విజయ్ బాటలో జగన్...2029 టార్గెట్ !
అందులో భాగంగా ఆయన జగన్ 2.0 సూపర్ యాప్ పేరుతో సరికొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారమైన డిజిటల్ యాప్ ని తాజాగా ప్రారంభించారు.
By: Satya P | 17 July 2026 11:07 PM ISTఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ 2029 లో ఎలాగైనా వైసీపీని అధికారంలోకి తీసుకుని రావాలనుకుంటున్నారు. ఇది ఒక్క చాన్స్ లాంటి 2019 ముందు నినాదం కాదు, ఇది కచ్చితమైన చాన్స్ కోరే విధంగా జనాల వద్దకు వెళ్ళే గట్టి ప్రయత్నం. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి సవా లక్ష కారణాలలో అతి ముఖ్యమైనది క్యాడర్ లో ఉత్సాహం లేకపోవడం. వారు పూర్తిగా కాడె వదిలేసి పక్కకు తప్పుకోవడం. ఈ నేపథ్యంలో జగన్ క్యాడర్ తో డైరెక్ట్ కనెక్షన్ కోసం రకరకాలైన ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన జగన్ 2.0 సూపర్ యాప్ పేరుతో సరికొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారమైన డిజిటల్ యాప్ ని తాజాగా ప్రారంభించారు. దీంతో గ్రౌండ్ లెవెల్ లో ఉన్న క్యాడర్ నేరుగా అధినాయకత్వంలో అనుసంధానం అవడానికి ఈ సూపర్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని అంటున్నారు.
మనసులో మాట తెలుసుకోవడమే :
క్యాడర్ తమ మనసులో ఏమనుకుంటోంది అన్నది తెలుసుకోవడానికి ఎలాంటి సంకోచాలు భయాలు లేకుండా తమ భావనలను అధినాయకత్వం వద్ద పంచుకోవడానికి సూపర్ యాప్ వినియోగించవచ్చు అని చెబుతున్నారు. దీని వల్ల బూత్ లెవెల్ క్యాడర్ తో కూడా నేరుగా అధినాయకత్వం కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే వారు సైతం తమ సమస్యలను ఎప్పటికపుడు చెప్పుకునేందుకు ఒక సరైన డిజిటల్ వేదికగా ఇది ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టీవీకే విజయంలో కీలకం :
అయితే ఈ వ్యూహాత్మకమైన అడుగు వైసీపీ వేయడానికి కారణం ఉంది అని అంటున్నారు. పార్టీ క్యాడర్ లో ఉత్తేజం చురుకుదనం తేవాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇపుడున్న డిజిటల్ వ్యవస్థలో నేరుగా క్యాడర్ ని కలవడం కంటే కూడా ఈ విధానం వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుందని భావిస్తోంది. దీని వల్ల రియల్ టైం లో నే క్యాడర్ లీడర్ ల మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా అభిప్రాయాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడ ఎవరు ఏమి చేయాలనుకుంటున్నారో కూడా చూసేందుకు వారిని మోటివేట్ చేసేందుకు దిశా నిర్దేశం చేసేందుకు కూడా ఉపయోగపడుతుందని కూడా అంటున్నారు. ఈ విధానాన్ని కొత్త పార్టీ అయినా తమిళనాడులో దళపతి విజయ్ అనుసరించి 2026 ఎన్నికల్లో సూపర్ సక్సెస్ కొట్టారని అంటున్నారు. ఆయన తమ పార్టీ కోసం ఇలాంటి యాప్ నే మైటీవీకే పేరుతో ప్రవేశపెట్టారు. దాంతో వైసీపీ కూడా ఇదే తీరున ఏపీలో అనుసరిస్తోంది అని అంటున్నారు.
గ్రౌండ్ లెవెల్ లోకి నేరుగానే :
ఈ యాప్ వల్ల బూత్ మేనేజ్మెంట్ వంటివి చేయడమే కాకుండా క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతోంది అన్న దాని మీద ఫీడ్ బ్యాక్ ని ఎప్పటికపుడు సేకరించడం దానికి అనుగుణంగా పార్టీ క్యాడర్ ని ముందుకు నడిపించడం, చురుకుగా ఉంచడం వంటివి చేసి టీవీకే సూపర్ హిట్ సక్సెస్ ని కొట్టింది అని అంటున్నారు. ఇపుడు అలాంటి యాప్ నే వైసీపీ తేవడం వెనక ఉద్దేశ్యం కూడా టీవీకే తరహాలో పనిచేయడమే అంటున్నారు. అందుకే ఈ సూపర్ యాప్ ని తెచ్చారు చెబుతున్నారు. వైసీపీ క్యాడర్ మొత్తాని కార్యోన్ముఖుల్ని చేయడం పార్టీకి ఈ యాప్ ద్వారా మరింత సులువు అవుతుంది అని అంటున్నారు. అంతే కాదు ఎక్కడికక్కడ కో ఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు. వైసీపీ గొంతుకను సొంతంగానే వినిపించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అలాగే క్యాడర్ ఫిర్యాదులను చేస్తే వాటిని తీసుకోవడం వెధింపుల మీద కూడా పార్టీ వెంటనే రియాక్ట్ అయ్యేలా ఈ యాప్ అక్కరకు వస్తుందని అంటున్నారు. క్యాడర్ ని కాపాడుకోవడానికి డిజిటల్ బుక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని చెబుతున్నారు. పార్టీ కోసం వైసీపీ తీసుకున్న అతి పెద్ద డిజిటల్ స్థాయి వ్యవస్థ ఇదని దీని ఫలితాలు వైసీపీకి సానుకూలంగా ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
