Begin typing your search above and press return to search.

చిన్న శ్రీను వియ్యంకుడికి జగన్ ఝలక్ !

ఈ క్రమంలో విజయనగరం జిల్లా అధ్యక్ష పదవిని బొత్స బంధువు, విజయనగరం లోక్ సభ మాజీ ఎంపీ అయిన బెల్లాన చంద్రశేఖర్ ని నియమించారు. అదే సమయంలో చిన్న శ్రీను వియ్యంకుడు అయిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు షాక్ ఇచ్చారు.

By:  Satya P   |   13 Sept 2026 9:30 AM IST
చిన్న శ్రీను వియ్యంకుడికి జగన్ ఝలక్ !
X

విజయనగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ చైర్మన్ అయిన చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన నేపథ్యంలో వేగంగానే వైసీపీ రియాక్ట్ అయింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత ఇలాకా కాబట్టి రిపేర్లు చకచకా మొదలైపోయాయి. వరసబెట్టి మీటింగ్స్ ని కూడా నిర్వహించారు. ఇక విజయనగరం జిల్లా స్థాయి మీటింగ్ నిర్వహించి ఎవరూ చిన్న శ్రీను వెంట వెళ్ళకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లా అధ్యక్ష పదవిని బొత్స బంధువు, విజయనగరం లోక్ సభ మాజీ ఎంపీ అయిన బెల్లాన చంద్రశేఖర్ ని నియమించారు. అదే సమయంలో చిన్న శ్రీను వియ్యంకుడు అయిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు షాక్ ఇచ్చారు.

నెల్లిమర్లకు కొత్త ఇంచార్జి :

నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 2019లో ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున గెలిచి 2024లో మరోసారి టికెట్ పొంది ఓటమి పాలు అయి ప్రస్తుతం అక్కడ ఇంచార్జిగా కొనసాగుతున్న బడుకొండ అప్పలనాయుడుని ఆ పదవి నుంచి వైసీపీ తొలగించింది. ఆయన ప్లేస్ లో గదల సన్యాసినాయుడుని కొత్త ఇంచార్జిగా నియమించింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత వైసీపీ అధినాయకత్వం ఈ మేరకు ఉత్తర్వులు జార్తీ చేసింది. దీంతో చిన్న శ్రీనుతో పాటు వెళ్లకుండా వైసీపీలోనే ఉన్న బడుకొండకు ఈ పరిణామం షాక్ గా మారింది అని అంటున్నారు. విశేషం ఏమిటి అంటే ఆయన విజయనగరం జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. తాను వైసీపీలోనే కొనసాగుతాను అని కూడా చెప్పారు. అయినా సరే ఆయన పదవి మీద వేటు పడింది.

మరింత మందిపైనా :

రానున్న రోజులలో మరింతమంది చిన్న శ్రీను వర్గంగా చెప్పుకునే వారి మీద వేటు పడుతుందని అంటున్నారు. ఇప్పటికే వారిని గుర్తించడం జరిగింది అని అంటున్నారు. వైసీపీలో ఉంటూ అవతల పక్షానికి మేలు చేసే వారు అవసరం లేదని అంటున్నారు. ఇంకో వైపు చిన్న శ్రీను విషయం మీద గత ఎనిమిది నెలలుగా తనకు అనుమానాలు ఉన్నాయని బొత్స చెప్పినట్లుగా ఉంది. దాంతో ఆయన వెంట ఎవరు ఉన్నారు అన్నది ఈపాటికే వైసీపీకి పూర్తి అవగాహన ఉంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలో ఉన్న వారి మీద వేటు వేయడం కానీ పక్కన పెట్టడం కానీ వ్యూహాత్మకంగా సరైన చర్యేనా అన్నది కూడా పార్టీలో చర్చ సాగుతోంది.

వెళ్ళకుండానే వేటు :

వైసీపీలో ఉంటామని చెప్పిన వారి విషయంలో కొంత కాలం వేచి చూస్తే బాగుంటుంది అని కొందరు అంటూంటే తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అనుమానించే వారు కీలక స్థానాల్లో ఉంటే మేలు ఎలా జరుగుతుందన్న డౌట్లు వస్తాయని మరి కొందరు అంటున్నారు. మొత్తానికి చూస్తే పూర్తిగా బొత్స కనుసన్నలలోనే వైసీపీ జిల్లా పార్టీ సాగుతోంది. అదే సమయంలో పార్టీని నష్టపరచాలని ఎవరు చూసినా కఠిన చర్యలు తప్పవన్న సందేశాన్ని అయితే పార్టీ హైకమాండ్ ఇవ్వదలచుకుంది అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఒక వైపు స్థానిక ఎన్నికల వేడికి ఇపుడు చిన్న శ్రీను వ్యవహారం కూడా తోడు కావడంతో ఉత్తరాంధ్రాలో రాజకీయం మంచి హీట్ మీద ఉంది. ఈ పరిణామాల మీద రెండు శిబిరాలలోనూ చర్చ సాగుతోంది.