Begin typing your search above and press return to search.

ఎన్డీయే కే జగన్ ఫుల్ సపోర్ట్

ఇక వైసీపీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ఎన్డీఏకు ఆయన పదేపదే బేషరతుగా మద్దతు ఇవ్వడం అనేక రకాలైన చర్చలను లేవనెత్తుతుంది అని అంటున్నారు.

By:  Satya P   |   20 Aug 2025 12:03 AM IST
ఎన్డీయే కే జగన్ ఫుల్ సపోర్ట్
X

నిజానికి రాజకీయాల మీద ఆసక్తి వర్తమాన రాజకీయ పరిణామాల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది ఏమంత ఆశ్చర్యమైన వార్త అయితే కాదు. కానీ ఎప్పటికపుడు మారుతున్న రాజకీయ వాతావరణం నేపధ్యంలో ఎవరేమిటి వారి స్టాండ్ ఏమిటి అన్నది ఎపుడూ ఒక చర్చగానే ఉంటుంది. అలా కనుక ఆలోచిస్తే ఏపీకి చెందిన కీలక ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఏ వైపు మొగ్గు చూపిస్తుంది అన్నది మాత్రం ఒక బిగ్ డిబేట్ గా ఉంటూనే ఉంది. తాజాగా ఎన్డీయే మీద ఆ పార్టీ చేస్తున్న విమర్శలను తీసుకున్నపుడు కూడా ఏమో ఏమైనా జరగవచ్చు అనుకున్న వారికి తనదైన నిర్ణయంతో వైసీపీ మరో మారు వార్తలలో నిలించింది.

వైసీపీ రూట్ అటే :

ఎన్డీయే ఒక వైపు ఇండియా కూటమి మరోవైపు జాతీయ స్థాయిలో మోహరించి ఉన్న వేళ వైసీపీ ఎటు వైపు అంటే కచ్చితంగా ఎన్డీయే వైపే అని ఎక్కువ మంది అంటారు. అదే నిజం అయింది. ఎన్డీయే నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్ధి అయిన సీపీ రాధాకృష్ణన్ కి వైసీపీ తన మద్దతుని ప్రకటించింది. ఇది అధికారికంగానే ధృవీకరించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, జగన్ కి అత్యంత సన్నిహిత నేత అయిన వైవీ సుబ్బారెడ్డి. తమ ఓటు ఎన్డీయేకు అని ఆయన అఫీషియల్ గానే క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఎన్డీయే పక్షం వహిస్తుందని ఆయన చెప్పారు.

ఆ వైపు తెలుగు బిడ్డ :

ఇక చూస్తే కనుక దేశ కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక అన్నది అనివార్యం అయింది. ఎన్డీయేకు ధీటుగా ఇండియా కూటమి సైతం తన అభ్యర్ధిని బరిలోకి దించింది. ఆయన ఎవరో కాదు రాజకీయాలకు అతీతమైన వారు. న్యాయమూర్తిగా సేవలు అందించిన అరు ఆయనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన పేరుని ఇండియా కూటమి డిక్లేర్ చేసింది. ఒక విధంగా చూస్తే ఆయనకు తెలుగు వారు అంతా మద్దతుగా నిలవాలి. కానీ వైసీపీ మాత్రం ఎన్డీయే పక్షమే వహిస్తోంది. దానికి కారణం వెరీ సింపుల్ అని అంటున్నారు.

రాహుల్ అంటే అంతేనే :

వైసీపీకి కాంగ్రెస్ అంటే చాలా కోపం ఉంది అని అంటారు. అది కాలాలకు అతీతమైన కోపం అని చెబుతారు. ఎందుకంటే జగన్ ని ఏకంగా పదహారు నెలల పాటు జైలులో పెట్టించారు అన్నది ఆ పార్టీ ఆవేదన. ఇక జగన్ అయితే గాంధీ కుటుంబం పట్ల అదే తీరున తన అయిష్టతను వ్యక్తం చేస్తూ ఉంటారు అని అంటారు. తాజాగా కూడా ఓట్ల చోరీ వ్యవహారంలో రాహుల్ గాంధీ ఏపీ గురించి ప్రస్తావించలేదని ఆయనకు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య హాట్ లైన్ నడుస్తోందని చెప్పి సంచలన వ్యాఖ్యలనే చేశారు జగన్. ఇదంతా ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయన్న దాని కంటే ముందే. అంటే ముందే ఇండియా కూటమి వైపు తము కాదు అని జగన్ అండ్ కో చెప్పేశారు అని అంటున్నారు.

గతంలో ఎన్డీయే పక్షమే :

రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి పదవులకు వైసీపీ మద్దతుని కనుక ఒకసారి పరిశీలిస్తే గతంలో ఒకే ఒక సారి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయినపుడు మాత్రమే మద్దతు ఇచ్చింది. ఆనాడు జైలు నుంచి బయటకు వచ్చి మరీ తన ఓటుని కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి నిలబెట్టిన ప్రణబ్ ముఖర్జీకి వేశారు జగన్. ఆ తర్వాత మాత్రం అనేక సందర్భాలలో ఎన్డీయే కూటమి వైపే నిలిచారు. ఇపుడు కూడా అదే జరుగుతోంది అని అంటున్నారు. వైసీపీ తటస్థ పార్టీ అని చెప్పుకున్నా సమయం వస్తే జాతీయ రాజకీయాలలో ఎన్డీయే వైపే నిలుస్తుంది అని గుర్తు చేసుకుంటారు రాజకీయ విశ్లేషకులు.

వైసీపీ స్టాండ్ మీద చర్చ :

ఇక వైసీపీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ఎన్డీఏకు ఆయన పదేపదే బేషరతుగా మద్దతు ఇవ్వడం అనేక రకాలైన చర్చలను లేవనెత్తుతుంది అని అంటున్నారు. ఏపీ వరకూ వస్తే మాత్రం వైసీపీ అధినాయకత్వం ఎండీయే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి ఎన్నికలు వస్తే ఆ వైపునే ఉంటారు. మరో విషయం చూస్తే కనుక ఏపీకి చెందిన బీజేపీ నాయకులు జగన్ ని గట్టిగానే విమర్శిస్తారు. జాతీయ స్థాయి నాయకులు మాత్రం మౌన ముద్ర దాలుస్తూంటారు. ఇది కూడా ఎన్నో రకాలైన చర్చలకు తావిస్తోంది. అయితే వైసీపీ ఈ మద్దతు విషయంలో చెప్పేది ఏంటి అంటే రాజ్యాంగ పదవుల విషయంలో రాజకీయాలు ఉండరాదు అని . ఏది ఏమైనా వైసీపీ తన రాజకీయ స్టాండ్ ని మరోమారు జాతీయ స్థాయిలో కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పింది అని అంటున్నారు.