Begin typing your search above and press return to search.

మావిగన్ తో జగన్ రాజకీయ జూదం !

రాజకీయాల్లో ఎపుడూ దూకుడు అవసరమే. అదే సమయంలో ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ అడుగూ పడాలి.

By:  Satya P   |   1 July 2026 10:50 PM IST
మావిగన్ తో జగన్ రాజకీయ జూదం !
X

రాజకీయాల్లో ఎపుడూ దూకుడు అవసరమే. అదే సమయంలో ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ అడుగూ పడాలి. ఇక చెప్పాలీ అంటే విపక్షంలో ఉన్న వారికి బోలెడు అడ్వాంటేజెస్ ఉంటాయి. వారు ఏమైనా చెప్పవచ్చు. తాము అధికారంలోకి వస్తే కొండ మీద కోతిని అయినా తీసుకుని వస్తామని అనవచ్చు. అయితే ఇలాంటి వాటికి హద్దులు లేకపోయినా కొన్ని కీలక పాలసీల విషయంలో మాత్రం పరిమితంగానే చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సెంటిమెంట్ల విషయంలో ఆచీ తూచీ ముందుకు సాగాల్సి ఉంటుంది. అంటే సంక్షేమ పధకాల విషయంలో కానీ కొన్ని నూతన నిర్ణయాల విషయంలో కానీ జనాలను తమ వైపునకు తిప్పుకునేందుకు విపక్షానికి అధికార పక్షానికి లేని వెసులుబాటు ఉంటుంది కానీ అదే సమయంలో విధానపరమైన నిర్ణయాల విషయంలో మాత్రం అంతగా అవకాశం ఉండదు అని అంటున్నారు.

రాజధాని చర్చతోనే :

ఎప్పటి రాజధాని చర్చ, రాజకీయ రచ్చగా అదెప్పటికి తీరెను అన్నది జనంలో ఉన్న వేదన. అయితే వైసీపీ మాత్రం అమరావతి విషయంలో ప్రతీ ఎన్నికలోనూ తన విధానాలను మార్చేసుకుని ముందుకు పోతోంది. 2014 ఎన్నికల్లో జగన్ బ్రహ్మాండమైన రాజధాని అని హామీతో జనం ముందుకు వచ్చారు. బహుశా వైసీపీకి ఆనాడు ఆలోచనలు ఒంగోలు జిల్లా సమీప ప్రాంతంలో కోస్తాకు గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు మధ్య రాజధాని నిర్మాణం చేద్దామని అయి ఉండొచ్చు. దొనకొండ వద్ద రాజధాని అని కూడా అప్పట్లో వైసీపీ చాయిస్ గా వినిపించింది. కానీ తొలి చాన్స్ మాత్రం టీడీపీకి దక్కింది. దాంతో అమరావతి పేరుతో టీడీపీ ప్రభుత్వం తన ప్రతిపాదనలను ఆచరణలో పెట్టేందుకు వీలు కలిగింది. ఇక దాని మీద విపక్ష నేతగా అసెంబ్లీలో జగన్ అమరావతికి మద్దతు ప్రకటించారు. అయితే పూర్తిగా ప్రభుత్వ భూములలోనే అన్న కండిషన్ తమ మద్దతులో అని తరువాత చెప్పారు వైసీపీ నేతలు.

ఆ రెండు ఎన్నికల్లోనూ :

ఇక 2019 కి వచ్చేసరికి అమరావతి రాజధానిగా గుర్తిస్తున్నట్లుగా వైసీపీ నేతలు ప్రకటించారు. జగన్ ఏకంగా అక్కడ ఇల్లు కట్టుకున్నారని వారంతా గట్టిగానే చెప్పారు. దాంతో టీడీపీ హయంలో మందగమనంలో సాగుతున్న రాజధాని జగన్ హయాంలో పుంజుకుంటుంది అని భావ్వించే ఆయనకు మద్దతుగా రాజధాని ప్రాంతంతో సహా అంతా ఓటెత్తారు అని విశ్లేషణ ఉంది. అందుకే 151 సీట్లు దక్కాయని కూడా చెబుతారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో అయిదేళ్ల కాలమంతా మూడు రాజధానుల నినాదంతో గడిపారు. ఇక 2024 ఎన్నికల వేళ వైసీపీ మూడు రాజధానులకు జనాలు వ్యతిరేకమని స్పష్టం అయింది అన్నట్లుగా తీర్పు వెలువరింది. దాంతో మూడు రాజధానులు అనడం వైసీపీ తగ్గించింది. కానీ దానికి ఆల్టర్నేషన్ ని చూసుకోవడానికి వైసీపీకి రెండేళ్ళ కాలం పట్టింది. 2026 ఏప్రిల్ 1న జగన్ ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ పేరుతో ఒక సంచలన ప్రకటన చేశారు. దాంతో ఇది పెద్ద చర్చగా మారింది.

మావిగన్ వర్సెస్ అమరావతి :

ఇక 2029 ఎన్నికలకు జగన్ మావిగన్ రాజధానిగా తాము జనంలోకి వెళ్తామని అంటున్నారు. పైగా ఎన్నికల మేనిఫెస్టోలో దానిని పెడతామని ఆయన అంటున్నారు. అమరావతికి వ్యతిరేకం కాదంటూనే కొత్త ఆల్టర్నేషన్ ని తీసుకుని వచ్చారు. దాంతో వైసీపీ రాజధాని స్టాండ్ ఏంటి అన్న ప్రశ్నకు క్లియర్ గా జవాబు వచ్చినట్లు అయింది. అది కూడా ఎన్నికలకు మూడేళ్ళు సమయం ఉండగానే. ఒక విధంగా వైసీపీ ఈ విషయంలో రిస్క్ చేస్తోందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా రాజధాని అన్నది ఒక సెంటిమెంట్. ఇక 2024 లో కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి కేంద్రంగా నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. అక్కడ అవినీతి అక్రమాలు జరిగాయి అంటే వాటి మీద వైసీపీ పోరాడవచ్చు, అంతే కాదు ఏపీలో కొత్తగా తాము ఇతర నగరాలను అభివృద్ధి చేస్తామని కూడా వైసీపీ చెప్పుకోవచ్చు. కానీ రాజధాని అంటూ మావిగన్ ని తీసుకుని రావడం మాత్రం సాహసంతో కూడిన అంశంగానే చూస్తున్నారు. ఇది టీడీపీతో వైసీపీ రాజకీయ సమరం అనే దాని కంటే ప్రజల రాజధాని సెంటిమెంట్ మీదనే వైసీపీ కొత్త చాన్స్ తీసుకుంటున్నట్లుగా విశ్లేషిస్తున్నారు. బహుశా వైసీపీకి ఇంతకంటే ఆల్టర్నేషన్ లేదని అనుకోవాలా అన్నది కూడా ఉంది. మరి దీని మీద టీడీపీ మాత్రమే కాదు న్యూట్రల్ జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్న దాని మీదనే వైసీపీ మావిగన్ ఇష్యూ ఆధారపడి ఉంటుంది.