జగన్ వర్సెస్ పవన్...ఎపుడు ఎక్కడ ?
ఏ మాత్రం స్పేర్ చేయవు కూడా. కానీ వైసీపీ మాత్రం కూటమిలోని పార్టీలను ఎంచుకుని మరీ తమ రాజకీయ విమర్శలకు పదును పెడుతోంది.
By: Satya P | 10 Aug 2026 3:00 PM ISTఏపీ రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే కూటమిలో పెద్దన్న అయిన టీడీపీతోనే వైసీపీ ఢీ కొడుతోంది. అందులో రెండవ పెద్ద పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేన ఊరు తలవడం లేదు, ఇక బీజేపీ గురించి వైసీపీ పెద్దగా ఎపుడూ మాట్లాడింది లేదు, విమర్శలు చేసింది లేదు అనే అంటారు. మరి వైసీపీ ఈ రకంగా వ్యూహ రచన చేయడం వెనక కారణాలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. నిజానికి వైసీపీని కూటమిలోని మూడు పార్టీలూ కలసి కట్టుగా ఓడించాయి. ఏదైనా విమర్శ చేయాల్సి వస్తే మూడు పార్టీలూ గట్టిగానే చేస్తాయి. ఏ మాత్రం స్పేర్ చేయవు కూడా. కానీ వైసీపీ మాత్రం కూటమిలోని పార్టీలను ఎంచుకుని మరీ తమ రాజకీయ విమర్శలకు పదును పెడుతోంది.
జనసేనతో ఎందుకలా :
ఇక జనసేన విషయానికి వస్తే ఎందుకో వైసీపీ ఈ మధ్య పెద్దగా స్పందించడం లేదు. బహుశా 2024 కి ముందు అధికారంలో ఉన్నపుడు పవన్ ని గట్టిగా టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గం ఆగ్రహానికి గురి అయ్యామన్న ముందు జాగ్రత్త కాబోలు అని అంటున్నారు. అంతే కాదు ప్రభుత్వంలో పెద్దన్నగా టీడీపీ ఉందని ఆ పార్టీ నిర్ణయాలే అమలు అవుతున్నాయని అందువల్ల జనసేనను ఊరకే అని నాలుగు తిని ఆ పార్టీతో పెట్టుకోవడం ఎందుకొచ్చినది అన్న రాజకీయ తెలివిడితో కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.
వారి మంత్రుల మీద :
అంతే కాదు జనసేన మంత్రుల శాఖ మీద కూడా వైసీపీ ఇప్పటిదాకా విమర్శలు చేసింది లేదు, పవన్ చేతిలో అయిదు శాఖలు ఉన్నాయి. అలాగే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా కీలక శాఖలనే చూస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఈ శాఖల జోలికి ఏ మాత్రం పోవడం లేదు, మరో వైపు ఈ శాఖలలో ఆ మంత్రులు బాగానే పనిచేస్తున్నారు అని అంటున్నారు. దాంతో కూడా జనసేన వైపే వైసీపీ చూడడం లేదని అంటోంది. అదే ఏ చిన్న తప్పు జరిగినా టీడీపీ మంత్రుల శాఖల మీద మాత్రం రాజకీయ రాద్ధాంతం చేస్తోంది అని గుర్తు చేస్తున్నారు. అంటే వైసీపీ ఒక వైపే చూస్తోంది అని అంటున్నారు.
వ్యూహాత్మకంగానే :
జనసేనను వైసీపీ ఈ విధంగా పక్కన పెట్టడం వెనక రాజకీయ వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. 2024 ఎన్నికలు వేరు, 2029 ఎన్నికలు వేరు అని అంటున్నారు. రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అని అంటారు. అందువల్ల తమ శాశ్వత ప్రత్యర్థిగా టీడీపీనే వైసీపీ ఎంచుకుంది అని అంటున్నారు. టీడీపీ అంటే ఒంటి కాలు మీద వైసీపీ లేస్తుంది. మిగిలిన కూటమి పార్టీల మీద ఆ స్పీడ్ అసలు చూపించడం లేదు అంటే అది పక్కా రాజకీయ ఎత్తుగడగానే చూస్తున్నారు. గతంలో వైసీపీ ఈ విధంగా వ్యవహరించలేదు అని కూడా అంటున్నారు. ఒకేసారి ఒకరిని మించి ఎక్కువ మంది ప్రత్యర్ధులను తయారు చేసుకుని వారందరినీ అనేస్తూ వారి నుంచి వచ్చే విమర్శల జడివానలో తడిసిపోతూ ఉక్కిరిబిక్కిరి అయ్యేదని చెబుతున్నారు.
ఇప్పట్లో ఉందా లేదా :
ఈ క్రమంలో జగన్ ఎక్కడికి బహిరంగ సభలు నిర్వహించినా లేదా పర్యటనలు చేసినా మీడియా మీటింగ్స్ పెట్టినా చంద్రబాబు లోకేష్ ల మీదనే గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. గతంలో మాదిరిగా పవన్ ని దత్తపుత్రుడు ట్యాగ్ పెట్టి విమర్శలు అయితే చేయడం లేదు, మరి జగన్ ఒకటి అంటే అటు నుంచి కూడా రీ సౌండ్ వస్తుంది. అలా జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా ఏపీ రాజకీయం హీటెక్కడం ఖాయం. కానీ అది మాత్రం ఇటీవల కాలంలో జరగడం లేదు, ఇంతకీ అలాంటి సందర్భం వస్తుందా లేదా ఇక వైసీపీ కొత్త వ్యూహాలలో భాగంగా ఇదంతా అలా సాగిపోతుందా అంటే వేచి చూడాల్సిందే అని అంటున్నారు.
