Begin typing your search above and press return to search.

పార్లమెంటులో 11వ నెంబరు గది.. ఉలిక్కిపడిన వైసీపీ!!

ఈ ఘటనతో వైసీపీని ‘‘11’’ వదలడం లేదని తాజాగా మరోసారి స్పష్టమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   24 March 2026 5:05 PM IST
పార్లమెంటులో 11వ నెంబరు గది.. ఉలిక్కిపడిన వైసీపీ!!
X

పార్లమెంటులో వైసీపీ పార్లమెంటరీపార్టీకి 11వ నెంబరు గది కేటాయించడం ఆ పార్టీ నేతలను ఉలికిపాటుకు గురిచేసింది. ఆ నెంబరు చూసిన వెంటనే భయపడిన ఎంపీలు వేరే గది కేటాయించాలని స్పీకర్ కు విన్నవించడం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ ఎంపీల విజ్ఙప్తితో స్పీకర్ కార్యాలయం 12 నెంబరు గదిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యాలయాలకు పార్లమెంటులో గదులు కేటాయించడం అత్యంత సహజమే అయినప్పటికీ వైసీపీకి 11వ నెంబరు గది కేటాయించడమే చర్చకు దారితీసింది. ఆ నెంబరుతో వైసీపీకి చేదు అనుభవం ఉండటంతో మరో గదికి మార్చాలని స్పీకర్ ను కోరుకున్నారు.

ఈ ఘటనతో వైసీపీని ‘‘11’’ వదలడం లేదని తాజాగా మరోసారి స్పష్టమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ కోసం మొదటి అంతస్తులో 11వ నెంబరు గదిని స్పీకర్ కార్యాలయం కేటాయించింది. అయితే ఈపరిణామంతో వైసీపీ ఎంపీలు ఉలికిపాటుకు గురయ్యారు. ఇప్పటికే 11 తో వైసీపీని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆ గది తీసుకుంటే ఇంకా ట్రోలింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని భయపడ్డారో ఏమో కానీ 11వ నెంబరు గది వద్దంటూ వైసీపీ ఎంపీలు స్పీకర్ కార్యాలయాన్ని కోరారు.

దీంతో వెంటనే స్పందించిన స్పీకర్ కార్యాలయం 11వ నెంబరు గదికి బదులుగా 12వ నెంబరు గదిని వైసీపీ పార్లమెంటు కార్యాలయానికి కేటాయించింది. వైసీపీకి లోక్ సభలో నలుగురు సభ్యులు ఉండగా, రాజ్యసభలో ప్రస్తుతం ఏడుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మొత్తం కలిపినా 11 మంది అవుతున్నారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు వైసీపీకి ఒక్క రాజ్యసభలోనే 11 మంది సభ్యులు ఉండేవారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే మిగిలారు.

ఇలా ఎక్కడ చూసినా 11 కనిపిస్తుండటం, ఆ సంఖ్య తమకు అచ్చిరాలేదనే అభిప్రాయంతో వైసీపీ ఎంపీలు పార్లమెంటు పార్టీ కార్యాలయాన్ని మార్చాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన నుంచి వైసీపీ టార్గెట్ గా సోషల్ మీడియాలోనూ అధికార కూటమి నేతలు, కార్యకర్తలు కూడా 11తో ట్రోల్ చేస్తున్నారు. ఇది కూడా వైసీపీ ఎంపీలను ఉలికిపాటుకు గురిచేసి ఉండొచ్చని అంటున్నారు. అనవసరంగా 11వ నెంబరు గది తీసుకుని మళ్లీ ట్రోలింగు అయ్యే బదులు వైసీపీ ఎంపీలు ముందు జాగ్రత్త తీసుకున్నారని అంటున్నారు.