Begin typing your search above and press return to search.

బీజేపీ పిలిచింది...జగన్ పలుకుతారా ?

అదేదో పాత సినిమాలో ఒక పాపులర్ పాట ఉంది. పిలిచేవారు ఉంటే పలికేది నేనూ అని. మరి రాజకీయాల్లో కూడా చాలా పిలుపులు వలపులు ఉంటాయి.

By:  Satya P   |   19 Aug 2025 9:15 AM IST
బీజేపీ పిలిచింది...జగన్ పలుకుతారా ?
X

అదేదో పాత సినిమాలో ఒక పాపులర్ పాట ఉంది. పిలిచేవారు ఉంటే పలికేది నేనూ అని. మరి రాజకీయాల్లో కూడా చాలా పిలుపులు వలపులు ఉంటాయి. అలాగే తలుపులు తెరవడాలు రాచ మార్గాలు కూడా ఉంటాయి. కొన్ని ఈక్వేషన్స్ కూడా ఈ తలుపులు పిలుపులు వలపుల మధ్య ఇట్టే కుదురుతాయి ఇపుడు. ఏపీలో రాజకీయం చూస్తే అలాంటిదే ఒకటి జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది. ఏపీలో వైసీపీ న్యూట్రల్ పార్టీగా ఉంటోంది. కేంద్ర స్థాయిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమితో కానీ అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమితో కానీ వైసీపీకి రాజకీయ బంధం అయితే లేదు అని ఆ పార్టీ వారు చెప్పుకుంటారు.

ప్రత్యర్ధుల మాట అదీ :

అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వైసీపీకి బీజేపీకి మధ్య లోపాయి కారీ ఒప్పందం ఉందని తరచూ ఆరోపిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల అయ్యాక జగన్ మీద నేరుగానే ఈ తరహా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఏపీలో వైసీపీ ఎంపీలు అంతా బీజేపీకే సపోర్టు అని ఆమె ఇటీవలనే అన్నారు. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ పెద్దల నుంచి వైసీపీకి ఫోన్ వచ్చింది.

రాజ్ నాధ్ కాల్ తో :

ఉప రాష్ట్రపతి ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టగా తీసుకుంటోంది. నిజానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ఎలక్ట్రోరల్ కాలేజిలో పూర్తి మెజారిటీ ఉంది. కానీ ఇది చాలదు బంపర్ విక్టరీ కొట్టాలి ఇండియా కూటమిని ఓడించాలి. అంతే కాదు ఎక్కువ పార్టీలు పరోక్షంగా అయినా తమతోనే ఉన్నాయని చెప్ప్కోవాలి. అలా జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమిని దెబ్బ తీయాలి. ఈ ఎత్తుగడతోనే బీజేపీ జగన్ కి టచ్ లోకి వచ్చింది. కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ కే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాలను కో ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను అప్పగించింది. దాంతో ఆయన జగన్ కి ఫోన్ చేసి మాట్లాడారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.

జగన్ ఏమి చేస్తారో :

ఇప్పటికే ఏపీలో చూస్తే బీజేపీ నేతలు అంతా వైసీపీ మీద భారీ స్థాయిలో విమర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా లిక్కర్ స్కాం విషయంలో బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు మాధవ్ సైతం జగన్ జైలుకి వెళ్తారు అని హాట్ కామెంట్స్ చేశారు. ఇంకో వైపు ఏపీలో పదిహేను నెలలుగా కూటమి ప్రభుత్వం వైసీపీ మీద దూకుడుగా ఉన్నా బీజేపీ కేంద్ర స్థాయిలో అయితే పెద్దగా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. పైగా 2029 ఎన్నికల్లోనూ మూడు పార్టీలూ కలసి పోటీ చేయడానికే చూస్తున్నాయి. 2014 నుంచి 2019 దాకా అయితే ఈ పరిస్థితి లేదు. కానీ ఇపుడు సీన్ మారింది.

దాంతో బీజేపీకి మద్దతు ఇచ్చి ఏమి లాభం అన్నదే వైసీపీలో ఒక చర్చ. అంతే కాదు ఏపీలో బలపడడానికి కాంగ్రెస్ చూస్తోంది. బీజేపీతో బంధం అంటే వైసీపీ హార్డ్ కోర్ ఓటు బ్యాంక్ కి గండి పెట్టడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. దాంతో వైసీపీ అయితే ఆలోచనలోనే ఉంది అంటున్నారు ఎవరికీ మద్దతు లేదు అని న్యూట్రల్ గా ఉండడం ఉత్తమం అన్న మాట కూడా ఉంది అయితే ఉప రాష్ట్రపతి పదవి రాజ్యాంగ పదవి కాబట్టి ఇందులో రాజకీయం చూడకూడని అనుకుంటే మాత్రం బీజేపీ అభ్యర్ధికే మద్దతు ఇవ్వవచ్చు అన్నది మరో వాదనగా ఉంది అంటున్నారు.