పొలిటికల్ ఎఫెక్ట్: నల్లపరెడ్డి నలిగిపోతున్నారా.. ?
నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు.
By: Garuda Media | 28 March 2026 6:00 AM ISTనల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు. అయితే.. ఇప్పుడు ఆయన వైసీపీ రాజకీయంలో నలిగిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. రాజకీయంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నేపథ్యంలో పార్టీ నుంచి ప్రసన్న కుమా ర్ రెడ్డికి కీలక ఆదేశాలు అందాయి. ప్రస్తుత నెల్లూరు ఎంపీ.. ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే.. ప్రసన్నకుమార్ ప్రత్యర్థి ప్రశాంతి రెడ్డిపై ఎలాంటి విమర్శలు చేయొద్దని ఆదేశాలు అందాయి.
అయితే.. వాస్తవానికి విమర్శలు, ప్రతి విమర్శలు కామనే అయినప్పటికీ.. నల్లపరెడ్డిని సైలెంట్ చేయడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. గత ఎన్నికలకుముందు వరకు కూడా వేమిరెడ్డి ఫ్యా మిలీ వైసీపీలోనే ఉంది. కానీ, ఎన్నికల్లో తమ దంపతులు ఇద్దరికీ టికెట్లు ఇవ్వాలని కోరడంతో వైసీపీ విభేదించింది. ఈ పరిణామాల క్రమంలోనే వేమిరెడ్డి దంపతులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. విజయం దక్కించుకున్నారు.
ఇదిలావుంటే.. రేపు ఏదైనా తేడా వచ్చి.. వేమిరెడ్డి దంపతులు మళ్లీ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందన్నది ఆ పార్టీ నేతలు వేస్తున్న అంచనా. అందుకే.. పార్టీనుంచి జంప్ చేసిన వారిపై ఎక్కడా విమర్శలు చేయొద్ద ని పార్టీపరంగా అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. అయితే.. ఇది తన నియోజకవర్గానికి పనికిరాదని.. తన ఇంటిపై దాడి చేసిన ప్రత్యర్థిపై మౌనంగా ఎలా ఉండాలని ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అయితే.. దీనిని వ్యక్తిగత వివాదంగానే చూడాలని పార్టీ చెబుతోంది.
దీంతో ప్రసన్న కుమార్‌రెడ్డి నలిగిపోతున్నారు. ప్రత్యర్థిగా ఉన్న నాయకులపై విమర్శలు చేయకుండా ఎలా ఉంటామని అంటున్నారు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులు పార్టీ మారిన వారిపై ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి మోపిదేవి వరకు ఎవరిపైనా విమర్శలు చేయకుండా ఆపుతున్నారు. తద్వారా ఎవరైనా మనసు మార్చుకుని పార్టీలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని కూడా అంచనా వేసుకుంటున్నారు. కానీ.. ఈ తరహా రాజకీయాలతో నల్లపరెడ్డి వంటి వారు తీవ్ర ఆవేదన పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
