రాజీనామా బాటలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు.. !
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై కినుక వహిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు.. రాజీనామా బాటకు రెడీ అయ్యారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
By: Garuda Media | 25 Jan 2026 6:00 AM ISTవైసీపీ అధినేత జగన్ వైఖరిపై కినుక వహిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు.. రాజీనామా బాటకు రెడీ అయ్యారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఈ జాబితాలో జగన్ సొంత జిల్లా కడప కూడా ఉందని తెలిసింది. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా రాజీనామా బాటలో పయనించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. వీరిలో ఒక పురుష, ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్నారని చర్చ జరుగుతోంది.
ఎందుకు.. ?
ప్రధానంగా జగన్ వైఖరిపై 10 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది కినుక వహిస్తున్నారు. సభకు వెళ్లకుండా పట్టు బట్టడం ద్వారా ప్రజల్లో పలుచన అవుతున్నామన్న ఆవేదనలో వారు ఉన్నారు. సభకు వెళ్లి.. తమ వరకు ప్రశ్నించి.. లేదా చర్చల్లో పాల్గొని వచ్చేస్తామని చాలా మంది ఎమ్మెల్యేలు.. చెబుతున్నారు. ఒకరిద్దరు మినహా 7-8 మంది ఎమ్మెల్యేల వాదన ఇలానే ఉంది. ఇక, తొలిసారి సభకు ఎన్నికైన వారు కూడా ఇదే మాట చెబుతున్నారు.
కానీ.. ప్రధాన ప్రతిపక్ష హోదా సహా.. సీఎం ఎంత సేపు సభలో మాట్లాడితే.. తనకు కూడా అంతే సమయం ఇవ్వాలని వైసీపీ అధినేత పట్టుబడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎటూ తెగడం లేదు. మరోవైపు.. సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్నారని.. ప్రజల సొమ్మును అనవసరంగా తీసుకుంటున్నారని ప్రభుత్వ పక్షం ప్రచారం చేస్తోంది. ఇది.. ఆయా ఎమ్మెల్యేలకు మరింత అవమానంగా మారింది. దీంతో సభకు వెళ్లాలని.. నిర్ణయించుకుంటున్నారు.
కానీ, ఎప్పటికప్పుడు అధినేత నుంచి వస్తున్న సంకేతాల నేపథ్యంలో సదరు సభ్యులు మౌనంగా ఉంటు న్నారు. తాజాగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభకు హాజరై.. తమ సమస్యలు, నియోజకవర్గం ప్రజల ఆకాంక్షలు చెప్పాలని కొందరు భావిస్తున్నారు. కానీ.. జగన్ వైఖరిలో మార్పు కనిపించడం లేదు. దీంతో సదరు ఎమ్మెల్యేలు ఖిన్నులవుతున్నారు.
మరో ఏడాదిన్నరలో ఎలానూ పాదయాత్ర ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సభకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఒకవేళ దీనికి అనుమతించని పక్షంలో సభ్యత్వానికి రాజీనామా చేసే దిశగా ఇద్దరు సభ్యులు రెడీ అవుతున్నారని సమాచారం. తద్వారా తమపై వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలని భావిస్తున్నారు.
