‘ప్రజల్లో పరువు తీసేస్తారా?’ వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ షాకింగ్ డెసిషన్!
వైసీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేలా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
By: Tupaki Political Desk | 8 Jan 2026 3:58 PM ISTవైసీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేలా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం, టీఏ, డీఏలను పొందడంపై ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. బుధవారం వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీపై ఎథిక్స్ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. సభకు రాకుండా ఆరుగురు ఎమ్మెల్యేలు టీఏ, డీఏలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. సిబ్బంది ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించిన ఎథిక్స్ కమిటీ సభ్యులు వైసీపీ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై చర్చించారు.
అసెంబ్లీ కమిటీ హాలులో శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సభ్యుల హోదాలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. మిగిలిన సభ్యులు గైర్హాజరయ్యారు. ఇక సమావేశం ప్రధాన అజెండా అయిన వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చైర్మన్ బుద్ధప్రసాద్ సభ్యులతో చర్చించారు. సభకు హాజరుకాకుండా టీఏ, డీఏలు తీసుకోవడం అనైతికమన్న అంచనాకు వచ్చారని ప్రచారం జరుగుతోంది. దీనిపై సభ్యులను ఎథిక్స్ కమిటీ ముందుకు పిలిపించి వివరణ తీసుకోవాలని సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో చైర్మన్ బుద్ధప్రసాద్ స్పందిస్తూ, వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి పిలిపించడం కన్నా, ప్రధాన నగరాల్లో మేథావులు, ప్రజాసంఘాలతో సమావేశాలు నిర్వహించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించి అసెంబ్లీకి గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే బాగుంటందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. అయితే సమావేశానికి హాజరైన ముగ్గురిలో ఇద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. నిర్ణయాన్ని వాయిదా వేసి వచ్చే సమావేశానికి మిగిలిన సభ్యులు హాజరైతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.
ఎథిక్స్ కమిటీలో జరిగిన చర్చను పరిశీలిస్తే, వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీపై ప్రజల్లో చర్చ జరిగేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మినహా మిగిలిన పది మంది జీతాలు తీసుకుంటున్నారని, దొంగచాటుగా సంతకాలు చేస్తున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడుతోపాటు కూటమి ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు పోటీలు నిర్వహించిన సమయంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలో సైతం వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్చ జరిగేలా ఒక స్కిట్ వేశారు. ఇలా అవకాశం దొరికినప్పుడు అల్లా వైసీపీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.
ఇక ఎథిక్స్ కమిటీలో చర్చించిన విధంగా ప్రధాన నగరాల్లో చర్చా వేదికలు నిర్వహించి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రజాభిప్రాయం కోరితే వైసీపీ ఎమ్మెల్యేలకు తీవ్ర అవమానం జరిగినట్లే భావించాల్సివస్తుందని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కన్నా, వారిని నైతికతను ప్రశ్నించేలా ప్రజల్లో డిబేట్ జరగడాన్ని రాజకీయ సంచలనంగానే పరిగణించాల్సివుంటుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సివుందని, ప్రస్తుతానికి ముగ్గురు ఎథిక్స్ కమిటీ సభ్యుల అభిప్రాయంపై నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఏదిఏమైనా ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాలు పరిశీలిస్తే, ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ఏ అవకాశాన్ని అధికారపక్షం వదులుకోకపోవచ్చే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎథిక్స్ కమిటీ సూచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళతారని, వారే తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనేది ఆసక్తి రేపుతోంది.
