‘అమెరికాలో ఉండి కనుసైగ చేస్తే ఎగిరిపోతానా’ ఎమ్మెల్యే శిరీషాదేవి సీరియస్
తనను చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ తనపై ఘాటు విమర్శలు చేస్తున్న ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై నిప్పులు చెరిగారు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి.
By: Garuda Media | 28 Dec 2025 12:00 PM ISTతనను చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ తనపై ఘాటు విమర్శలు చేస్తున్న ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై నిప్పులు చెరిగారు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి.. డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. తననూ చంపేస్తానని బెదిరింపులకు దిగటంపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘నేను భయపడను. అమెరికాలో ఉండి కనుసైగ చేస్తే.. నేను ఎగిరిపోతానని బెదిరిస్తున్నారు. నేనొక మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా హెచ్చరించటం.. వ్యంగ్యంగా మాట్లాడటం ఎంతవరకు సబబు?’’ అని ఆమె ప్రశ్నించారు.
ప్రశాంతంగా ఉండే రంపచోడవరం నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు బీజం వేసింది వైసీపీదేనని మండిపడ్డారు. ఏజెన్సీలో బినామీల పేరుతో క్వారీలు.. రంగురాళ్ల తవ్వకాలు.. కలప.. గంజాయి దందా చేస్తూ కోట్లాది రూపాయిలు వెనుకేసింది ఎవరో అందరికి తెలుసన్న ఆమె.. బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు.
అంతేకాదు.. తన మీదా.. తన భర్త మీదా తప్పుడు ఆరోపణలు చేయటం.. అవినీతి చేస్తున్నట్లుగా అసత్యాల్ని ప్రచారం చేస్తే ఊరుకోమన్నారు. వైసీపీ హయాంలో పట్టణ.. మైదాన ప్రాంతాల్లో అవినీతి సొమ్ముతో కొన్న భూముల వివరాల్ని త్వరలోనే బయటపెడతానని ఆధారాలతో వాటిని నిరూపిస్తామని మండిపడ్డారు. తాజా పరిణామాలతో రంపచోడవరం రాజకీయం మరింత వేడెక్కిందని చెప్పాలి.
