డీఎంకేకి రోజా ప్రచారం...వైసీపీ సైలెంట్ !
దేశ రాజకీయాల్లో వైసీపీ ఒంటరిగానే పయనిస్తోంది. ఆ మాటకు వస్తే ఏపీ రాజకీయాల్లో వైసీపీ తన దోవ తాను అన్నట్లుగా ఉంటుంది.
By: Satya P | 12 April 2026 12:49 AM ISTదేశ రాజకీయాల్లో వైసీపీ ఒంటరిగానే పయనిస్తోంది. ఆ మాటకు వస్తే ఏపీ రాజకీయాల్లో వైసీపీ తన దోవ తాను అన్నట్లుగా ఉంటుంది. ఏ ఇతర రాజకీయ పక్షంతో కలిసి పనిచేయాలన్న ఆసక్తి ఆ పార్టీకి లేదు. తాము సోలో అని ఒంటరిగానే తమ పోరు అని వైసీపీ గొప్పగా చెప్పుకుంటూ వస్తోంది. ప్రత్యర్ధులు అయితే వైసీపీని ఎవరు చేరదీస్తారు, ఆ పార్టీని అందరూ దూరం పెడతారని విమర్శిస్తారు. ఏది ఏమైనా వైసీపీ న్యూట్రల్ అనుకుంటూ వస్తున్నా కీలక విషయాంల్లో కేంద్రంలోని ఎన్డీయే కి మద్దతు ఇస్తూ వస్తోంది. అది ఉప రాష్ట్రపతి ఎన్నికలు అయినా ముఖ్యమైన బిల్లులు అయినా వైసీపీ అనుకూలంగానే ఓటేస్తూ వస్తోంది. అదే సమయంలో ఇండియా కూటమికి దూరం పాటిస్తోంది అని గుర్తు చేస్తున్నారు.
తమిళ సీమలో రోజా :
ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చురుకైన పాత్రని పోషించేందుకు సిద్ధం అయ్యారు. ఆమె అధికార డీఎంకేకి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. ఆమె డీఎంకే అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేయడం అన్నది ఇపుడు ఆసక్తిని పెంచుతోంది. అంతే కాదు దీని మీద చర్చ సాగుతోంది. రోజా చెన్నై బేస్డ్ గానే చాలా కాలంగా ఉంటున్నారు అని అంటున్నారు. వైసీపీ ఎన్నికల్లో ఓటమి చెందగానే ఆమె ఏపీలో తన రాజకీయ వ్యాపకాలను తగ్గించేశారు అని గుర్తు చేస్తున్నారు. ఒక దశలో ఆమె డీఎంకేలో చేరుతారు అని తన కొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ ని అక్కడ నుంచి మొదలెడతారు అని ప్రచారం కూడా సాగింది.
వైసీపీ ఓకేనా :
ఇదిలా రోజా వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్నా పార్టీ పరంగా వైసీపీకి ఈ విషయంలో ఇబ్బందులు వస్తాయా లేదా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇండియా కూటమిలో డీఎంకే కీలకం. ఇక ఎన్డీయేకు పక్కా వ్యతిరేకం. అలాంటిది తమిళనాడులో వైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటే అది రాజకీయ పరంగా చూస్తే వైసీపీకి ఇరకాటమేనా అన్న డిస్కషన్ సాగుతోంది. మరి రోజా ప్రచారానికి వైసీపీ అనుమతి ఉందా ఆమె సొంతంగానే ఈ విధంగా చేస్తున్నారా అన్న చర్చ వస్తోంది. అయితే డీఎంకే స్టాలిన్ విషయంలో వైసీపీ అధినేత కూడా సానుకూలంగా ఉంటారు అని అంటున్నారు. జగన్ సీఎం గా ప్రమాణం చేసినపుడు స్టాలిన్ ప్రత్యేక అతిధిగా వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. దాంతో రోజా ప్రచారం వైసీపీ అనుమతితోనే జరుగుతోందా అన్నది కూడా ఆలోచన చేస్తున్నారు.
హెల్ప్ అవుతుందా :
రోజా తమిళ సినిమాల్లో కూడా నటించిన యస్టర్ డే హీరోయిన్. దాంతో పాటు ఆమె కీలకమైన రాజకీయ నాయకురాలిగా పొరుగు రాష్ట్రంలో ఉన్నారు. ఈ విధంగా తన ఇమేజ్ తో ఆమె ప్రచారానికి సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. అయితే ఆమె ప్రచారం వల్ల డీఎంకే అభ్యర్ధులు గెలిస్తే ఆమెది గోల్డెన్ లెగ్ అంటారని లేకపోతే ఐరన్ లెగ్ గా సోషల్ మీడియా నుంచి ట్రోల్స్ ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. తమిళనాడులో చూస్తే ఇప్పటికే భీకరమైన పోరు సాగుతోంది. డీఎంకే కూటమి వర్సెస్ ఎన్డీయే కూటమిగా రాజకీయం సాగుతోంది అని గుర్తు చేస్తున్నారు దీంతో రోజా ప్రచారం అయితే సర్వత్రా చర్చగా మారుతోంది.
