Begin typing your search above and press return to search.

'మావిగన్' మాయలో వైసీపీ.. భ్రమల్లోనే లీడర్లు, నెటిజన్ల సెటైర్లు

మావిగన్ ప్రతిపాదనకు మద్దతు ఉందని చెప్పే క్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన పోస్టల్ బ్యాలెట్ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో MPTC, ZPTC పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ ఆధిక్యంలో ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో మావిగన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలో పార్టీ ఓటమిని గుర్తుచేస్తూ నెటిజన్లు విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   7 Nov 2026 1:52 PM IST
మావిగన్ మాయలో వైసీపీ.. భ్రమల్లోనే లీడర్లు, నెటిజన్ల సెటైర్లు
X

రాజధాని అమరావతి వ్యతిరేక అజెండాతో ఒకవైపు రాజకీయంగా నష్టం జరుగుతున్నా ప్రతిపక్షం వైసీపీ మాత్రం తగ్గేదేలే అంటోంది. మూడు రాజధానులకు బదులుగా తెరపైకి తీసుకువచ్చిన మావిగన్ కు ప్రజల మద్దతు ఉందని చెప్పేందుకు తాపత్రయ పడటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రతిపాదించిన మావిగన్ పరిధిలోని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైసీపీ ఘోరంగా ఓడిపోయినా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యం వచ్చిందంటూ సోషల్ మీడియాలో హడావుడి చేయడంపై రకరకాల చర్చ జరుగుతోంది. “మావిగన్” పరిధిలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో MPTC & ZPTC పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ ఆధిక్యం అంటూ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఎక్స్ లో చేసిన ట్వీట్ నెటిజన్ల ట్రోలింగ్ కు దారితీసింది.

స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి ఉద్యోగుల ఆదరణ ఉందని చెప్పాలని భావించారో లేక పార్టీ ఉనికిని మరింత ఎక్కువగా చూపాలని లెక్కలు వేసుకున్నారో కానీ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన ట్వీట్ మాత్రం తీవ్రమైన ట్రోలింగ్ కు గురవుతోంది. ఉదయం 10.30 నిమిషాలకు ఆయన చేసిన ట్వీట్ వల్ల ఏం సాధిస్తారో చెప్పలేం కానీ, పార్టీని మరింత డ్యామేజ్ చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. దీనికి కారణం నాగార్జున యాదవ్ చేసిన ట్వీట్ కు వచ్చిన కామెంట్సును ఉదహరిస్తున్నారు. మీరు భ్రమలో ఉంటూ మీ కార్యకర్తలను భ్రమల్లోకి నెట్టేస్తున్నారని పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో కొందరు అనుచిత వ్యాఖ్యలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడాన్ని పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు.

అదే సమయంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సందర్భంగా ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని నాగార్జున యాదవ్ చేసిన కామెంట్ ను ప్రస్తావిస్తూ మరో నెటిజన్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. మరో నెటిజన్ అయితే మొన్న సున్నా వచ్చింది కదా? అంటూ ప్రశ్నించాడు. మొత్తానికి నాగార్జున యాదవ్ చేసిన ట్వీట్ నెట్టింట హాట్ డిబేట్ గా మారింది. పూర్తి ఫలితం వచ్చే వరకు ఆగకుండా, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులోనే అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. మాజీ సీఎం జగన్ ప్రతిపాదించిన మావిగన్ లో ప్రధాన నగరాలు అయిన మూడు నగర పాలక సంస్థల్లో ఘోర ఓటమిపై సమీక్షించుకోకుండా, మళ్లీ అదే పాట పాడి చివరికి ట్రోలింగుకు గురి అవ్వాల్సివస్తుందనే కనీస ఆలోచన లేకపోవడం ఏంటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

రాజధానిపై వెనక్కి తగ్గరా?

వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో నాగార్జున యాదవ్ అభిప్రాయాలు అన్నీ పార్టీ నిర్ణయాలుగానే భావించాల్సివస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు రాజధానుల నినాదంతో తీవ్రంగా దెబ్బతిన్న వైసీపీ దాదాపు ఏడాదిన్నర తర్వాత మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చింది. దీనిపై తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రజాభిప్రాయానికి నిదర్శనంగా తీసుకోవాలని పరిశీలకులు భావిస్తున్నారు. దీనిపై ఆ పార్టీలో చర్చ జరిగిందో లేదో తెలియదు కానీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మావిగన్ కు ప్రాతిపదికగా తీసుకుంటారా? లేదా అన్నది చెప్పకుండానే ఒకటి రెండు చోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ ఓట్లు వస్తే గొప్పగా చాటుకోవడంపైనే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆలోచన వైసీపీ నేతల్లో లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.