రప్పా.. రప్పా - గొడ్డలి బ్యాచ్: ఎంత పాపులర్ అంటే!
తాజాగా.. ఇప్పుడు మరో రూపంలో పార్టీపై మరకలు పడుతున్నాయి. ఇవి ప్రజల్లోకి జోరుగా వెళ్లాయి.
By: Garuda Media | 16 Sept 2025 8:24 AM ISTఏపీ ప్రతిపక్షం వైసీపీకి ఎప్పటికప్పుడు చిక్కులు వస్తూనే ఉన్నాయి. ఒకటి వదిలితే.. మరొకటి పట్టుకుని ఆ పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉంది. గత ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి హత్య కేసు ఇరకాటంలో పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున యాగీ జరిగిన విషయం తెలిసిందే. సొంత చెల్లే వివేకా హత్యపై రాష్ట్రమంతా పర్యటించి.. అన్న ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిందన్న చర్చ కూడా సాగింది. తాజాగా.. ఇప్పుడు మరో రూపంలో పార్టీపై మరకలు పడుతున్నాయి. ఇవి ప్రజల్లోకి జోరుగా వెళ్లాయి.
ప్రస్తుతం ప్రజల్లో ఏది ఎక్కువగా ప్రభావితం చూపుతుందో.. అదే రాజకీయంగా వాడుకునేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తాయన్న విషయం తెలిసిందే. ఇలానే.. తాజాగా రెండు కీలక విషయాలు వైసీపీ గురించి గ్రామీణ స్థాయిలోనూ చర్చించుకుంటున్నారు. ఆ విషయాలనే ప్రధాన ప్రత్యర్థులు తమకు అనుకూల ఆయుధాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కనుక ప్రజల మధ్య చేరితే.. నిరంతరం .. ఆ విషయాలే గుర్తుకు వస్తే.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి భయంకరంగా మారుతుందన్న చర్చ ఉంది.
ఇవీ రెండు కీలక విషయాలు..
1) రప్పా.. రప్పా: రప్పా.. రప్పా.. నరుకుతా.. అనేది పుష్ప - 2 డైలాగ్. కానీ, ఆ సినిమాలో ఈ డైలాగ్ ఎంత వరకు హిట్ కొట్టిందో చెప్పలేం కానీ.. వైసీపీ నాయకులు.. జగన్ గుంటూరు పర్యటన సమయంలో ఏర్పా టు చేసిన ఈ రప్పా.. రప్పా.. బ్యానర్ మాత్రం భారీ ఎత్తున పాపులర్ అయింది. దీంతో ఈ డైలాగ్.. గ్రామీణ స్థాయి వరకు నానుడిగా మారింది. ఎవరైనా వైసీపీ నాయకులు గతంలో ప్రజలను కలుసుకునేందుకు వెళ్తే.. స్థానికులు వారిని వైసీపీ నేతలు అనే వారు. లేకపోతే.. జగన్ పార్టీ వాళ్లు అని పిలిచేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గ్రామీణ స్థాయిలో వైసీపీ, జగన్ పార్టీల బదులు.. `రప్పా.. రప్పా.. పార్టీ` అనే పేరు అలవోకగా అనేస్తున్నారు.
2) గొడ్డలి బ్యాచ్: అదేవిధంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను కూడా గొడ్డలి బ్యాచ్ అనే మాట వినిపి స్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిస్తే.. వైసీపీ నేతలను గొడ్డలి బ్యాచ్ అనే సంబోధిస్తున్నారు. ఇదే ప్రజల్లోకి కూడా చేరింది. వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికారన్న వాదన ఉన్న నేపథ్యంలో ఆ గొడ్డలి పేరును కొందరు టీడీపీ నాయకులు ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు అదే నానుడి అయింది.. వైసీపీ గురించి చర్చిస్తే.. రప్పా రప్పా.. పార్టీ అని, నాయకుల గురించి చర్చిస్తే.. గొడ్డలి బ్యాచ్ అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపైనే ఇప్పుడు వైసీపీ అంతర్మథనం చెందుతోంది.
