ఏదే మైనా 'అయ్యన్న' అంతే.. ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు!
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. మనసులో ఏమీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు కక్కేస్తారు.
By: Garuda Media | 7 Nov 2025 7:00 PM ISTఅసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. మనసులో ఏమీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు కక్కేస్తారు. నిర్మొహ మాటంగా మాట్లాడేస్తారు. ఇది రాజకీయాల్లో ఒక్కొక్క సారి వివాదాలకు కూడా దారి తీసింది. నిజానికి ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అయ్యన్న చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగానే.. జోగి రమేశ్.. అప్పటి చంద్రబాబు నివాసంపైకి దాడి చేసేందుకు వెళ్లారన్న వాదన ఉంది. అయినా.. అయ్యన్న మాత్రం మనసులో ఏమీ దాచుకునేందుకు ప్రయత్నించడంలేదు.
తాజాగా కూడా.. కీలక విషయంపై ఆయన దాచుకోకుండా మొహమాటం లేకుండా వెల్లడించేశారు. ఇది టీడీపీ నాయకులకు ఇబ్బంది కలిగించే విషయమే అయినా.. ఆయన ''ఉన్నదే మాట్లాడుకుందాం అండీ'' అంటూ.. చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైసీపీ కి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ సభకు వెళ్లడం లేదు. ఈ విషయం చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్నారని కూడా టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
అయితే.. తాజాగా ఈ విషయాన్నే ప్రస్తావించిన అయ్యన్న.. జగన్ కు మార్కులు వేశారు. ''జగన్ సభకు రావట్లేదు.. జీతం కూడా తీసుకోవట్లేదు. ఈ విషయం ఎందుకు దాచాలి. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడు దాం అండీ'' అన్నారు. మిగిలిన 10 మంది మాత్రం జీతాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ నాయకులకు ఇబ్బందిగా మారాయి. ఇప్పటి వరకు జగన్ కూడా సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్నారని.. కొందరు మంత్రులు ఆరోపిస్తున్నారు.
తాజాగా అయ్యన్న నిర్మొహమాటంగా చెప్పేసరికి విషయం తెలిసింది. ఇక, జీతం తీసుకుంటూ.. సభకు రాని వారిపై చర్యలు తీసుకునేలా చర్చిస్తామని అయ్యన్న చెప్పారు. దీనిపై పార్లమెంటు స్పీకర్‌కు కూడా లేఖ రాస్తామన్నారు. సభలోనూ ఈ విషయాన్ని చర్చకు పెడతామన్నారు. వారికి జీతాలు ఎందుకు ఇవ్వా లని ప్రశ్నించారు. అయితే.. పార్లమెంటుకు కానీ.. అసెంబ్లీలు, మండలి కి కానీ.. రాని సభ్యులకు వేతనాలు ఇవ్వరాదన్న ప్రొవిజన్ ఎక్కడా లేకపోవడమే.. ఇప్పుడు అసలు సమస్య. దీనికి పరిష్కారం కనుగొనాలన్నదే స్పీకర్ తాపత్రయం. మరిఏం చేస్తారో చూడాలి.
