Begin typing your search above and press return to search.

రాజెవరో మంత్రెవరో....వైసీపీలో హాట్ డిస్కషన్ !

వైసీపీలో ఎన్నికలలో ఓటమి తరువాత మార్పు ఏమైనా ఉందా అంటే పెద్దగా కనిపించడం లేదు అని అంటున్నారు. చూస్తుండగానే పదహారు నెలలు ఇట్టే గడచిపోయాయి.

By:  Satya P   |   13 Oct 2025 5:30 PM IST
రాజెవరో మంత్రెవరో....వైసీపీలో హాట్ డిస్కషన్ !
X

వైసీపీలో ఎన్నికలలో ఓటమి తరువాత మార్పు ఏమైనా ఉందా అంటే పెద్దగా కనిపించడం లేదు అని అంటున్నారు. చూస్తుండగానే పదహారు నెలలు ఇట్టే గడచిపోయాయి. అధికార కూటమి ప్రభుత్వం ఈ మధ్యలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రజలకు నచ్చినవి ఉన్నవి, లేక ఆలోచిస్తున్నవీ ఉన్నాయి. అయినా విపక్షంగా వైసీపీ మాత్రం తమకేమీ పట్టనట్లుగానే ఉంది అని అంటున్నారు. ఆ పార్టీలో అత్యధిక శాతం నేతలు అయితే మౌన ముద్రంలోనే ఉండిపోతున్నారు. పార్టీ తరఫున అనేక పదవులు ఇచ్చినా కూడా చడీ చప్పుడు చేయడం లేదు, భారీ మెజారిటీతో కూటమి గెలిచింది. చూస్తే ఇంకా మూడున్నరేళ్ళకు పైగా అధికారం కూటమి చేతిలో ఉంది, ఏమి అంటే ఏ ఏమి వస్తుందో అన్న ముందు జాగ్రత్త కలిగిన నేతలే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.

ఇంచార్జిలు ఎలా :

వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది. అయితే వారి వీక్ గా ఉన్నారా లేక బలవంతులా అన్నది అయితే ఆలోచించలేదు. పార్టీ కార్యక్రమాలు సాగాలి అంటే నాయకులు ఉండాలి కదా అన్న తీరులోనే నియమించింది అదే సమయంలో ఎన్నికల ముందు చేసి ప్రయోగాలకు స్వస్తి చెప్పింది. ఏ జిల్లాకు చెందిన వారిని అక్కడే ఉంచింది. అలాగే సొంత నియోజకవర్గానికి చెందిన నాయకులను అక్కడే ఇంచార్జిలను చేసింది. ఒక విధంగా వారికి వెసులుబాటు ఇచ్చినట్లే అని అంటున్నారు.

పార్టీలోనే వ్యతిరేకత :

అయితే వైసీపీ ఇంచార్జిల పెర్ఫార్మెన్స్ విషయంలో అధినాయకత్వం వద్ద నివేదికలు కూడా ఉన్నాయని అంటున్నారు. వారి పనితీరున్ ఎప్పటికపుడు బేరీజు వేసుకుంటూ అధినాయకత్వం వారికి హెచ్చరిస్తూ వస్తోంది అని చెబుతున్నారు. అదే సమయంలో అనేక నియోజకవర్గాలలో ఇంచార్జిల నియామకం మీద క్యాడర్ లో అయితే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. ఎందుకంటే వీరే గతంలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించారు. అధికారంలో ఉన్నపుడు ఎవరికీ పెద్దగా కనిపించకుండా ఎవరికీ ఏ రకమైన సాయం చేయకుండా తన కోటరీకి మాత్రమే మేలు చేసి తమ వారితోనే అంతా అన్నట్లుగా వ్యవహరించారు అన్న బాధ అయితే క్యాడర్ లో ఉంది. దాంతో వారిని మార్చాలని కోరుతున్న విన్నపాలూ హై కమాండ్ వద్ద ఉన్నాయట.

అసలుకే ఎసరుగా :

అయితే ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది, ఇప్పటి నుంచే వేలు పెట్టి రిపేర్లు మొదలెడితే ఉన్న వారిని మార్చేస్తే లేని పోని తలకాయ నొప్పులు వస్తాయని అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు ఎమ్మెల్యే స్థాయి నాయకులు కావడం జనంలో అంతో ఇంతో పలుకుబడి ఉన్న వారు కావడం యావత్తు నియోజకవర్గానికి తెలిసిన వారు కావడంతో పాత వారిని మార్చేసి సడెన్ గా కొత్త వారిని తెస్తే కనుక అది అసలుకే ఎసరు తెస్తుంది అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు ఇది కూటమిని మంచి చాన్స్ ఇచ్చినట్లుగా ఉంటుందని కూడా ఆలోచిస్తోంది అని అంటున్నారు. అందుకే ఎవరినీ కదపకుండా దిశా నిర్దేశం మాత్రమే చేస్తూ వస్తోంది అని అంటున్నారు.

గ్యారంటీ ఉందా :

ఇక వైసీపీ అధినాయకత్వం వైపు చూస్తే 2029 ఎన్నికలు చాలా కీలకమైనవిగా ఉన్నాయి. ఈసారి ఆరు నూరు అయినా గెలవాల్సిందే. లేకపోతే పార్టీ ఇబ్బందులో పడిపోతుంది. అందుకే గెలుపు గుర్రాలకే అవకాశాలు ఇస్తారని అంటున్నారు. అంటే టికెట్లు ఈసారి ఆషామాషీగా ఇచ్చే సీన్ అయితే ఉండదని అంటున్నారు దాంతో పాటు పార్టీ గతంలో చేసిన ప్రయోగాలు అసలు చేయదని ఎవరి మీద సాఫ్ట్ కార్నర్ అంతకంటే ఉండదని అంటున్నారు. కేవలం గెలుపు అన్నది చూసి మాత్రమ టికెట్లు ఇస్తారని అంటున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని అంటున్నారు. అప్పటికి జనం దృష్టిలో ఎవరు బాగా ఉంటున్నారు ఎవరు బాగా పనిచేస్తున్నారు గెలుపు చాన్స్ ఎంతవరకూ ఉంది అన్నది చూసుకుని మరీ టికెట్లు ఇస్తారని అంటున్నారు. ఈ విషయంలో జగన్ ఎవరికీ స్పేర్ చేయరని కూడా ప్రచారం సాగుతోంది. దాంతో వైసీపీలోనూ దీని మీద చర్చ సాగుతోంది రాజెవరో మంత్రెవరో తెలియని వేళ ఇప్పటి నుంచి ఎందుకు చమటోడ్చడం అన్నది కూడా ఉందని అంటున్నారు. సో అదన్న మాట ఫ్యాన్ పార్టీలో లోపాయికారీ రాజకీయం అని అంటున్నారు.