క్యాడర్ రచ్చతో మచ్చ పడుతోంది!
పరామర్శ కావొచ్చు.. ప్రజల కోసం కావొచ్చు. కారణం ఏదైనా.. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాలు బయట పెడితే చాలు.. వైసీపీ వర్గాలు ఎంతలా చెలరేగిపోతాయన్న దానికి నిదర్శనంగా చాలానే ఉదంతాలు కనిపిస్తాయి.
By: Garuda Media | 6 Aug 2026 9:58 AM ISTపరామర్శ కావొచ్చు.. ప్రజల కోసం కావొచ్చు. కారణం ఏదైనా.. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాలు బయట పెడితే చాలు.. వైసీపీ వర్గాలు ఎంతలా చెలరేగిపోతాయన్న దానికి నిదర్శనంగా చాలానే ఉదంతాలు కనిపిస్తాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి జగన్ వెళ్లారు. పోగాకు రైతుల సమస్యలు తెలుసుకోవటానికి ఆయన ఈ పర్యటనను ఎంపిక చేసుకున్నారు. అయితే.. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ పరివారం చెలరేగిపోయారు. ప్రధాన రహదారులపై వాహనాలతో రచ్చ చేయటమే కాదు.. పెద్ద ఎత్తున విన్యాసాలు చేయటం.. నడిరోడ్డు మీద తాగుతూ డ్యాన్సులు చేయటం.. ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చేయాలో అన్ని చేసిన పరిస్థితి.
వైఎస్ జగన్ రావటానికి రెండు గంటల ముందు నుంచే రచ్చ మొదలైంది. భారీ ఎత్తున ఆయన అభిమానులు.. సానుభూతిపరులు టూవీలర్లు.. కార్లు.. ట్రాక్టర్లతో వీరంగం వేసిన వైనం చూస్తే.. సామాన్యులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి. ఒక పార్టీ అధినేత వచ్చినప్పుడు హడావుడి సహజం. అదంతా ఉత్సాహభరితంగా ఉండాలే తప్పించి.. బలప్రదర్శనకు వేదికగా మారకూడదు. అలా జరిగితే.. సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
ఈ సందర్భంగా జగన్ పాదయాత్రను ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసినప్పుడు వైసీపీ క్యాడర్ వ్యవహరించిన తీరుకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ వర్గీయుల తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్న విమర్శ ఉంది. చేతిలో అధికారంలో లేని వేళ.. రచ్చకు పెద్ద పీట వేసేలా వైసీపీ క్యాడర్ వ్యవహరిస్తే.. ప్రజల్లో తమ అధినేత ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తించకపోవటం గమనార్హం. ఈ తీరును కట్టడి చేయాల్సిన వైసీపీ నేతలు కొందరు పట్టనట్లుగా వ్యవహరిస్తుంటే.. మరికొందరు ఈ అతిని ప్రోత్సహిస్తున్న వైనం సరికాదన్న మాట వినిపిస్తోంది.
తాజాగా జగన్ దేవరపల్లి పర్యటనను చూస్తే.. ఆయనను చూసేందుకు వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఆయన రావటానికి కొన్ని గంటల ముందే పెద్ద ఎత్తున వాహనాలతో వైసీపీ శ్రేణులు దేవరపల్లికి చేరుకున్నాయి. దీంతో.. రాజమహేంద్రవరం నుంచి ఏలూరు,జంగారెడ్డి గూడెం ప్రాంతానికి వెళ్లే వారంతా తీవ్ర అవస్థలకు గురయ్యారు. దీనికి కారణం.. జగన్ పర్యటన జరుగుతున్న దేవరపల్లి ఈ మార్గానికి అత్యంత కీలకం. హెలిప్యాడ్ నుంచి పోగాకు వేలం కేంద్రానికి జగన్ చేరుకోవటానికి దాదాపు గంటన్నర సమయం పట్టటం చూస్తే.. వైసీపీ శ్రేణులు ఎంత భారీగా తరలి వచ్చాయో అర్థమవుతుంది.
ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏదైనా.. దాని అధినేత వస్తున్నప్పుడు హడావుడి మామూలే. కాకుంటే.. ఇలాంటి సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శించటం మంచిది కాదు. అది పార్టీ ఇమేజ్ ను.. పార్టీ అధినేత ఇమేజ్ ను దెబ్బ తీస్తుందన్న విషయాన్ని వైసీపీ వర్గాలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను చేసే పర్యటనల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారా? లేదా? అన్నది ప్రశ్నగా మారుతోంది.
