Begin typing your search above and press return to search.

ఓపెన్ అయిపోతున్న వైసీపీ...కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేదా ?

ఏపీలో కొన్ని కీలక ఓటు బ్యాంకులు ఉన్నాయి. అవి కొన్ని పార్టీలకే పరిమితం. ఆ ఓట్లు వేరే పార్టీకి అంత సులువుగా బదిలీ కావు.

By:  Satya P   |   19 April 2026 9:00 AM IST
ఓపెన్ అయిపోతున్న వైసీపీ...కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేదా ?
X

ఏపీలో కొన్ని కీలక ఓటు బ్యాంకులు ఉన్నాయి. అవి కొన్ని పార్టీలకే పరిమితం. ఆ ఓట్లు వేరే పార్టీకి అంత సులువుగా బదిలీ కావు. ఏపీలో గతంలో కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రెండు రాజకీయ శిబిరాలు సిద్ధాంతాలు ఉండేవి. కాంగ్రెస్ వైపు బలమైన కొన్ని సామాజిక వర్గాలు మైనారిటీలు అణగారిన వర్గాలు ఉంటే వామపక్షాల వైపు మరికొన్ని సెక్షన్లు ఉండేవి. ఇక టీడీపీ ఆవిర్భవించాక బీసీ ఓట్లను కన్సాలిడేట్ చేసింది. దాంతో పాటుగా ఇతర వర్గాలను దగ్గరకు చేర్చుకుంది ఆటోమేటిక్ గా కామ్రేడ్స్ బీజేపీ ఓటు బ్యాంకులు కూడా టీడీపీ వైపు టర్న్ అయ్యాయి. అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మాత్రం అలాగే ఉంటూ వచ్చింది.

చిత్తు అయిన చోట :

ఇదిలా ఉంటే 1983 తరువాత కాంగ్రెస్ కొన్ని ఎన్నికల్లో ఓడినా తిరిగి అధికారంలోకి రావడానికి కారణం బలమైన ఓటు బ్యాంక్ తో పాటు పునాదులు గట్టిగా ఉండడమే. ఎపుడైతే విభజన జరిగిందో దాంతో ఏపీలో కాంగ్రెస్ దాదాపుగా అదృశ్యం అయిపోయింది. గత మూడు ఎన్నికల నుంచి ఉనికి పోరాటం చేస్తూ వస్తోంది. ఎక్కడా ఒక్క సీటు దక్కలేదు. డిపాజిట్లు కూడా ఆ పార్టీకి అసలు దక్కడం లేదు. ఈ రకమైన దైన్యంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతూంటే వైసీపీ కాంగ్రెస్ నుంచి లాగేసుకున్న ఓటు బ్యాంక్ తో గట్టిగా ఉంది.

బీజేపీ కి మద్దతుగా :

ఇదిలా ఉంటే 2014 తరువాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో కాంగ్రెస్ బద్ధ వ్యతిరేక ధోరణులే వైసీపీ బీజేపీల మధ్య పరోక్ష దోస్తీకి కారణం అయ్యాయి. ఇక 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చి పుచ్చుకునే వైఖరి ఇంకా పెరిగింది. 2024 లో ఘోర ఓటమి సంభవించినా వైసీపీ బీజేపీకి కేంద్రంలో కీలక బిల్లుల విషయంలో సహకరిస్తోంది. అదే సమయంలో ఏపీలో ఉన్న ఎన్డీయేను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాంతో వైసీపీ మార్క్ రాజకీయం ఎవరికీ అంతుపట్టకుండా ఉందని అంటున్నారు.

అవుట్ రేట్ గానే :

ఇక చూస్తే కనుక తాజాగా కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చింది 293 మంది ఎంపీలే ఎన్డీయేకు నికరంగా ఉన్నారు. కానీ ఓటింగ్ తరువాత ఆ బలం 298 కి చేరింది. అలా వచ్చిన అదనం ఓట్లలో వైసీపీకి నాలుగు ఉన్నాయి. దాంతో ఏపీ నుంచి మొత్తం పాతిక మంది ఎంపీల మద్దతు ఈ బిల్లుకు దక్కినట్లు అయింది. అంతటితో ఊరుకోకుండా వైసీపీ ఏకంగా జాతీయ స్థాయి విపక్షాల మీద విమర్శలు చేసింది మహిళా బిల్లుని డీలిమిటేషన్ ని అడ్డుకున్నారు అని మండిపడింది. ఇలా బాహాటంగా వైసీపీ మద్దతు ఇవ్వడం విశేషం. అయితే కీలకమైన మహిళా బిల్లు కాబట్టే జగన్ తన మద్దతుని ఓపెన్ గా చెప్పారని అంటున్నారు. కానీ బీజేపీని జాతీయ స్థాయిలో బలమైన విపక్ష కూటమి వ్యతిరేకిస్తోంది. మరో వైపు దక్షిణాదిన సీట్ల మీద డీలిమిటేషన్ ప్రభావం ఉంటుందని అనేక పార్టీలు విమర్శిస్తున్నాయి. ఒక విధంగా బీజేపీ కేంద్రంగా లోక్ సభలో ఓటింగ్ జరిగింది. కానీ బిల్లుల కోసమే అంటూ వైసీపీ మద్దతు ఇవ్వడం మీదనే చర్చ సాగుతోంది.

ముసుగు తొలగింది :

జగన్ బీజేపీల మధ్య అక్రమ పొత్తు ముసుగు తొలగింది అని కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల విమర్శించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని ఆమె గట్టిగా మరోసారి చెప్పారు మోడీకి ఇంతలా మద్దతు ఇవ్వడం ఒక ప్రతిపక్ష పార్టీగా వైసీపీ చేస్తున్న నిర్వాకం దేశంలో ఎక్కడా చూడలేదని ఆమె విమర్శించారు. ఒక విధంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైసీపీ పరం అయింది కానీ ఆ ఓటు బ్యాంక్ అండతో రాజకీయాలు చేస్తున్న వైసీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడమేంటి అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ అంతేనా :

అయితే ఏపీలో మైనారిటీలు ఇతర అణగారిన వర్గాల ఓటు బ్యాంక్ వైసీపీ నుంచి తీసుకోవడానికి కాంగ్రెస్ కి శక్తి సరిపోవడం లేదు, మరే పార్టీ సమీపంలో లేదు. దాంతో పాటు గత 2024 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో కూటమి 99 శాతం సీట్లు గెలిచింది. అలాగే మైనారిటీలు సపోర్టు చేశారు. దాంతో వైసీపీ కూడా ఇపుడు ఓపెన్ అవుతోందా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా సామాజిక పోలరైజేషన్ అన్నది ఏపీలో సాగనంతకాలం ఈ రాజకీయ విన్యాసాలు తప్పవని అంటున్నారు.