ఢిల్లీలో వైసీపీ సైలెంట్ అవుతోందా ?
వైసీపీకి అసెంబ్లీ ఎన్నికలలో ఎలా ఉన్నా పార్లమెంట్ లో ఎంపీలు మాత్రం ఎపుడూ సంతృప్తి స్థాయిలో ఉంటున్నారు.
By: Satya P | 28 Aug 2025 1:00 AM ISTవైసీపీకి అసెంబ్లీ ఎన్నికలలో ఎలా ఉన్నా పార్లమెంట్ లో ఎంపీలు మాత్రం ఎపుడూ సంతృప్తి స్థాయిలో ఉంటున్నారు. పూర్తిగా జనాలు దూరం పెట్టడం లేదు. 2014 నుంచి వరసగా మూడు సార్వత్రిక ఎన్నికలను వైసీపీ ఫేస్ చేసింది. 2014లో చూస్తే ఏపీ తెలంగాణా కలిపి జరిగాయి. అలా ఏపీలో ఎనిమిది, తెలంగాణాలో ఒక్కటి ఎంపీ సీటుతో టోటల్ తొమ్మిది నంబర్ తో ఒక మంచి సంఖ్యతోనే ఆనాడు ఎంపీలను గెలుచుకుంది. ఆ టెరంలోనే ఇద్దరు ఎంపీలు రాజ్యసభకు వెళ్లారు ఇక అయిదేళ్ళు తిరిగేసరికి కొందరు ఎంపీలు జారిపోయినా వైసీపీ గుర్తించతగిన నంబర్ తోనే 2019 ఎన్నికల దాకా కొనసాగింది.
కీలక నేతలు ఎంపీలుగా :
ఇక 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ ప్రత్యేక హోదా అంటూ ఢిల్లీ స్థాయిలో పోరాటాలు కూడా చేసింది. ఇదే ఇష్యూ మీద వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అమరణ దీక్షలు కూడా ఢిల్లీలో చేశారు. ఆనాడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారు వైసీపీకి ఢిల్లీ వేదికగా సారధ్యం వహించారు. దాంతో జాతీయ స్థాయిలో వైసీపీ మాట గట్టిగానే వినిపించేది. లోక్ సభ రాజ్యసభలలో వైసీపీ వాణి బలంగా ఉండేది. ఒక విధంగా 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఢిల్లీ వ్యూహాలు బాగా పనికి వచ్చాయి అన్న విశ్లేషణలు ఉన్నాయి.
పవర్ లోకి వచ్చాకనే :
ఇక 2019లో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లు 22 ఎంపీ సీట్లను గెలుచుకుంది ల్యాండ్ స్లైడ్ విక్టరీని నమోదు చేసింది. అయితే పవర్ లోకి వచ్చాక ఈ అయిదేళ్ళలో ఢిల్లీ స్థాయిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. గెలిచిన తొలి ఏడాదిలోనే ట్రిపుల్ ఆర్ గా పేరు తెచ్చుకున్న రఘురామ వైసీపీకి దూరం జరిగారు. ఇక ఈ మధ్యలోనే వైసీపీ అధినాయకత్వానికి ఎంపీలకు మధ్య కొంత గ్యాప్ అయితే ఏర్పడింది అని అంటారు. ఏపీలో అధికారంలో ఉంటూ అటు లోక్ సభలో 22 మంది రాజ్యసభంలో మొత్తం ఎంపీలు కలిగి దేశంలో నాలుగవ అతి పెద్ద పార్టీగా వెలిగిన వైసీపీ ఆ దిశగా తన హవాను అయితే జాతీయ రాజకీయాల్లో చూపించలేకపోయింది అని అంటారు.
ఓడిన తరువాత మారిన సీన్ :
మరో వైపు చూస్తే వైసీపీ 2024 లో ఘోరంగా ఓటమి పాలు అయింది. అదే సమయంలో విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండేవారిని మార్చేసి వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన కొంత అసంతృప్తి చెందారని చెబుతారు. అది కాస్తా 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత మరింతగా బయటపడి ఆయన 2025 జనవరిలో తన ఎంపీ పదవికి రాజకీయాలకు గుడ్ బై చెప్పేదాకా వెళ్ళింది. ఇక వైసీపీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి ఉన్నా ఆయన వైసీపీ వాయిస్ ని పెద్దగా వినిపించడం లేదని విమర్శలు ఉన్నాయని అంటున్నారు.
ఆయన అరెస్టు తోనే :
ఇక లోక్ సభలో వైసీపీ తరఫున నాయకుడిగా ఉన్న మిధున్ రెడ్డి లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతో లోక్ సభలో కూడా పెద్దగా హడావుడి అయితే లేకుండా పోయింది అంటున్నారు. దీంతో వైసీపీ ప్రతీ ఇష్యూలోనూ జాతీయ స్థాయిలో తన స్టాండ్ ఏమిటి అన్నది గట్టిగా చెప్పలేకపోతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎంపీలు నేరుగా ఎవరికి వారు ఇతర పార్టీల నాయకులను కలుస్తున్నారు అని అంటున్నారు. అలా ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గెని వైసీపీకి చెందిన ఒక ఎంపీ కలసి వచ్చారని చెబుతున్నారు. మరో వైపు చూస్తే పార్లమెంట్ సమావేశాల ముందు ఎంపీలతో మీటింగ్ పెట్టి ఏపీకి సంబంధించి ఏ అంశాలు పార్లమెంట్ లో లేవనెత్తాలి అన్న దాని మీద అధినాయకత్వం దిశా నిర్దేశం చేయడం జరుగుతూ ఉంటుంది.
గత కొంతకాలంగా అది కూడా జరగడం లేదని అంటున్నారు. ఇక ఈ రోజు జాతీయ స్థాయిలో కీలకంగా మారిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది అయితే లోక్ సభ రాజ్యసభలలో కలుపుకుని వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు మరి వారితో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారా లేదా అన్నది కూడా ఒక డిస్కషన్ అయితే సాగుతోంది వైవీ సుబ్బారెడ్డి అయితే ఢిల్లీ స్థాయిలో వైసీపీ తరఫున గట్టిగా సౌండ్ వినిపించలేకపోతున్నారని కూడా అంటున్నారు. 2014 నుంచి 2019 దాకా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఢిల్లీ స్థాయిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నిర్వహిచిన పాత్రను ఇప్పటి పరిస్థితులలతో పోలుస్తూ విశ్లేషణలు చేస్తున్న వారు కూడా ఉన్నారని అంటున్నారు.
