Begin typing your search above and press return to search.

ఏపీలో క్యాపిట‌లిస్టుల ఎంట్రీ... ప్ర‌జ‌ల మూడ్ మారుస్తారా ..!

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.

By:  Garuda Media   |   16 Oct 2025 11:00 AM IST
ఏపీలో క్యాపిట‌లిస్టుల ఎంట్రీ... ప్ర‌జ‌ల మూడ్ మారుస్తారా ..!
X

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఆ తర్వాత తాజాగా వైసిపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన‌ నిరసనలు, ధర్నాలు రాస్తారోకోలు పాదయాత్రలు వంటి పరిణామాలు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన ర్యాలీలు ధర్నాలు జోరుగా సాగాయి. పిపిపి విధానంలో మెడికల్ కాలేజీ లను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగానికి అప్పగించేస్తోందని, దీని వల్ల పేదలకు మేలు జరగదని చెబుతున్నారు.

ఎంతో దూర దృష్టితో జగన్ చేసిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసి పుచ్చుతోందని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. ఈ పరిణామాల క్రమంలో అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటలిస్టుల‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. వీరు చాలా నిశితంగా ప్రైవేటు రంగానికి ఉన్న అవకాశాలను.. ప్రైవేటు రంగంతో పాటు ప్రభుత్వ రంగాన్ని కలిపి నడుపుతూ ప్రజలకు నష్టం లేని విధంగా జరిగే నిర్ణయాలు తీసుకునే వైపు తమ ఆలోచనలను పంచుకునే వారిగా గుర్తింపు పొందారు.

ఇలాంటి వారిలో కొంతమందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మధ్యకు పంపించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వీరిలో నల్లమోతు చక్రవర్తి సహా కొంతమంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరందరూ పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్షిప్ విషయంలో సుదీర్ఘ అనుభవం ఉన్నవారు. సుదీర్ఘంగా అధ్యయనం చేసిన వారు. దీంతో వీరు ద్వారా పిపిపి విధానం పై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. తద్వారా వైసిపి విధానాలను అడ్డుకోవాలని భావిస్తోంది.

నిజానికి ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలో ఐదు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 12 నిర్మాణంలో ఉన్నాయి. వీటిని పూర్తచేయాలనేది వైసిపి చేస్తున్న డిమాండ్. ఏడాదికి 5 వేల కోట్లు కేటాయిస్తే వీటి నిర్మాణం పూర్తవుతున్నది జగన్ చెబుతున్న మాట. కానీ రాష్ట్ర ప్రభుత్వం దూర దృష్టితో ఆలోచిస్తున్నామని చెబుతోంది. నిర్మాణం ప్రధానం కాదు నిర్వహణ చాలా ముఖ్యమని ప్రైవేట్ రంగానికి అప్పగిస్తే నిర్వహణ బాధ్యతలు బాగా చూస్తారని చెబుతోంది. తద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని చెబుతోంది.

పేదలకు ఇబ్బంది లేకుండా ఎలాగూ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నాం కాబట్టి వీటిని ప్రైవేట్ రంగానికి ఇవ్వడం తప్పు కాదు అన్నది ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలో ఈ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు క్యాపిటల్ లిస్టులను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మరి వీరు ఏ మేరకు ప్రజల మూడ్‌ మారుస్తారు వైసీపీకి ఏ మేరకు చెక్ పెడతారు అనేది చూడాలి.