వైసీపీది పేరాశ... రెడీ కావాల్సిందే !
రాజకీయాల్లో ఎన్నో జరుగుతాయి. అన్ని చోట్లా జరుగుతాయి. కానీ ఏపీ రాజకీయమే సెపరేట్ గా సాగుతుంది.
By: Satya P | 10 Dec 2025 12:00 PM ISTరాజకీయాల్లో ఎన్నో జరుగుతాయి. అన్ని చోట్లా జరుగుతాయి. కానీ ఏపీ రాజకీయమే సెపరేట్ గా సాగుతుంది. ఇక్కడ అంతా ఒక ప్రత్యేకంగా చూడాలి. ఓటర్లు అలాగే విలక్షణమైన తీర్పులు ఇస్తూంటారు. రాజకీయ పార్టీలు నాయకులు అలాగే కొత్తగా ఆలోచిస్తూంటారు అందుకే దేశంలోనే ఏపీ ఒక స్పెషల్ అని చెప్పాలి. దేశమంతా ఇదిరాగాంధీని ఓడిస్తే ఏపీ జనాలు నెత్తిన పెట్టుకున్నారు. అదే దేశమంతా రాజీవ్ గాంధీని ఆయన కాంగ్రెస్ ని గెలిపిస్తే ఏపీలో టీడీపీని గెలిపించారు జనం. ఇక ఏపీలోని రాజకీయ పార్టీలు జాతీయంగా తీసుకునే వైఖరులు కూడా మరో ప్రత్యేకం. ఎక్కడా లేని విధంగా అధికార విపక్షాలు రెండూ కూడా ఎన్డీయే నిలబెట్టే రాష్ట్రపతి ఉప రాష్ట్రపతులకు ఓటేస్తూంటారు.
కూటమి బీటలు అంటూ :
ఇక అసలు విషయానికి వస్తే దేశంలో అన్ని చోట్లా పొత్తులు ఉంటాయి. అవన్నీ ఎన్నికల వరకే అన్నట్లుగా ఉంటాయి. ఒక్కసారి అధికారంలోకి రాగానే ఆ పొత్తులు చిత్తు అవుతూ ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం పొత్తు సెపరేట్ ట్రాక్ లో నడుస్తోంది 2019 చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కూటమిలోని మూడు పార్టీలు ఇక పైన విడిపోకూడదని ఒట్టేసుకుని ముందుకు సాగుతున్నాయి. అంతే కాదు మరో పదిహేనేళ్ల పాటు ఏపీలో కూటమి అధికారంలో ఉండాలని కూడా గట్టిగా కోరుతున్నాయి. అలా టీడీపీ జనసేన బీజేపీ కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. కూటమిలో విభేదాలు వస్తాయని పొత్తు చిత్తు అవుతుందని భావించిన వైసీపీకి అయితే ఈ పరిణామాలు అసలు మింగుడు పడడం లేదు అని అంటున్నారు.
పదిహేను ఇచ్చిన సందేశం :
వైసీపీ ఇంకా 2014 నుంచి 2019 మధ్యనే తన రాజకీయ వ్యూహాలతో ఉండిపోయింది. ఆనాడు కూడా మూడు పార్టీలు కలసి అధికారంలోకి వచ్చాయి. కానీ ముందు జనసేన విడిపోయింది. ఆ తరువాత బీజేపీ నుంచి టీడీపీ వేరు పడింది. అలా 2019లో బంగారు పళ్ళెంలో అధికారాన్ని వైసీపీ చేతిలో పెట్టడానికి ఈ విభేదాలు కలసి వచ్చాయని అంటున్నారు. అలాంటి పరిస్థితి మళ్ళీ 2024 నుంచి 2029 మధ్యలో వస్తుందని వైసీపీ ఊహిస్తోంది. దాని కోసం చేయాల్సింది అంతా చేస్తోంది. కానీ ఎక్కడా వర్కౌట్ కావడం లేదు అని అంటున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు అయితే కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదని గ్రౌండ్ లెవెల్ లో అంతా బాలేదని ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ చంద్రబాబుజ్ పవన్ అలాగే బీజేపీ పెద్దలు అంతా ఒక్కటిగా ఉంటూ కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు ఏపీలో ఉండాల్సిన ఆవశ్యకతను అయితే తెలియచేస్తున్నారు. దాంతో మెజారిటీ నేతల మైండ్ సెట్ అయితే ఈ విధంగా మార్చగలుస్తున్నారు అని అంటున్నారు.
టఫ్ టాస్క్ గానే :
అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగా వ్యవధి ఉంది కాబట్టి కూటమిలో బీటలు చూడవచ్చు అన్న ఆశ అయితే వైసీపీలో ఎక్కడో ఉంది. కానీ చూస్తూంటే అదేమీ జరిగేది కాదని కూడా తేలుతోంది. ఈ క్రమంలో కూటమిగా మూడు పార్టీలు 2029 ఎన్నికల్లో వస్తే కనుక వైసీపీకి ఫైట్ అంత ఈజీ కాదని అంటున్నారు. సర్వ శక్తులూ ఒడ్డాల్సిందే అని అంటున్నారు. అంత చేసినా ఫలితం మాత్రం సానుకూలంగా వస్తుందన్న ధీమా అయితే ఉంటుందా అన్న సందేహాలూ ఉన్నాయి. ఏది ఏమైనా వైసీపీ అయితే ఒంటరి పోరుకు రెడీ కావాల్సిందే అదే సమయంలో బలంగా ఉన్న కూటమినే ఎదుర్కోవడానికి ప్రిపేర్ కావాల్సిందే అని అంటున్నారు.
