వైసీపీ రాజ్యసభ ఎంపీ తీవ్ర అసంతృప్తి ?
వైసీపీకి మరో అయిదు నెలలలో ఉన్న ఏడు ఎంపీ సీట్లు కాస్తా నాలుగు అవుతాయి. నిజానికి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడాక ఆ పార్టీకి ఉన్నవి 11 ఎంపీ సీట్లు.
By: Satya P | 23 Jan 2026 8:58 AM ISTవైసీపీకి మరో అయిదు నెలలలో ఉన్న ఏడు ఎంపీ సీట్లు కాస్తా నాలుగు అవుతాయి. నిజానికి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడాక ఆ పార్టీకి ఉన్నవి 11 ఎంపీ సీట్లు. అంటే ఏపీ కోటా నుంచి మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీ పరం అయ్యాయి అన్న మాట. ఒక విధంగా ఇది రికార్డుగానే అంతా చూశారు. అయితే ఆ రికార్డు కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే చెదిరిపోయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాకా వరసగా మోపిదేవి వెంకట రమణ, అదే విధంగా బీద మస్తాన్ రావు తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత తెలంగాణాకు చెందిన బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య కూడా వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి అదే సీటును అందుకున్నారు. ఇక అనూహ్యంగా విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి దూరం అయ్యారు. దాంతో నంబర్ కాస్తా 7కి పడిపోయింది. జూన్ నాటికి అది 4 అవుతుంది అని అంటున్నారు.
ఆయనలో అసహనం :
ఇక ఈ నలుగురిలో కూడా నిరంజన్ రెడ్డి,2028 జూన్ 21న పదవీ విరమణ చేస్తారు. 2030 ఏప్రిల్ 1 దాకా పదవీ కాలం ఉన్న మెంబర్లు వైసీపీలో ముగ్గురు ఉన్నారు. వారిలో ఒకరు వైవీ సుబ్బారెడ్డి, రెండవ వారు గొల్ల బాబూరావు, మూడవ వారు మేడ రఘునాథ్ రెడ్డి. 2029 ఎన్నికల నాటికి ముగ్గురు ఎంపీలు అయినా రాజ్యసభలో వైసీపీకి ఉంటారు అనుకుంటే ఇందులో గొల్ల బాబూరావు తీవ్ర అసహనంతో ఉన్నారని అంటున్నారు.
గుర్తింపు లేదని అంటూ :
తనకు వైసీపీలో సరైన గుర్తింపు లేదని గొల్ల బాబూరావు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను అని తన విధేయతను చిత్తశుద్ధిని పరిగణనలోకి తీసుకోవడంలేదని ఆయన అంటున్నారని చెబుతున్నారు. పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలను తనకు అప్పగించడం లేదని ఆయన వాపోతున్నారుట. తాను ఎంపీగా అధికారిక ప్రోటోకాల్ ని అందుకుంటున్నానని పార్టీలో మాత్రం ఆ తరహా గౌరవ మర్యాదాలు లభించడం లేదని ఆయన మధనపడుతున్నారుట.
కుమారుడి కోసం :
ఇక తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. పాయకరావు పేట నుంచి తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారు. అయితే ఈ విషయంలో అధినాయకత్వం నుంచి పెద్దగా భోరోసా అయితే దక్కడం లేదని అంటున్నారు. ఈ విషయాల మీద నేరుగా అధినాయకత్వం తోనే ప్రస్తావించి మనసులో మాటను తెలుసుకోవాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. ఒక వేళ అక్కడ ఏమీ సానుకూల స్పందన రాకపోఎత మాత్రం ఆయన సీరియస్ డెసిషన్ వైపు వెళ్తారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. మరి గొల్ల బాబూరావు పార్టీని వీడుతారా లేక అధినాయకత్వం ఆయనకు సర్దిచెప్పి పార్టీ పరంగా పెద్ద పీట వేస్తుందా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.
