వైసీపీలో 'రాజాం' రగడ.. ఇంచార్జ్‌కి సెగ!
దీంతో ఇప్పుడు రాజేష్‌ను మార్చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అయితే.. ఏరికోరి అధినేత తెచ్చుకున్న నేత కావడంతో ఏం చేయాలో తెలియడం లేదట.
By: Garuda Media | 30 Jun 2026 7:00 PM ISTఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గం వైసీపీ తలనొప్పిగా మారిందా? నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న తలే రాజేష్‌తో పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమన్వయం కుదరడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజేష్ శైలిపై తరచుగా విమర్శలు రావడమే కాదు.. పార్టీకి కూడా నివేదికలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు రాజేష్‌ను మార్చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అయితే.. ఏరికోరి అధినేత తెచ్చుకున్న నేత కావడంతో ఏం చేయాలో తెలియడం లేదట.
ఏం జరుగుతోంది..?
రాజాం.. ఎస్సీ నియోజకవర్గం. గతంలో వైసీపీ విజయం దక్కించుకుంది.పైగా ఇది ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఆ ఓట్లన్నీ వైసీపీ తనవైపు మళ్లించుకుంది. దీంతో వైసీపీకి కంచుకోటగా మారిందన్న టాక్ కూడా ఉంది. కానీ, గత ఎన్నికల సమయంలో అప్పటి ఎమ్మెల్యే కంబాల జోగులును తప్పించి.. పాయక రావుపేటకు పంపించారు. ఇదేసమయంలో కొత్తగా ప్రయోగం చేస్తూ.. అప్పటి వరకు వైద్య వృత్తిలో ఉన్న తలే రాజేష్‌ను తీసుకువచ్చి టికెట్ ఇచ్చారు.
ఇది పార్టీని ఇబ్బందిలోకి నెట్టింది. వైసీపీ కేడర్‌కు రాజేష్ ముఖ పరిచయం కూడా లేకపోవడంతో వారంతా.. నామ మాత్రంగానే పనులు చేశారన్న వాదన ఉంది. ఇది కూటమి పార్టీలకు కలివిడిగా మారింది. దీంతో ఏమాత్రం అంచనాలు కూడా లేకుండానే.. కోండ్రు మురళి విజయం దక్కించుకున్నారు. పోనీ.. ఆ తర్వాతైనా.. వైసీపీలో మార్పు రావాలి కాదా!. కానీ, రాలేదు. రాజేష్ ఎక్కడా పుంజుకునేందుకు ప్రయత్నం చేయడం లేదు పైగా నాయకులకు, కార్యకర్తలు డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు.
ముఖ్యంగా పార్టీ కేడర్‌ను ఆయన దూరం పెట్టారని.. ఏ సమస్యపైనా స్పందించడం లేదని.. మొక్కుబడి కార్యక్రమాలతోనే సరిపుచ్చుతున్నారని నాయకులు అంటున్నారు. ఇది పార్టీలో విభేదాలకు కారణంగా మారింది. మరోవైపు కంబాల కూడా.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని చెప్పడం, కేడర్‌కు సన్నిహితంగా ఉండడం రాజేష్ సహించలేకపోతున్నారని సమాచారం. దీంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలు నామమాత్రంగానే మారిపోయాయి. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు పార్టీ నడుంబిగించాలని కోరుతున్నారు.
