Begin typing your search above and press return to search.

ఈసీ...నాడూ నేడూ వైసీపీ !

ఏపీలో వైసీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘంతోనే ఎపుడూ పేచీ వస్తోంది. అధికారంలో ఉన్నపుడు అదే సీన్.

By:  Satya P   |   10 Aug 2025 2:00 AM IST
ఈసీ...నాడూ నేడూ వైసీపీ !
X

ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ. ఆ వ్యవస్థ తీసుకునే నిర్ణయాలకు తిరుగు ఉండదు. దేశంలో అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుతో గవర్నర్ ఆమోదముద్ర వేస్తారు. ఇక ఆ తరువాత ఆ పదవిలోకి వచ్చిన వారు అయిదేళ్ళ పాటు కొనసాగుతారు.

ఈసీ వర్సెస్ వైసీపీ :

ఏపీలో వైసీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘంతోనే ఎపుడూ పేచీ వస్తోంది. అధికారంలో ఉన్నపుడు అదే సీన్. విపక్షంలో ఉన్నపుడు సైతం సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. వైసీపీ తన గోడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వినడం లేదని ఆవేదన చెందుతోంది. కొన్ని సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈసీ తమ ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడుతోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తున్నా మొర ఆలకించడం లేదని వాపోతోంది.

వైసీపీ సిఫార్సుతోనే అలా :

ఏపీలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా నీలం సాహ్ని 2022లో నియమితులు అయ్యారు. ఆమె అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె పదవిని కొంతకాలం ఎక్స్ టెన్షన్ కూడా వైసీపీ ప్రభుత్వం ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతలా నచ్చిన మెచ్చిన అధికారిని ఆమె పదవీ కాలం పూర్తి కావడంతోనే ఏరి కోరిక్ మరీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించారు. అయితే ఆమె పనితీరు మీద వైసీపీకి ఎపుడూ ఆక్షేపణ లేదు, ఫిర్యాదులు సైతం లేవు. కానీ పులివెందుల వేళ మాత్రం ఈసీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఇదా విధానమంటోన్న వైసీపీ :

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెలుగుదేశం అన్ని అడ్డదోవలు తొక్కుతోందని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తరువాత పోలింగ్ కేంద్రాలను మార్చడం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఒక ఊరులోని ఓట్లను, వేరే గ్రామంలోనికి మార్చడం సమంజసమా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనికి బదులు ఎన్నికల్లో తామే విజేతలమని ప్రకటించుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత పోలింగ్ కేంద్రాలను మార్చడం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేస్తున్నారని బొత్స ఫైర్ అవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత శాంతియుతంగా పోలింగ్ జరిగే వరకు చూడాల్సిన వ్యవస్థలు కలుషితమయ్యాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్, పోలీస్ యంత్రాంగం చిత్తశుద్ది ఉంటే ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోరుతున్నామని అంటున్నారు.

నాటి సంగతి అలా :

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2020లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చూసింది. అప్పట్లో కరోనా వల్ల ఎన్నికలను వాయిదా వేశామని నాటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటించారు అని వైసీపీ ప్రభుత్వంలో ఉండగా మండి పడటమే కాదు ఆయన విషయంలో న్యాయస్థానాల దాకా వెళ్ళింది. ఆయన టీడీపీ సిఫార్సుతో ఆ పదవిలోకి వచ్చారని విమర్శలు చేశారు. అయితే వైసీపీ సిఫార్సు మేరకు పదవిని అందుకున్న నీలం సాహ్ని మీద సైతం ఆ పార్టీ ఫైర్ అవుతోంది. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఈసీ మీద నాడూ నేడూ వైసీపీయే ఆగ్రహిస్తోంది. టీడీపీ మాత్రం సజావుగానే తన ఎన్నికల వ్యూహాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దీనిని బట్టి మారాల్సింది వ్యవస్థలు కాదని వైసీపీ వ్యూహాలు అన్నదే అర్ధం చేసుకోవాలని అంటున్నారు.