ఆ 'నలుగురి'కి గ్రీన్ సిగ్నల్: జగన్ కీలక నిర్ణయం!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి.
By: Garuda Media | 18 Sept 2025 9:31 AM ISTఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ తరఫున ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేలు సభకు రావాలని ఇటు ప్రభుత్వం నుంచి సవాళ్లు.. అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడి నుంచి విజ్ఞప్తులు కూడా వచ్చాయి. అయితే..నిన్న మొన్నటి వరకు భీష్మించిన జగన్.. ప్రజల్లో కూడా ఈ విషయం చర్చకు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై ఒక అడుగు వెనక్కి వేసినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నారు. అసెంబ్లీకి వెళ్లకపో తే.. తమ గ్రాఫ్ మరింత దిగజారుతుందని.. ప్రభుత్వం ఈ విషయాన్ని మరింత హైలెట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాలకు.. వైసీపీ తరఫున నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాడేపల్లి వైసీపీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నాళ్లుగా రైతుల సమస్యలపై స్పందిస్తున్న వైసీపీ.. అసెంబ్లీలో వీటిని ప్రస్తావించకపోతే.. ప్రయోజనం ఉండదన్న వాదన పార్టీ నాయకుల నుంచి వ్యక్తమైంది. బయట ఎన్ని పోరాటాలు చేసినా.. సభావేదికగా వాటిని ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక ఎమ్మెల్యేలు కొందరు చేసిన సూచనలను జగన్ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది.
దీనిలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను సభకు పంపించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వీరిలో పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మంత్రా లయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డిలు అసెంబ్లీకి వెళ్లేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. చిత్రం ఏంటంటే.. ఈ నలుగురు కూడా రాజకీయాల్లో ఇటీవల చర్చనీయాంశం అయ్యారు. పెద్దిరెడ్డి ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమయ్యారన్న చర్చ సాగింది. సుధ.. జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఆమె ఖండించారు.
ఇక, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం.. ఇటీవల కాలంలో దూకుడుగా ఉన్నారు. దీంతో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తు న్నారు. ఇక, నాగిరెడ్డి ఏకంగా వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. గెలిచింది.. ఇంట్లో కూర్చునేందుకు కాదని.. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఈ నలుగురిని ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. గురువారం జరిగే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ మరింత మందికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. జగన్ మాత్రం సభకు దూరంగానే ఉండనున్నారు. ఏదేమైనా.. సభకు హాజరయ్యే విషయంలో వస్తున్న విమర్శలకు జగన్ కొంత తలొగ్గుతున్నట్టు తెలుస్తోంది.
