లెక్కమారింది: వైనాట్ 175 కాదు.. !
మార్పు మంచిదే. పరిస్థితులు.. పరిణామాలను అంచనా వేసుకుని.. పార్టీలు, నాయకులు మార్పు దిశగా పయనించడాన్ని అందరూ స్వాగతించాల్సిందే.
By: Garuda Media | 2 Jun 2026 4:00 AM ISTమార్పు మంచిదే. పరిస్థితులు.. పరిణామాలను అంచనా వేసుకుని.. పార్టీలు, నాయకులు మార్పు దిశగా పయనించడాన్ని అందరూ స్వాగతించాల్సిందే. అయితే.. ఈ మార్పు.. భారీ ఓటమి తర్వాత రావడమే.. అది కూడా చాలా ఆలస్యంగా రావడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. వైసీపీలో లెక్క మారింది. గత ఎన్నికల సమయంలో వైనాట్ 175 నినాదంతో వైసీపీ నాయకులు రచ్చ చేశారు. కానీ, ప్రజలు 11 మాత్రమే కట్టబెట్టారు.
ఇక, వచ్చే ఎన్నికల మాటేంటి? అనేది వైసీపీలో ఆసక్తిగా మారింది. వైనాట్ 175 నినాదం విఫలం కావడం.. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు కేవలం 100కు మాత్రమే పరిమితం కావాలని నాయకులు సూచిస్తున్నారు. తాజాగా జరిగిన వెన్నుపోటు కార్యక్రమంపై సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. గతంలో భారీ లక్ష్యం పెట్టుకుని.. ముందుకు వెళ్లడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. ఇప్పుడు పరిమిత లక్ష్యంతో ముందుకు సాగి.. విజయం దక్కించుకుందామని పలువురు నాయకులు పేర్కొన్నారు.
అంటే.. 100 స్థానాలను పరిమితంగా తీసుకుని.. బలమైన ప్రచారంతోపాటు.. నాయకులను ఎంగేజ్ చేయడం ద్వారా ఆయా స్థానాల్లో గెలుపు ఖాయం అనే మాటను తెచ్చుకుంటే సరిపోతుందన్న లెక్కలు వివరిం చారు. అయితే.. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న ఆలోచన మాత్రమే. దీనికి సంబంధించి.. పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక, మరికొందరు కూడా ఇదే ఆలోచన చెప్పారు. ఎలానూ 11 స్థానాలు గెలిచిన నేపథ్యంలో ఇలానే బలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంటే సరిపోతుందన్నారు.
దీనిపై సజ్జల ఆలోచిద్దాం.. లక్ష్యం తగ్గించుకునే కంటే.. గెలిచే మార్గాలపై దృష్టి పెట్టాలని ఆయన బోధించారు. కానీ.. గతంలో కుప్పంపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో పొరుగున ఉన్న నియోజకవర్గాలకు నిధులు లేకుండా పోయాయని..ఒకరిద్దరు నాయకులు చెప్పారు. మనకు ఉన్న సమాచారం ప్రకారం బలమైన నియోజకవర్గాలను 100 ఎంచుకుని.. ముందుకు సాగితే సరిపోతుందన్న సూచనలు వచ్చాయి. అయితే.. జగన్ పాదయాత్ర ఉందని.. ఇది అయిన తర్వాతే.. ఈ విషయంపై నిర్ణయం తీసుకుందామని.. ఇప్పటికైతే.. నియోజకవర్గాల్లో అందరూ కలిసి పనిచేయాలని సజ్జల సూచించారని కీలక నాయకుడు ఒకరు వెల్లడించారు.
