చైర్మన్ వర్సెస్ చైర్మన్: టీడీపీ వర్సెస్ వైసీపీ.. !
ఏపీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు అవమానం జరిగిందని వైసిపి సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
By: Garuda Media | 29 Sept 2025 9:33 AM ISTఏపీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు అవమానం జరిగిందని వైసిపి సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బయట కూడా దీనిపై మాట్లాడుతున్నారు. వాస్తవానికి శాసనమండలి చైర్మన్ అయినా అసెంబ్లీ స్పీకర్ అయినా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకున్న పదవులు. కాబట్టి ఈ స్థానాల్లో కూర్చున్న వారికి పార్టీలను అంటగట్టడం అనేది నిజానికి ఎవరు చేసినా తప్పే అవుతుంది. గతంలో ఇలాంటివి జరగలేదా ఇప్పుడే జరుగుతున్నాయా అనే ప్రశ్నలు కూడా తెరమీదకు వచ్చాయి.
వైసీపీ సభ్యులు, తమ పార్టీకి చెందిన నాయకుడు కాబట్టి మోషన్ రాజుకు అవమానం జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకపోవడంతో పాటు ఆయనకు ఆఫీసు సిబ్బందిని కూడా తగ్గించారని.. దీనికి కారణం ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టేనని విమర్శలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా మోషన్ రాజుకు జరుగుతున్న అవమానంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని కూడా బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే టిడిపి నాయకులు మరో వాదన తెరమీదకు తీసుకొచ్చారు. గతంలో మండలి చైర్మన్గా చేసిన మైనారిటీ టిడిపి నాయకుడు మహమ్మద్ షరీఫ్‌ను అవమానించలేదా అప్పుడు మీరు ఆయన మొహం మీద కాగితాలు విసిరేయలేదా ఆయనను తప్పు పట్టలేదా అని ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు మండలిలో చర్చకు వచ్చినప్పుడు దానిని కమిటీకి సిఫారసు చేస్తూ అప్పటి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని వైసిపి సభ్యులు తప్పుపడుతూ యాగి చేశారన్నది వాస్తవం. మండలి చైర్మన్ ను దుర్భాషలాడారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
టిడిపి నాయకులు చెబుతున్న మాట వాస్తవానికి సభలో జరుగుతున్న పరిణామాలు సభలో జరుగుతున్న చర్చలు వంటివి చైర్మన్ ల మీద, అదేవిధంగా స్పీకర్ల మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. ఇవి కామన్. అయితే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ స్థానాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నది ప్రజాస్వామ్య వాదులు చెబుతున్న మాట. కానీ, మండలిలో ప్రైవేటు పాలిటిక్స్ చోటు చేసుకోవడం తోపాటు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఇటువంటి విషయాలు మరుగున పడిపోతున్నాయనే చెప్పాలి. మరి ఏం జరుగుతుంది.. భవిష్యత్తులో అయినా ఈ పరిస్థితి మారుతుందా రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానాల్లో ఉన్న నాయకులకు గౌరవం ఇనుముడిస్తుందా అనేది చూడాలి.
