Begin typing your search above and press return to search.

ఓటు షేర్ పైనే వైసీపీ ఆశ‌లు.. వ‌ర్క‌వుట్ అవుతుందా..?

గత ఎన్నికల్లో కూటమికి వైసిపికి మధ్య ఎన్నికల ఓటింగ్ తేడా కేవలం 10 నుంచి 11 శాతం మధ్య మాత్రమే.

By:  Garuda Media   |   29 March 2026 6:00 AM IST
ఓటు షేర్ పైనే వైసీపీ ఆశ‌లు.. వ‌ర్క‌వుట్ అవుతుందా..?
X

గత ఎన్నికల్లో కూటమికి వైసిపికి మధ్య ఎన్నికల ఓటింగ్ తేడా కేవలం 10 నుంచి 11 శాతం మధ్య మాత్రమే. ఇదే విషయాన్ని వైసిపి అధినేత జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. 10% తేడా మాత్రమే కూటమిని కాపాడిందని ఈ 10 శాతాన్ని సొంతం చేసుకున్నందుకు వైసిపి నాయకులు ప్రయత్నం చేయాలని ఆయన తరచుగా చెబుతున్నారు. అంతేకాదు బలమైన నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు ను పెంచుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలని పదేపదే సూచిస్తున్నారు.

ఇటువైపు కూటమి పక్షంలో కూడా ఇదే తరహా చర్చ నడుస్తోంది. వైసీపీకి కూటమికి మధ్య కేవలం 10 శాతం ఓటు బ్యాంకు మాత్రమే తేడా ఉన్న నేపథ్యంలో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదం తప్పద‌న్న సంకేతాలను కూటమి నాయకులు ఇస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు నడిపిస్తూనే ఉన్నారు. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని పర్సంటేజ్ విషయంలో ముఖ్యంగా గ్రామీణ పట్టణ నగర స్థాయిలో ఏ ఒక్కరిని వదిలిపెట్ట వద్దని కూడా చెబుతున్నారు. తద్వారా వైసిపికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు షేర్ వెళ్ళకూడదు అన్నది కూటమి పార్టీల ప్రధాన ఉద్దేశం.

ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో బలంగా ఉండడంతో పాటు మరో 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉంటుందని కూడా చెబుతున్నారు. మొత్తంగా 10 శాతం ఓటు బ్యాంకు చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్న అన్నది వాస్తవం. అయితే ఎవరికి ఇందులో మేలు జరుగుతుంది.. ఎవరికీ కీడు జరుగుతున్నది.. రాబోయే మూడు సంవత్సరాలు నిర్ణయించనున్నాయి. దీంతో పాటు ఇప్పుడు మారనున్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి కూడా ఈ పర్సంటేజ్ ను మారుస్తుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతాయని ఆ పార్టీ నాయకులు సందేహిస్తున్నారు. తద్వారా తమ ఓటు బ్యాంకును కూటమి సొంతం చేసుకుంటుద‌న్న కలవరం కూడా వారిలో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పర్సంటేజీలు మార్పు అనేది నియోజకవర్గాల పునర్ విభజనతో సహజంగా జరిగే ప్రక్రియ. దీనిని కాపాడుకోవాలని అటు కూటమి ఇటు వైసిపి నాయకులు కూడా ప్రయత్నించడం తప్పు కాదు. కానీ అసలు వాస్తవం ఏంటంటే గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత అప్పటి సీఎం జగన్ ఇచ్చిన పథకాల ప్రభావం కనిపించింది.

దాంతో స్థిరమైన ఓటు బ్యాంకు ఆయనకు పడిందన్న వాదన ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రభావం ఉండకపోవచ్చు అన్నది వైసీపీలోనే కొంతమంది నాయకులు చెబుతున్న మాట. ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేక పథకాలు అమలు చేస్తుంది. ముఖ్యంగా ఆర్టిసి లో ఉచిత ప్రయాణంతోపాటు దివ్యాంగులకు వివిధ పథకాలను కూడా అందిస్తున్నారు. దీంతో కూటమిపై ప్రజల్లో సానుకూలత సానుభూతి కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి గతంలో ఉన్న పది శాతం ఓటు బ్యాంకు తేడా.. అలానే ఉండదని ఇది మరింత పెరుగుతుందని కూడా పరిశీలకులు భావిస్తున్నారు.

కాబట్టి కేవలం 10% ఓటు బ్యాంకు మాత్రమే మారుతుందన్న వైసీపీ వాదనను చాలామంది కొట్టేస్తున్నారు. మారితే 15 శాతం మారే అవకాశం ఉందని అది ఇటు కూటమి పక్షానికే పడుతుంద‌ని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు పర్సంటేజీ విషయంలో ఇరుపక్షాలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎన్నికలను మించి ఓట్లు పడాలని ఇటు కోటమి పార్టీలు అటు వైసిపి ప్రయత్నాలు చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇది వ్యక్తులను బట్టి వస్తుందా ప్రభుత్వ సానుకూలతను బట్టి వస్తుందా లేదా పార్టీల పట్ల ఉన్న అనుకూలతను బట్టి మారుతుందా అనేది చూడాలి.