వైసీపీ దువ్వాడను బహిష్కరిస్తుందా ?
దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజుకీ వైసీపీ నేతగానే ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు సాంకేతికంగా ఆయన ఆ పార్టీకి చెందిన వారుగానే చలామణీలో ఉన్నారు.
By: Satya P | 28 Dec 2025 2:00 PM ISTదువ్వాడ శ్రీనివాస్ ఈ రోజుకీ వైసీపీ నేతగానే ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు సాంకేతికంగా ఆయన ఆ పార్టీకి చెందిన వారుగానే చలామణీలో ఉన్నారు. ఇక చూస్తే శ్రీకాకుళం జిల్లా టీడీపీకి స్వతహాగానే కంచుకోట. 1983 నుంచి ఇప్పటికి పదిసార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే టీడీపీయే అత్యధిక సార్లు గెలిచింది. 2019లో మాత్రమే టీడీపీ దెబ్బ తింది. వెంటనే తేరుకుంది కూడా. ఇదిలా ఉంటే వైసీపీకి జిల్లాలో పూర్వ వైభవం కోసం అధినాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు సంగతి పక్కన పెడితే వర్గ పోరు తీవ్రంగా ఉంది. పార్టీ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ మెతక వైఖరితో ఉంటారని అధికార పక్షం మీద ధాటీగా విమర్శలు చేయరని అంటారు. అదే విషయం ఒకటికి పదిసార్లు చెబుతూ దువ్వాడ శ్రీనివాస్ కూడా కేడీ బ్రదర్స్ అని హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
కింజరాపు ధర్మాన :
కే అంటే కింజరాపు డీ అంటే ధర్మాన అని దువ్వాడ కేడీ బ్రదర్స్ కి నిర్వచనం చెబుతున్నారు. అంటే పార్టీలు వేరు అయినా ఈ కుటుంబాలే రాజకీయంగా సహకరించుంటున్నాయని ఫలితంగా వైసీపీ వీక్ అవుతోంది అని ఆయన అంటున్నారు. మరో వైపు కాళింగ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు అని ఆ సామాజిక వర్గం నేతగా గట్టిగా మాట్లాడుతున్నారు. దువ్వాడ తనదైన దూకుడు రాజకీయం చేస్తూ అటు ధర్మాన సోదరులను ఇటు వైసీపీని కూడా ఇరకాటంలో పెడుతున్నారు.
నా చావుకు వారే కారణం :
ఇదిలా ఉంటే తన చావుకు కుట్ర చేస్తున్నారు అని ఆయన తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. తన చావుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ కారణం అవుతారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. ఆయన ఇదే విషయం మీద శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనకు గన్ మెన్లను కూడా రక్షణకు ఇవ్వాలని కోరారు.
సవాల్ చేసిన దువ్వాడ :
ఇక దువ్వాడ శ్రీనివాస్ సవాల్ చేస్తున్నారు. తనను వైసీపీ నుంచి సస్పెండ్ మాత్రమే చేశారని బహిష్కరించలేదని చెబుతున్నారు సత్తా ఉంటే బహిష్కరించి చూడాలని కూడా ఆయన ధర్మాన సోదరులకు సవాల్ చేశారు. తాను అపుడు మరింతగా స్వతంత్రుడిని అవుతాను అని ఆ మీదట జిల్లా రాజకీయాలలో తానేంటో చూపిస్తాను అని ఆయన అంటున్నారు. ఇక దువ్వాడ అయితే ధర్మాన బ్రదర్స్ ని ఎక్కడా వదలడం లేదు, సోషల్ మీడియాలో వారి మీద విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతునారు. దాంతో ఇపుడు మాజీ మంత్రుల మీద ఫిర్యాదు దాకా వచ్చారు.
పార్టీని పూర్తిగా ముంచుతోంది :
ఈ పరిణామాలు జిల్లా వైసీపీలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. అసలే పార్టీ ఇబ్బందులో ఉంది. ఒక్క సీటు కూడా గెలుచుకోని చోట ఏదో విధంగా పూర్వ వైభవం సాధించాలని ఆలోచిస్తూంటే దువ్వాడ పార్టీలో ఉన్నా లేకపోయినా ఫ్యాన్ పార్టీకి గట్టిగానే తగులుకుంటున్నారు అని అంటున్నారు. మరి ఆయన మీద బహిష్కరణ వేటు పడుతుందా అన్నదే ఇపుడు చర్చ. ఒకవేళ అలా చేసినా ఆయన వైసీపీని ఈ మాజీ మంత్రులను టార్గెట్ చేసుకోవడం అయితే ఆగదని అంటున్నారు. మొత్తానికి వైసీపీకి జిల్లాలో దువ్వాడ వర్సెస్ ధర్మాన బ్రదర్స్ వివాదం పార్టీని పూర్తిగా ముంచుతోంది అన్న చర్చ అయితే సాగుతోంది.
