాకే ఇచ్చారు. తాడేప‌ల్లిగూడెంలో కొట్టుకు షాక్ త‌ర్వాత‌ నెక్ట్స్ ఆచంటలో మ‌రో మాజీ మంత్రి చెరుకువాడ రంగ‌నాథ‌రాజుకు షాక్ త‌గ‌ల‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే రంగ‌నాథ రాజుకు వ‌య‌స్సు పైబ‌డిన నేప‌థ్యంలో ఆయ‌న అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రంగ‌నాథ‌రాజును ఆచంట బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి ఆ స్థానంలో గ‌త ఎన్నిక‌ల్లో పాల‌కొల్లు నుంచి పోటీ చేసిన గుడాల గోపీకి ఆచంట ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు ఇస్తార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక పాల‌కొల్లు బాధ్య‌త‌లు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన గుణ్ణం నాగ‌బాబుకు ఇవ్వ‌నున్నారు. పాల‌కొల్లులో కాపు, ఆచంట‌లో శెట్టిబ‌లిజ ఈక్వేష‌న్లు వేయ‌ల‌ని జ‌గ‌న్ ప్లాన్. ఇక ఏలూరులో ప్ర‌స్తుతం జేపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జేపీకి సీటు వ‌స్తుందా ? ఆయ‌న‌కే బీ ఫామ్ ఇస్తారా ? అన్న‌ది కూడా సందేహంగానే ఉంది. అలాగే త‌ణుకులో మ‌రో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావును త‌ప్పిస్తే ఆ స్థానంలో ఆయ‌న త‌న‌యుడు.. గ‌త ఎన్నిక‌ల్లో ఏలూరు నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేసి ఓడిపోయిన కారుమూరి సునీల్ కుమార్ యాద‌వ్‌కు త‌ణుకు ఇన్‌ఛార్జ్ ప‌గ్గాలు ఇస్తారంటున్నారు. నిడ‌ద‌వోలులో మాజీ ఎమ్మెల్యే జీఎస్ శ్రీనివాసుల నాయుడుకు కూడా షాక్ త‌ప్ప‌దంటున్నారు. భీమ‌వ‌రంలోనూ మార్పులు ఉండ‌వ‌చ్చ‌న్న ప్ర‌చారం అయితే గ‌ట్టిగా జ‌రుగుతోంది.

చింత‌ల‌పూడిలో వైసీపీ ఇన్‌చార్జ్ కంభం విజ‌య‌రాజు పార్టీ కోసం బాగా క‌ష్ట‌ప‌డుతున్నా.. పార్టీలో మాజీ ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ వ‌ర్గం ఆయ‌న‌ను బ‌లంగా వ్య‌తిరేకిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో అక్క‌డ వైసీపీ కేడ‌ర్‌కే అర్థం కాని ప‌రిస్థితి. ఓవ‌రాల్‌గా చూస్తే ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 7 - 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ప‌రిస్థితి ఏంటో అక్క‌డ నాయ‌కుల‌కు, కేడ‌ర్‌కు అర్థం కావ‌డం లేదు. ఎప్పుడు ఎవ‌రికి ఎలాంటి షాకులు త‌గులుతాయో ? ఎవ్వ‌రి ఊహ‌ల‌కు అంద‌డం లేదు.