Begin typing your search above and press return to search.

బాలయ్య మాటలతో యాక్టివ్ అయిన వైసీపీ సోషల్ మీడియా !

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉంటారు కానీ ఒకరికి మరొకరు తెలియకుండానే సాయపడుతూంటారు. అందుకే పరస్పర ఆధారభూతమైనవి రాజకీయాలు అంటూంటారు.

By:  Satya P   |   27 Sept 2025 7:00 PM IST
బాలయ్య మాటలతో యాక్టివ్ అయిన వైసీపీ సోషల్ మీడియా !
X

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉంటారు కానీ ఒకరికి మరొకరు తెలియకుండానే సాయపడుతూంటారు. అందుకే పరస్పర ఆధారభూతమైనవి రాజకీయాలు అంటూంటారు. ప్రత్యర్థిని అణచాలని చూస్తే దిగ్గున లేచి నిలబడతారు, కలబడతారు. అంతే కాదు ప్రత్యర్థిని పదే పదే తలచినా వారి గ్రాఫ్ అలా అమాంతం పెరిగిపోతుంది. ఒక విధంగా చెప్పాలీ అంటే రాజకీయాల్లో కాదంటే అవుననిలే అన్న సూత్రం పనిచేస్తూ ఉంటుంది. దానికి ఏపీలో రాజకీయం నిట్ట నిలువు ఉదాహారణ. గత అయిదేళ్ళూ టీడీపీ నామస్మరణ చేసి ఆ పార్టీనే టార్గెట్ చేసి నానా రకాలైన ఇబ్బందులు పెట్టిన వైసీపీ చివరికి తాను దారుణంగా ఓడి టీడీపీ కూటమికి బంపర్ మెజారిటీ తెప్పించింది. ఇపుడు టీడీపీ వైపు నుంచి వైసీపీ మీద రివర్స్ ఎటాక్ సాగుతోంది.

వైసీపీ రీచార్జ్ :

అలా తమ మీద పడుతున్న రాళ్ళను వైసీపీ మెల్లగా ఏరుకుంటూ వాటితోనే పటిష్టం కావాలని చూస్తోంది. ఈ రాళ్ళే రేపటికి పూలబాట అవుతాయని నమ్ముతోంది. అందుకే కూటమి ఇస్తున్న ఒక్కో చాన్స్ తో మెల్లగా సత్తువ తెచ్చుకుంటోంది. తాజాగా సినీ హీరో ఎమ్మెల్యే అయిన బాలయ్య వైసీపీ అధినేత జగన్ ని పట్టుకుని సైకో గాడు అంటూ నిండు అసెంబ్లీ వేదికగా చేసిన హాట్ కామెంట్స్ తో ఉలిక్కిపడి లేచింది. అంతే సోషల్ మీడియాలో ఇన్నాళ్ళూ నిస్సత్తువగా నీరసంగా ఉన్న వైసీపీ సైన్యం ఇపుడు దూసుకువస్తోంది. టార్గెట్ టీడీపీ టార్గెట్ జనసేన వయా బాలయ్య అంటూ తన దూకుడుని పెంచేస్తోంది. ఈ దెబ్బకు కూటమిలో కలకలం పుట్టాలని పట్టుదలతో పనిచేస్తోంది.

మెగా సాయం తో ఊపు :

ఆ ఇద్దరు సీనియర్ అగ్ర హీరోలు ఒక విధంగా వైసీపీకి ఎంతో మేలు చేశారు అని చెప్పాలి అంటున్నారు. బాలయ్య మాట తూలుడుతో మెగాస్టార్ మీద కూడా ఫ్లో లో చేసిన సెటైర్లు చిరంజీవికి ఆగ్రహం తెప్పించాయి. ఆయన ఆ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆయన ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ విషయంలో సానుకూలంగా మాట్లాడడం ద్వారా కూటమిని తెలియకుండానే ఇరకాటంలో పెట్టేశారు. అది కాస్తా వైసీపీకి అంది వచ్చిన అవకాశం అయింది. అలా ఇద్దరు సినీ హీరోలూ వైసీపీకి అవసరమైన సమయంలో కావలసినంతగా పొలిటికల్ ఆక్సిజన్ అందించారు అని అంటున్నారు.

వైసీపీ ఏకధాటికి :

గతంలో ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా జోరుకు తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యర్ధులను ముప్ప తిప్పలు పెట్టడానికి ఫ్లాష్ బ్యాక్ లో వెతికి మరీ వీడియోలు తెచ్చి పోస్టు చేస్తోంది. ఎవరినీ గుక్క తిప్పుకోనీయకుండా చేస్తోంది. టీడీపీ జనసేనల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని దెబ్బ తీసేలా చాలా పోస్టులు ఇపుడు వైసీపీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల పొత్తులకే విఘాతం కలిగించేలా గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు బాలయ్య చేసిన అప్పటి వ్యాఖ్యలు ఇలా రాజకీయ మసాలా బాగానే నూరి వైసీపీ సోషల్ మీడియా కూటమికి గురి పెడుతోంది.

థాంక్స్ టూ హీరోస్ :

ఒక విధంగా వైసీపీ యమ జోరు చేస్తోంది. తమ అధినేత జగన్ ని బాలయ్య ఏ కారణంగా అయినా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఇపుడు అవే ఫ్యాన్ పార్టీకి ఇంధనంగా మారాయని అంటున్నారు దాంతో మనసులో థాంక్స్ టూ బాలయ్య అంటోంది. అదే సమయంలో థాంక్స్ టూ మెగాస్టార్ అని కూడా మనసారా తలచుకుంటోంది. మొత్తానికి వైసీపీ సోషల్ మీడియా ఫుల్ జోష్ లో ఉంది అంటే దానికి కారణం బాలయ్యే సుమా అని అంతా అంటున్నారు.