జగన్ ఉత్తరాంధ్రా ఫోకస్ ... హాట్ టాపిక్ ?
మాజీ మంత్రి బొత్సకు కుడి భుజం లాంటి చిన్న శ్రీనుని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీకి ఆ జిల్లాలో సగం బలం తీసేసినట్లు అయింది.
By: Satya P | 17 Sept 2026 8:15 AM ISTఉత్తరాంధ్రాలో వైసీపీకి టీడీపీకి బలాబలాలు ఈ మధ్య దాకా దాదాపుగా సమానంగా ఉండేవి అని విశ్లేషణ ఉంది. విజయనగరం జిల్లాలో వైసీపీకి మొగ్గు ఉంటే విశాఖ సిటీలో టీడీపీది పై చేయిగా ఉండేది. ఇక శ్రీకాకుళం, విశాఖ రూరల్ జిల్లాల్లో పోటా పోటీగా రాజకీయం సాగేది. అందుకే 2014లో వైసీపీ ఓడి తొమ్మిది సీట్లు ఇక్కడ గెలిచినా తన బలాన్ని అమాంతం పెంచుకుని 2019 నాటికి మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో 28 గెలుచుకుని ఢంకా భజాయించింది. ఇక 2024 కి వచ్చేసరికి కూటమి మొత్తంగా ఉత్తరాంధ్రను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మన్యంలో రెండు అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీటు దక్కి వైసీపీ పరువు నిలిపాయి. ఈ నేపధ్యంలో 2024 నుంచి రాజకీయం మెల్లగా మారుతూ వస్తోంది. టీడీపీకి జనసేన కూడా జత కలవడంతో ఉత్తరాంధ్రాలో రాజకీయ సామాజిక సమీకరణాలలో గణనీయంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఇక టీడీపీ మరో అడుగు ముందుకేసి విజయనగరంలో వైసీపీకి గట్టి దెబ్బ కొట్టింది. మాజీ మంత్రి బొత్సకు కుడి భుజం లాంటి చిన్న శ్రీనుని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీకి ఆ జిల్లాలో సగం బలం తీసేసినట్లు అయింది.
సిక్కోలులో తంటాలు :
విజయనగరం తీరు ఇలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఇపుడు రాజకీయ ఇబ్బందులు పడుతోంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కి ధర్మాన సోదరులకు మధ్యన విభేదాలు బాహాటం కావడంతో తమ్మినేని కుటుంబం వేరే ఆలోచనలు చేస్తోంది అన్నది ప్రచారం కావడంతో వైసీపీ అధినాయకత్వం అలెర్ట్ అయింది అని అంటున్నారు. తమ్మినేని పార్టీకి దూరం అయితే ప్రధానమైన కాళింగ సామాజిక వర్గంలో ఆ ప్రభావం చూపుతుందని కూడా అంటున్నారు. ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ ని వైసీపీ సస్పెండ్ చేసింది. అంతకు ముందు వైసీపీలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి అదే సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి కూడా వైసీపీ నుంచి దూరం కావడం వెనక కూడా ఆధిపత్య పోరు కారణం అని అంటున్నారు. జిల్లా రాజకీయాలలో ఈ సామాజిక సమీకరణలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.
కీలక సమావేశం :
ఇదిలా ఉంటే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ఈ నెల 17న కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అని చెబుతున్నా ప్రత్యేకించి ఉత్తరాంధ్రా రాజకీయం గురించి చర్చకు రావచ్చు అని అంటున్నారు. చిన్న శ్రీను ఇటీవలనే పార్టీ వదిలి వెళ్ళిపోవడం అదే విధంగా తమ్మినేని సీతారాం కుమారుడు ఘాటు వ్యాఖ్యలు మీడియా ముందుకు వచ్చి చేయడం ఇవన్నీ వైసీపీలో చర్చకు తావిస్తున్నాయని అంటున్నారు. దాంతో ఉత్తరాంధ్రా మీద జగన్ ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. ఇక చూస్తే ఉత్తరాంధ్ర కు చెందిన వైసీపీ నేతలు అంతా జగన్ ని ముందే కలిసి అక్కడ రాజకీయం గురించి వివరించారు అని అంటున్నారు. దీంతో ఈ కీలక సమావేశంలో ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, అలాగే రీజనల్ కో ఆర్డినేటర్లను సీనియర్ నేతలను ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు.
