రాయలసీమ గాలి మారుతోంది.. తాజా సర్వేలో చాలా మార్పు
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితిపై చేసిన సర్వేలో వైసీపీకి ఊరట కలిగే విషయం వెలుగుచూసినట్లు ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 27 Sept 2025 11:00 PM ISTఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో కుదేలైన వైసీపీ ప్రస్తుతం ఎలా ఉంది? ప్రజల్లో ఏమైనా సానుకూలత పెంచుకుందా? వైసీపీ పట్ల ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం ఏమైనా మార్పు వచ్చిందా? అనేది ఉత్కంఠ రేపుతోంది. దీనిపై ఎప్పటికప్పుడు జరుగుతున్న సర్వేల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. కూటమి ప్రభుత్వం 16 నెలల పాలన, అమలు చేస్తున్న హామీలు, అమలు చేయాల్సిన పథకాలు, విపక్షం పట్ల వ్యవహరిస్తున్న తీరు వల్ల రాజకీయంగా చాలా మార్పులు జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై వైసీపీ నిర్వహించిన సర్వేలో ఆ పార్టీ ఫెర్ఫార్మెన్స్ పట్ల ఆసక్తికర అంశం వెలుగుచూసినట్లు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితిపై చేసిన సర్వేలో వైసీపీకి ఊరట కలిగే విషయం వెలుగుచూసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా రాయలసీమలో పార్టీ బాగా పుంజుకున్నట్లు సర్వే ఫలితం వెల్లడించినట్లు చెబుతున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో ఇటీవల జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ దక్కలేదు. దీంతో వైసీపీ రోజురోజుకు బలహీనపడుతుందా? అన్న అనుమానం వ్యక్తమైంది. అయితే తాజా సర్వేలో ఆ పరిస్థితి ఎక్కడా లేదని పార్టీ వర్గాలు నివేదిస్తున్నాయి. రాయలసీమ మొత్తానికి ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా మిగిలిన మూడు ఉమ్మడి జిల్లాల్లో పార్టీ పుంజుకున్నట్లు సర్వేలో వెల్లడైందని అంటున్నారు.
తాజా సర్వేలో సానుకూల ఫలితం రావడంపై వైసీపీ నేతలు ఆనందంగా కనిపిస్తున్నారు. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో మునుపటి స్థితికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ మళ్లీ 50 శాతం ఓటు షేరు సాధించే అవకాశాలు ఉన్నాయనే సర్వేలో వెల్లడైందని చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా టీడీపీ కూటమితో నువ్వా-నేనా అన్నట్లు తలపడే అవకాశం ఉందని సర్వేలో తేలిందని చెబుతున్నారు.
ఈ సర్వే ఫలితాలతో వైసీపీలో జోష్ వచ్చిందని అంటున్నారు. పార్టీకి రాయలసీమ చాలా కీలకం. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30 సీట్లలో వైసీపీకి ఎప్పుడూ ఆధిపత్యం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు నమ్మకం పెట్టుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇతర ప్రాంతాల్లో మరో 60 సీట్లు వస్తే సరిపోతుందన్న వ్యూహంతో వైసీపీ పనిచేస్తుంటుందని అంటున్నారు. అయితే ఈ 60 సీట్లలో దాదాపు 36 ఎస్సీ, ఎస్టీ సీట్లు ఉండగా, ఇందులో కూడా 30 వరకు ఈజీగా గెలుస్తామని వైసీపీ నమ్మకం.
ఇక ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాధించే సీట్లతో అధికారం దక్కడం ఖాయమని వైసీపీ లెక్కలు వేస్తుంటుంది. అయితే గత ఎన్నికల్లో ఈ లెక్కలు తిరగబడటంతో కోలుకోని నష్టం జరిగింది. ఈ పరిస్థితుల్లో తాజా సర్వేలో రాయలసీమలో మళ్లీ పుంజుకున్నట్లు అందుతున్న సంకేతాలు ఆ పార్టీకి ఊపిరి పోశాయంటున్నారు.
