వైసీపీ భారంగా మారుతోంది: ఓ ఎమ్మెల్యే గాధ.. బాధ ఇది...!
ఏదైనా పార్టీ.. నాయకులకు అనుకూలంగా మారాలి. భారంగా ఎట్టి పరిస్థితిలోనూ మారకూడదు.
By: Garuda Media | 5 Aug 2025 1:00 AM ISTఏదైనా పార్టీ.. నాయకులకు అనుకూలంగా మారాలి. భారంగా ఎట్టి పరిస్థితిలోనూ మారకూడదు. కానీ, వైసీపీ వ్యవహారం మాత్రం దీనికి భిన్నంగా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో సీనియర్ల నుంచి నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన నాయకుల వరకు కూడా.. అందరూ మౌనంగానే ఉంటున్నారు. ఎవరూ గళం వినిపించడం లేదు. ముఖ్యంగా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురు.. పార్టీ తమకు భారంగా మారుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. కొన్నాళ్లుగా పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ, సదరు ఎమ్మెల్యే దీనిని ఖండిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం.. ఆ ఎమ్మెల్యే కూటమిలోని ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో సదరు పార్టీకి చెందిన ఫ్లెక్సీలు కట్టినా.. జేజే లు కొట్టినా.. ఆమె ఉలకడం లేదు. పలకడం లేదు. పైగా.. ఎవరి పార్టీ వారిది.. అంటూ సెలవిస్తున్నారు. ఇది వివాదరహితంగా చూసుకుంటే మంచిదే అయినా.. పార్టీ విషయంలోనూ ఉదాశీనంగా వ్యవహరిస్తు న్నారు.
ఈ ఒక్క ఎమ్మెల్యేనే కాదు.. మరో నేత కూడా.. ఇలానే ఆలోచన చేస్తున్నారు. గిరిజన ప్రాబల్యం ఉన్న స్థానం నుంచి విజయం దక్కించుకున్న ఈ నేత కూడా.. అదే పార్టీ నేతలతో కలివిడిగా ఉంటున్నారు. వారితో ముచ్చట్లు చెబుతున్నారు దీనికి కారణం... వచ్చే నాలుగేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగా లంటే.. ఆ మాత్రం కలివిడి తప్పదని అంటున్నారు. అంతేకాదు.. తమ పార్టీ ఎలానూ.. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని.. కాబట్టి.. తాము.. కూడా అలానే ఉంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇలా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు. వీరంతా చెబుతున్నది ఒక్కటే.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోవడంతోపాటు.. ఇంకా గడుసుగా వ్యవహరించడం సరికాదనే. అయితే.. ఈ విషయంలో పార్టీ అధిష్టానం మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ వచ్చేస్తుందని చెబుతున్నారు. దీనిని ఇతర నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు తెస్తున్న పెట్టుబడులు.. ప్రజల్లో నెలకొన్న ఆశలను గమనిస్తే.. ఇది సాధ్యం కాదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే.. పార్టీ అధినేత తీరుపై ఎమ్మెల్యేలు.. గుస్సాగా ఉన్నారు.
