Begin typing your search above and press return to search.

మండలిలో వైసీపీ హవా.. డిప్యూటీ చైర్మన్ పదవి కైవసం!

శాసనమండలిలో విపక్షం వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి తూమాటి మాధవారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

By:  Tupaki Political Desk   |   19 Aug 2026 2:39 PM IST
మండలిలో వైసీపీ హవా.. డిప్యూటీ చైర్మన్ పదవి కైవసం!
X

శాసనమండలిలో విపక్షం వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి తూమాటి మాధవారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయగా, మాధవరావు ఒక్కరే నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలు అన్నీ సక్రమంగా ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. ఇక తూమాటి మాధవరావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా మండలిలో తమ పార్టీకి ఎదురులేనట్లు మరోసారి నిరూపించుకుంది.

మండలి డిప్యూటీ చైర్మనుగా మాధవరావు ఎన్నిక తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. సభలో వైసీపీకి పూర్తి ఆధిక్యం ఉన్నప్పటికీ కొందరు సభ్యులు రాజీనామా చేశారు. చైర్మను మోషేన్ రాజు సభ్యుల రాజీనామాలను పెండింగులో పెట్టారు. ఇదే సమయంలో వైసీపీకి మండలి సభ్యత్వాలకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు టీడీపీ, జనసేన పార్టీలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో వారి మద్దతుతో ప్రభుత్వం తన అభ్యర్థిని బరిలోకి దింపుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజా పరిణామాలు పరిశీలిస్తే డిప్యూటీ చైర్మను ఎన్నికను ప్రభుత్వం పెద్దగా సీరియసుగా తీసుకోలేదని అనిపిస్తోందని చెబుతున్నారు.

సభలో వైసీపీకి అధికారికంగా 33 మంది సభ్యులు ఉన్నప్పటికీ, వీరిలో సుమారు ఐదుగురు అసంతృప్తితో ఉండటంతో వైసీపీ బలం 28 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు మొత్తం 58 మంది సభ్యులకు ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయని, మిగతా సభ్యుల్లో కూటమికి 15 మంది బలం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కలను పరిశీలిస్తే ఇప్పటికీ సభలో వైసీపీకి ఆధిక్యం ఉండటం వల్ల కూటమి పార్టీలు పోటీకి వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు.

కాగా, మండలిలో అత్యంత కీలక బాధ్యతలు ఉన్న డిప్యూటీ చైర్మన్ ఎంపికపై వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి భారీ కసరత్తు చేశారని అంటున్నారు. ఆయన వ్యూహాలు పనిచేయడంతో కూటమి కూడా ఎవరినీ పోటీకి పెట్టలేదని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన తూమాటికి వచ్చేఏడాది డిసెంబరు వరకు పదవీ కాలం ఉంది. స్థానిక సంస్థల కోటా కింద ఎన్నికైన ఆయన కేవలం 16 నెలలు మాత్రమే ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన తూమాటిని జగన్ వ్యూహాత్మకంగా ఎంపిక చేయడంతో కూటమి పార్టీలు పోటీకి రాలేదని అంటున్నారు. ఇక మండలి డిప్యూటీ చైర్మను బాధ్యతలు చేపట్టిన మాధవరావుకు తొలిరోజే కూటమి పార్టీలు షాక్ ఇచ్చాయి. ఆయన చైర్ లో కూర్చున్న సమయంలో అధికార సభ్యులు మండలి నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆయన ఎంపిక తమకు సమ్మతం కాదని సంకేతాలు పంపారని అంటున్నారు.