Begin typing your search above and press return to search.

జగన్ కే సజ్జల బిగ్ ట్రబులిచ్చేశారా ?

అయితే సజ్జల చేసిన ఈ కామెంట్స్ తో వైసీపీకి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే యూటర్న్ అంటూ కూటమి నుంచి భారీ విమర్శలు వచ్చాయి.

By:  Satya P   |   14 Sept 2025 11:00 PM IST
జగన్ కే సజ్జల బిగ్ ట్రబులిచ్చేశారా ?
X

సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రికేయ వృత్తి నుంచి వైసీపీ ద్వారా రాజకీయాల వైపు వచ్చిన వారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా ఆయన ఘన కీర్తిని గడించారు. ఏ శాఖ తరఫున అయినా అలవోకగా మాట్లాడేస్తూ మీడియా ముందుకు వచ్చి చేయాల్సిన హడావుడి చేశారు అని ఆయనకు పేరుంది అంటారు. ఇక వైసీపీలో నంబర్ టూ గా సజ్జల సెటిల్ అయిపోయారు అని కూడా చెబుతూంటారు. జగన్ కి అత్యంత సన్నిహితుడని కోటరీ అంటే ఆయనే అని కూడా పార్టీలో ఉన్న వారు చెవులు కొరుక్కుంటే బయటకు వెళ్ళిన వారు వేలెత్తి చూపిస్తూ ఉంటారు.

మూడు మీద బూమరాంగ్ :

ఇటీవల జరిగిన ఒక వెబ్ మీడియా కాంక్లేవ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రాజధానుల మీద అలాగే అమరావతి రాజధాని మీద మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటనలు చేశారు. జగన్ మరోసారి సీఎం అయితే అమరావతి నుంచే పాలిస్తారు అని కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు తమ పార్టీ గుంటూరు విజయవాడలను రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తుంది అని కూడా చెప్పారు. అమరావతి విషయంలో తమ స్టాండ్ ఇదీ అని ఆయన క్లారిటీ కూడా ఇచ్చేశారు.

యూటర్న్ అంటూ కామెంట్స్ :

అయితే సజ్జల చేసిన ఈ కామెంట్స్ తో వైసీపీకి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే యూటర్న్ అంటూ కూటమి నుంచి భారీ విమర్శలు వచ్చాయి. జగన్ రాజధానుల విషయంలో ఇలా మాట మార్చినా జనాలు ఎవరూ నమ్మరని మంత్రులు కూడా గట్టిగానే చెప్పుకొచ్చారు. రాజధాని మీద ఈ రకంగా పదే పదే స్టాండ్ మారుస్తున్నారు అని కస్సుమన్నారు. దీంతో వైసీపీ అధినాయకత్వం మదిలో ఏముందో అసలు ఇన్నర్ టాక్స్ లో ఏమి అనుకున్నారో తెలియదు కానీ సజ్జల స్టేట్మెంట్ మాత్రం వైసీపీ మూడ్ ని చెడగొట్టి మూడు రాజధానుల విషయంలో యూ టర్న్ గా మారింది అని అంటున్నారు.

జగన్ కి ఇరకాటమా :

ఇక సజ్జల ఇచ్చిన ప్రకటనను జగన్ ప్రకటనగానే తాము చూస్తామని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ఈ స్టాండ్ తో ఉండడం మీద కూడా ఆయన విమర్శిస్తూనే ఎవరైనా ప్రజల అభిప్రాయానికి కట్టుబడాల్సిందే అని చురకలు కూడా అంటించారు. అంతే కాదు తాము ఎన్నుకున్న రాజధాని ప్రాంతం ఏపీలో అన్ని ప్రాంతాలకు సరిసమానమైన దూరంలో ఉందని అన్నింటికీ మధ్యలో ఉందని కూడా నారాయణ వివరించారు. ఇలా చెప్పడం ద్వారా వైసీపీ మూడు రాజధానులు తప్పు విధానం అని ఎత్తి చూపించారు. దాంతో జగన్ కి సజ్జల పాస్ చేసిన స్టేట్మెంట్స్ ఇరకాటంలో పెట్టాయని అంటున్నారు.

సజ్జల సైడేనా :

ఈ నేపధ్యంలో సజ్జల మీద అధినేత ఆగ్రహంగా ఉన్నట్లుగా ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. మూడు రాజధానులు గురించి అమరావతి విషయం కానీ ఇపుడు చెప్పాల్సిన అవసరం అయితే ఏదీ లేదు కదా అన్నది పార్టీలో భావనగా ఉంది అని అంటున్నారు. ఇంకా ఎన్నికలకు మూడున్నరేళ్ళకు పైగా ఉంది. అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడవచ్చు కదా కానీ ఆ చాన్స్ లేకుండా సజ్జల ఇచ్చిన వైసీపీకి బిగ్ ట్రబుల్స్ తో పడేశారు అని అంటున్నారు. దాంతో సజ్జలని పక్కన పెడుతున్నారా అన్న ప్రచారం కూడా సాగుతోందిట. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో.