జగన్ వర్సెస్ బాబు : ప్రతిపక్ష హోదా అంటే ఇచ్చేస్తారా ?
మరో వైపు చూస్తే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి రావాలని పిలుపు ఇచ్చారు.
By: Satya P | 4 Sept 2025 6:00 AM ISTఏపీలో ప్రతిపక్ష హోదా మీద మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. వైసీపీ ఓటమి చెంది 15 నెలలు అయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే 11 సీట్లు మాత్రమే వచ్చిన వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా కావాలని అంటోంది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే తాజాగా చంద్రబాబు అసెంబ్లీకి రండి అక్కడ అన్నీ చర్చిద్దామని వైసీపీకి సవాల్ చేశారు. దాని మీద అటు వైసీపీ గట్టిగానే రియాక్ట్ అయింది.
హోదా ఇస్తేనే అంటూ :
ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అపుడు జగన్ అసెంబ్లీలో జగన్ అడిగే ప్రశ్నలకు తట్టుకోలేరని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి అంటే ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇచ్చి తీరాల్సిందే అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. తాము అన్ని విషయాలను అసెంబ్లీలోనే తేల్చుకుంటామని అన్నారు.
హోదా ఇచ్చేది ఎవరు :
ఇదిలా ఉంటే దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మాట్లాడుతూ రూల్స్ తెలుసుకోకుండా ప్రతిపక్ష హోదా అడగడమేంటని ఫైర్ అయ్యారు. హోదా ఇవ్వు సీఎం సీటు ఇవ్వు అంటే ఇచ్చేస్తారా అని సెటైర్లు పేల్చారు. హోదా ఎవరికి అయినా ఇచ్చేది ప్రజలు అని అన్నారు. తాము హోదా ఇవ్వలేదని విమర్శలు చేయడమేంటని ఆయన మండిపడ్డారు.
11 ఎమ్మెల్యేలూ రండి :
మరో వైపు చూస్తే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి రావాలని పిలుపు ఇచ్చారు. వారు అసెంబ్లీకి వస్త తాను ఎమ్మెల్యేలు అందరికీ తగిన సమయం ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలు అని మాత్రమే చెప్పారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా అన్నది మాత్రం ప్రస్తావించలేదు. జగన్ కూడా ఒక ఎమ్మెల్యేగానే సభా నిబంధనల ప్రకారం చూస్తున్నట్లుగానే ఉంది అని అంటున్నారు.
ఈసారికి లేనట్లేనా :
ప్రతిపక్ష హోదా విషయం మీద ఏపీలో మరోసారి రాజకీయ రచ్చ సాగుతోంది. దాంతో వైసీపీ ఈసారి అసెంబ్లీకి రాకపోవచ్చు అని అంటున్నారు. నిజానికి చూస్తే జగన్ అసెంబ్లీకి వస్తారు అని ముందుగా ప్రచారం సాగింది. అయితే ఇపుడు జరుగుతున్న రాజకీయ రాద్ధాంతం అటూ ఇటూ మాటలు డిమాండ్లు చూస్తూంటే జగన్ అసెంబ్లీకి వెళ్ళే విషయం అన్నది సందేహాస్పదమే అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధమని స్పీకర్ చెబుతున్నారు. ఈ లెక్కన వైసీపీకి ఉన్న సంఖ్యా బలం బట్టి అతి తక్కువ సమయమే దక్కుతుంది.
జగన్ వర్సెస్ బాబు :
అలా చూస్తే అసెంబ్లీలో జగన్ చేయి ఎత్తినా మైకు దక్కుతుందని నమ్మకం లేదని వైసీపీ అంటోంది. మొత్తానికి ప్రతిపక్ష హోదాకు ముడి పెట్టి అసెంబ్లీకి రాము అన్నది వైసీపీ విధానం అయితే దానినే రాజకీయ రచ్చగా చర్చగా ముందు పెట్టి టీడీపీ కూటమి పై ఎత్తు వేస్తోంది. జనంలో వైసీపీ ఈ విధంగా విమర్శలు ఎదుర్కొంటుంది అని అంటున్నారు. ప్రతిపక్ష హోదాలు ప్రోటోకాల్స్ అన్నవి టెక్నికల్ గానే చూడాల్సినవి. తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ సభకు వెళ్తున్నారా లేదా తమ తరఫున ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారా లేదా అన్నదే జనాలు చూస్తారు. ఆ విధంగా ఆలోచిస్తే వైసీపీ జగన్ వర్సెస్ బాబు అవుతుందని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ స్టాండ్ ఏ తీరుగా ఉంటుందో.
