Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా టార్గెట్...విశాఖలో కాపు సభ !

వైసీపీ దూకుడు పెంచింది. రాజకీయంగా తనకు ఉన్న అస్త్ర శస్త్రలను బయటకు తీస్తోంది. ఒక వైపు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తోంది. మరో వైపు ప్రజా సమస్యల మీద ఆందోళనలు చేస్తోంది.

By:  Satya P   |   7 July 2026 8:51 AM IST
ఉత్తరాంధ్రా టార్గెట్...విశాఖలో కాపు సభ !
X

వైసీపీ దూకుడు పెంచింది. రాజకీయంగా తనకు ఉన్న అస్త్ర శస్త్రలను బయటకు తీస్తోంది. ఒక వైపు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తోంది. మరో వైపు ప్రజా సమస్యల మీద ఆందోళనలు చేస్తోంది. అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని సొమ్ము చేసుకోవడానికి చూస్తోంది. అలా కూటమి మీద వ్యతిరేకత పెంచడానికి చూస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో నుంచి వెనక్కి తెచ్చి ప్రైవేట్ చేస్తారు అన్న దాని మీద వైసీపీ నేతలు ఉద్యమిస్తున్నారు. అలాగే ఆక్వా రైతుల సమస్యల మీద స్వయంగా జగన్ రంగంలోకి దిగుతున్నారు. వీటితో పాటు సామాజిక అంశాల మీద కూడా వైసీపీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుసగా వివిధ సామాజిక వర్గాల సమావేశాలను నిర్వహిస్తోంది. తాజాగా బీసీ నేతల సమావేశం వైసీపీ నేతల ఆధ్వర్యంలో జరిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ మంత్రి జోగి రమేష్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

బీసీ డిప్యూటీ సీఎం అంటూ :

తమ పార్టీ అధికారంలో ఉన్నపుడు బీసీలకు ఉప ముఖ్యమంతి పదవి ఇచ్చి గౌరవించామని ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో బీసీ ఉప ముఖ్యమంత్రి ఏరీ అని మాజీ ఎంపీ భరత్ ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్యలో బీసీ నేత అయిన కేఈ క్రిష్ణమూర్తిని ఉప ముఖ్యమంత్రిగా చేసిన టీడీపీ ఈ పర్యాయం ఎందుకు బీసీలను చేయలేదని నిలదీశారు. ఒక విధంగా టీడీపీని ఇరకాటంలో పెట్టడానికే ఈ రకమైన విమర్శలు ఆయన చేశారు అనుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఏకైక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాంతో బీసీల నుంచి ఈ డిమాండ్ తీసుకుని రావాలన్నదే వైసీపీ ఎత్తుగడగా కనిపిస్తోంది అని అంటున్నారు.

కాపులతో మీటింగ్ :

ఇక ఈ మధ్యనే గోదావరి జిల్లాలలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నివాసంలో వైసీపీ కాపు నేతల సమావేశం జరిగింది. దీనిని ఆత్మీయ సమావేశం అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా కాపుల సమస్యల గురించి చర్చించామని నేతలు చెప్పారు. అయితే ఈ సమావేశం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఏపీ రాజకీయాల్లో కాస్తా వేడిని రగిలించింది. ఈ సమావేశం కేవలం కాపుల అభ్యున్నతి కోసమే అని వైసీపీ నేతలు చెప్పినా జనసేన వర్సెస్ వైసీపీగా కొన్ని రోజుల పాటు వాడి వేడిగా చర్చ సాగింది. ఇక ఇపుడు ఇదే వరసలో రెండవ మీటింగ్ కాపుల ఆత్మీయ వేదిక నుంచి జరగబోతోంది. ఈసారి విశాఖను ఎంచుకున్నారు.

రాష్ట్ర నాయకులు అంతా :

విశాఖ వేదికగా జరిగే వైసీపీ కాపు నేతల సమావేశానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి వస్తారని చెబుతున్నారు. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున ఈ మీటింగ్ జరుగుతుందని అంటున్నారు. బీసీలలో దిగ్గజ నేతగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రాలో ఉన్నారు. ఆయన సారథ్యంలో ఈసారి మీటింగ్ జరుగుతుందని అంటున్నారు. మొదటి మీటింగులో కాపులకు ఏపీలో జరుగుతున్న అన్యాయం మీద చర్చించామని చెబుతున్న కాపు నేతలు ఈ మీటింగులో ఏమి చర్చిస్తారు అన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది. అదే సమయంలో ఉత్తరాంధ్రలో వైసీపీ 2024 ఎన్నికల్లో ఒక్క సీటుని కూడా గెలుచుకోలేదు, ఏజెన్సీలో రెండు అసెంబ్లీ సీట్లు ఎంపీ సీటు తప్పించి వైసీపీకి దక్కింది కూడా ఏమీ లేదు, దాంతో తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో వైసీపీ ఒక వ్యూహం ప్రకారమే ఈ మీటింగ్ నిర్వహిస్తోంది అని అంటున్నారు. ఈ మీటింగ్ సారాంశం ఏమిటి, యాక్షన్ ప్లాన్ ఏమిటి అన్నది కూడా తొందరలో తెలుస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.