Begin typing your search above and press return to search.

జగన్ హైరిస్క్ చేయబోతున్నారా...వారి పరిస్థితి ఏంటి ?

వైసీపీ అధినేత జగన్ విషయం చూసుకుంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దాదాపుగా దానికే కట్టుబడి ముందుకు సాగుతారు.

By:  Satya P   |   22 Sept 2025 9:57 AM IST
జగన్ హైరిస్క్ చేయబోతున్నారా...వారి పరిస్థితి ఏంటి ?
X

వైసీపీ అధినేత జగన్ విషయం చూసుకుంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దాదాపుగా దానికే కట్టుబడి ముందుకు సాగుతారు. వెనక్కి వెళ్లే సమస్య ఉండదు. ఇపుడు అలాంటిదే ఒకటి జరిగింది. అదే అసెంబ్లీకి ఆయన హాజరు కాకపోవడం. ఇది ఆయన స్వయంగా తీసుకున్న నిర్ణయమా లేక సలహాదారులు ఇచ్చిన సూచన అన్నది తెలియదు కానీ అదే ఇపుడు వైసీపీ మొత్తం రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నించేలా ఉందని అంటున్నారు. నిజానికి వైసీపీ 11 సీట్లకు పరిమితం అయిన వేళ అసెంబ్లీకి దూరంగా ఉండాలని ఎవరూ అనుకోని ఉండరనే చెబుతున్నారు. జగన్ కే కనుక ఆ ఉద్దేశ్యం ఉండి ఉంటే అందరితో కలసి సభకు వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి ఉండరని అంటున్నారు.

మూకుమ్మడి సవాల్ :

వైసీపీ అధినేత జగన్ మీద అసెంబ్లీకి హాజరు కావడం లేదు అన్న విషయంతో ప్రెషర్ ఎక్కువగా పడుతోంది. ఈ విషయం మీద హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసినా శాసన వ్యవస్థలో న్యాయస్థానాలు పెద్దగా జోక్యం చేసుకోవు. దాంతో కోర్టులో విషయం ఉందని చెప్పినా పెద్దగా ఉపయోగం ఉండదు, మరో వైపు చూస్తే అనర్హత వేటు వేయడానికి అసెంబ్లీ రూల్స్ ప్రకారం వీలు ఉంటే కనుక వైసీపీకి అది మరింత ఇబ్బందిగా ఉంటుంది అని అంటున్నారు. దాంతో ఆ నిర్ణయం కంటే తామే రాజీనామాలు చేసి బయటకు వస్తే ఎలా ఉంటుంది అన్నదే ఆ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు.

ఉప ఎన్నికలు వస్తే :

అనుకోని విధంగా ఉప ఎన్నికలు వచ్చి పడితే మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలకు అది చాలా ఇబ్బంది అని అంటున్నారు. ఎందుకంటే గత పదిహేను నెలలుగా వారు ప్రజలలో పెద్దగా లేరు. అలాగని అసెంబ్లీలో వారి గొంతు వినిపించడం లేదు. మరో వైపు తమ సమస్యలు ప్రస్తావించని తమకు కనబడని ఎమ్మెల్యేల తీరు మీద ఆయా నియోజకవర్గం ప్రజలలో కూడా గుస్సా ఉందని అంటున్నారు. చాలా నియోజకవర్గాలలో అయితే ఎమ్మెల్యేలు ఎవరో కూడా జనాలు మరచిపోతున్నారని సెటైర్లు పడుతున్నాయి. ఇపుడు రాజీనామాలు చేసి కోరి ఎన్నికలు తెచ్చి జనం లోకి వెళ్తే వారి మద్దతు ఏ విధంగా దక్కుతుంది అన్నదే చర్చగా ఉంది.

బలంగా కూటమి :

మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమి బలంగా ఉంది. మూడు పార్టీల మధ్య సఖ్యత ఉంది. అంతా కలసి ఉప ఎన్నికలను చాలెంజ్ గా తీసుకుంటే కనుక వైసీపీకి కత్తి మీద సాము అవుతుంది అని అంటున్నారు. పైగా చేతిలో అధికారం ఉంది. అది కూడా అడ్వాంటేజ్ గా కూటమికి ఎటూ ఉంటుంది. ఇంకో వైపు చూస్తే మరో మూడున్నర నెలల పాటు అధికారం కూటమికి ఉన్న వేళ ప్రజలు కూడా సహజంగానే అధికార పక్షం వైపే మొగ్గు చూపిస్తారు అని అంటున్నారు.

ఎంత మంది గెలుస్తారో :

మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే జగన్ పులివెందులలో తప్పించి మిగిలిన చోట్ల అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది అని అంటున్నారు. ఆఖరుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గాలలో సైతం కూటమి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి మరీ చేయాల్సినది అంతా చేస్తుంది అని అంటున్నారు. మరి కొన్ని చోట్ల కొత్త వారు గెలిచారు. వారికి ఈసారి ఉప ఎన్నికలు వస్తే కష్టమే అని అంటున్నారు. అయితే వైసీపీ ధీమా మాత్రం అలా జరగదని కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బాగా ఉందని అదే తమను గెలిపిస్తుందని భావిస్తున్నారు. చూడాలి మరి హై రిస్క్ తీసుకుని కనుక ఉప ఎన్నికలకు వైసీపీ తెర తీస్తే జగన్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.