మోదుగుల వర్సెస్ సజ్జల.. వైసీపీ హాట్ టాపిక్
వైసీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యవహారం.. మరోసారి పార్టీ ముందు.. చర్చకు వచ్చింది.
By: Garuda Media | 26 Aug 2025 10:02 AM ISTవైసీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యవహారం.. మరోసారి పార్టీ ముందు.. చర్చకు వచ్చింది. ఆయన తాజాగా వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వైసీపీ రాజకీయ వ్యవహారాలను సజ్జలే చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను కలిసిన మోదుగుల తన మనసులో మాటను చెప్పేశారు. తనకు నరసరావుపేట లేదా గుంటూరు పార్లమెంటు స్థానాల ఇంచార్జ్ పదవిని ఇవ్వాలని కోరారు. కానీ, ఈ విషయంపై సజ్జల ఇతమిత్థంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు.
అంతేకాదు.. జగన్ ఇప్పటికే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై మోదుగు ల కూడా వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. ''మీరు ఎలా డిసైడ్ చేశారో నాకు అర్ధం కావడం లేదు. నాకేమైనా పరిచయం ఉందా.. విజయవాడతో. నేనెప్పుడైనా.. అక్కడ పనిచేశానా? నా మొహం వాళ్లకి తెలియదు.. నాకువారు తెలియదు. నేనెలా అక్కడ రాజకీయాలు చేస్తాను. పార్టీని డెవలప్ చేస్తాను.'' అని సీరియస్‌గానే చెప్పినట్టు తెలిసింది. దీంతో సజ్జల కూడా.. పార్టీలైన్ ప్రకారమే పదవులు టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పినట్టు సమాచారం.
ఏం జరిగింది..?
గుంటూరుకు చెందిన మోదుగులకు గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తామని ఇవ్వలేదు. దీంతో ఆయన అలిగారు. పైగా.. పార్టీ కార్యక్రమాలకు కూడా కడు దూరంలో ఉన్నారు. ఈ పరిణామాలను గుర్తించిన వైసీపీ అధినేత జగన్.. ఆయనను విజయవాడ పార్లమెంటు వైసీపీ ఇంచార్జ్‌గా 8 మాసాల కిందటే నియమించారు. కానీ, మోదుగుల ఒక్కసారి కూడా.. విజయవాడలో అడుగు పెట్టలేదు. ఇటీవల ఈ వ్యవహారంపై జగన్ సీరి యస్ అయ్యారు. తాను నియమించిన పదవులు తీసుకోని వారి జాబితా ఇవ్వాలని సజ్జలను ఆదేశించారు. అంతేకాదు.. వారి నుంచి వివరణ కూడా తీసుకోవాలన్నారు.
దీంతో మోదుగుల తాజాగా శుక్రవారం.. సజ్జల ను కలిసి వివరణ ఇచ్చారు. తనకు విజయవాడతో ఎలాంటి సంబంధం లేదని, తాను అక్కడ రాజకీయాలు చేయలేనని.. టైం వేస్టు తప్ప.. ప్రయోజనం ఉండదని కూడా తేల్చి చెప్పినట్టు తెలిసింది. అయితే.. పార్టీ అధినేత చెప్పినట్టు వ్యవహరించాలని.. అన్నీ ఆలోచించే నిర్ణయంతీసుకున్నామని సజ్జల తేల్చి చెప్పినట్టు తెలిసింది. కానీ, మోదుగుల మాత్రం తనకు పేట లేదా గుంటూరు ఇవ్వాలని.. అప్పుడు ఏదైనా సమస్య వస్తే.. తనను ప్రశ్నించాలని కోరినట్టు తెలిసింది. జగన్‌తో అప్పాయింట్‌మెంటు ఇవ్వాలని చెప్పి.. వెనుదిరిగినట్టు పార్టీవర్గాల్లో చర్చ సాగుతోంది.
