వైసీపీ ఎమ్మెల్యేలు...రెండింటికీ చెడ్డారా ?
వైసీపీకి ఈ ఎమ్మెల్యేలే బలం. వారే పార్టీకి ఉన్న పెద్ద ఆస్తిగా చూడాల్సి ఉంది. వీరినే ముందు పెట్టి వైసీపీ రాజకీయం చేయాలి.
By: Satya P | 14 Sept 2025 10:00 PM ISTఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలది ఒక చిత్రమైన పరిస్థితిగా చెప్పుకోవాలి. వారు ప్రజల మద్దతుతో నెగ్గారు. 2024 ఎన్నికలనే తీసుకుంటే టీడీపీ కూటమి ప్రభంజనం ఏ విధంగా సునామీ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సునామీలో వైసీపీకి చెందిన హేమాహేమీలు అంతా ఓటమి పాలు అయ్యారు. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారు సైతం షాక్ తినేశారు. అయితే వైసీపీకి ఇంతటి ఎదురీతలోనూ 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో ఇద్దరు ముగ్గురుని పక్కన పెడితే చాలా మంది ఎమ్మెల్యేలు కొత్తవారే. ధీటుగా కూటమికి పోటీ ఇచ్చి మరీ ప్రజా దీవనను పొందారంటే వారు గ్రేట్ అనాల్సిందే.
సభకు రావాలని ఉన్నా :
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావాలని అనుకుంటున్నారు. తమ నియోజకవర్గం ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని అనుకుంటున్నారు. కూటమిని బలంగా మూడు పార్టీలతో పొత్తు కట్టి మరీ వచ్చినా లెక్క చేయకుండా జనాలు తమను గెలిపించినందుకు వారి గొంతుకగా మారాలని అనుకుంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల కోరిక మాత్రం గత పదిహేను నెలలుగా తీరడం లేదు అసెంబ్లీకి వెళ్ళకూడదని వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో సభకు వచ్చి అధ్యక్షా అనే చాన్స్ ని వారు కోల్పోతున్నారు. అదే సమయంలో ఇటు నియోజకవర్గంలో ప్రజల ముందు వారు దోషులుగా నిలబడుతున్నారు. సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు అని నిందలు కూడా మోస్తున్నారు.
సౌండ్ లేదంటే :
వైసీపీకి ఈ ఎమ్మెల్యేలే బలం. వారే పార్టీకి ఉన్న పెద్ద ఆస్తిగా చూడాల్సి ఉంది. వీరినే ముందు పెట్టి వైసీపీ రాజకీయం చేయాలి. జగన్ అసెంబ్లీకి రాదలచుకోకపోతే ఆయన తన వరకూ ఆగిపోయినా తన ఎమ్మెల్యేలను సభకు పంపించి ప్రజా సమస్యల మీద చర్చ జరిగేలా చూడవచ్చు. ఆ విధంగా సభలో వైసీపీ వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. ఇటు ఓట్లేసిన ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. మరో వైపు చూస్తే రాష్ట్రంలోని ప్రజా సమస్యల మీద ఎలుగెత్తి చాటినట్లు అవుతుంది. కానీ వారికి సభకు రావాలని అధినాయకత్వం పంపించడం లేదు అని అంటున్నారు.
మీడియా ముందుకు రాని వైనం :
అదే సమయంలో వారి సేవలను ఏ విధంగా వాడుకోవడం లేదని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి అంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకే ఆ బాధ్యత అప్పగిస్తున్నారు. వారే మీడియా ముందుకు వస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉంటే ఓడిన ఎమ్మెల్యేలు మాత్రం మీడియా ఫోకస్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక పార్టీలో కూడా కీలక పదవులు వారికి దక్కేయా లేదా అన్నది కూడా సందేహమే. వారిని సభకు జనానికీ కాకుండా చేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.
కరెక్ట్ వ్యూహం అదేనా :
వైసీపీ ఎమ్మెల్యేలను సభకు పంపిస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అది కాదు అనుకుంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారు. ఆ విధంగా పొలిటికల్ గా వైసీపీ హైలెట్ కావడానికి ఎంతో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. నిజం చెప్పాలీ అంటే కరెక్ట్ స్ట్రాటజీ కూడా అదే అని అంటున్నారు. కానీ వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను ఏమీ కాకుండా చేశారు అని అంటున్నారు. అంతే కాకుండా డమ్మీలుగా మార్చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది.
